Share News

తుంగభద్ర గేట్ల ఏర్పాటులో సరికొత్త రికార్డు..!

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:17 AM

తుంగభద్ర డ్యాం గేట్ల ఏర్పాటులో సరికొత్త రికార్డు నమోదు కానుంది. 70 ఏళ్లకు పైగా సుదీర్ఘ సేవలు అందించిన క్రస్ట్‌గేట్లకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో నూతన క్రస్ట్‌ గేట్ల ఏర్పాటుకు టీబీపీ బోర్డు శ్రీకారం చుట్టింది.

   తుంగభద్ర గేట్ల ఏర్పాటులో  సరికొత్త రికార్డు..!
తుంగభద్ర డ్యాం గేట్ల ఏర్పాటును పరిశీలిస్తున్న ఏపీ జలవనరుల శాఖ సలహాదారుడు కన్నయ్యనాయుడు

25 క్రస్ట్‌ గేట్లు ఏర్పాటు.. విజయవంతంగా 22 గేట్లు ట్రైల్‌రన

మే 15 నాటికి 33 గేట్లు ఏర్పాటు ప్రక్రియ పూర్తి

జలవనరుల శాఖ సలహదారుడు కన్నయ్యనాయుడు

గేట్ల ఏర్పాటు పనుల పరిశీలన

కర్నూలు, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం గేట్ల ఏర్పాటులో సరికొత్త రికార్డు నమోదు కానుంది. 70 ఏళ్లకు పైగా సుదీర్ఘ సేవలు అందించిన క్రస్ట్‌గేట్లకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో నూతన క్రస్ట్‌ గేట్ల ఏర్పాటుకు టీబీపీ బోర్డు శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ, కర్ణాటక సహకారం, ఆయకట్టు రైతుల త్యాగం వెరసి గడువులోగా నూతన క్రస్ట్‌గేట్ల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 25 గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు 22 గేట్ల ట్రైల్‌రన విజయవంతంగా పూర్తి చేశారు. మంగళవారం ఏపీ జలవనరుల శాఖ (మెకానికల్‌ విభాగం) సలహదారుడు ఎన.కన్నయ్యనాయుడు గేట్లు ఏర్పాటు పనులను పరిశీలించారు. ఇచ్చిన గడువులోగా గేట్లు ఏర్పాటు చేయడం అద్భుతమైన విజయంగా అభివర్ణించారు. మే 15 నాటికి 33 క్రస్ట్‌ గేట్లు ఏర్పాటు ప్రక్రియ పూర్తి అవుతుందని, ఆఖరులోగా విజయవంతంగా ట్రైల్‌రన కూడా చేపట్టవచ్చని వివరించారు.

తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక పల్లెసీమలకు తాగు, సాగునీరు అందించే జీవనాడి తుంగభద్ర ప్రాజెక్టు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రాణాధారం. 1953లో రైతుల సేవలోకి వచ్చిన డ్యాంకు వరద పొటెత్తితే, ప్రాజెక్టు భద్రతా దృష్ట్యా వచ్చిన వరద వచ్చినట్లుగా దిగువకు విడుదల చేసేందుకు 6.50 లక్షల క్యూసెక్కులకు పైగా డిచ్చార్జ్‌ సామర్థ్యంతో 33 క్రస్ట్‌ గేట్లు ఏర్పాటు చేశారు. వీటి జీవిత కాలం 45 ఏళ్లేనని ప్రాజెక్టుల గేట్లు నిపుణులు, ఏపీ జలవనరుల శాఖ సలహదారుడు ఎన.కన్నయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రాజెక్టు భద్రతలో 70 ఏళ్లుగా గేట్లు సేవలు అందించాయి. 2024 ఆగస్టులో డ్యాం 19వ గేటు చైనలింక్‌ తెగిపోయి కొట్టుకుపోవడంతో డ్యాం, గేట్ల భద్రతపై పలు పశ్నలు తలెత్తాయి. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎనడీఎ్‌సఏ), సీడబ్ల్యూసీ మాజీ చైర్మన ఏకే బజాజ్‌ కమిటీ సిఫార్సుల మేరకు కేఎ్‌సఎనడీటీ సర్వీసెస్‌ సంస్థ ద్వారా గేట్లు సామర్థ్యం నిర్ధారణ, రేడియోగ్రఫీ, ఎంపీటీ, అలా్ట్ర సోనిక్‌, డీపీటీ వంటి పరీక్షలు చేయించారు. రూ.46 కోట్లతో పాత గేట్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో 33 కొత్త క్రస్ట్‌ గేట్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణనాయక్‌, బోర్డు ఇంజనీర్ల పర్యవేక్షణలో గుజరాతకు చెందిన హార్డ్‌వేర్‌ టూల్స్‌ సంస్థ పనులు చేపట్టింది.

ఫ రికార్డు స్థాయిలో గేట్లు ఏర్పాటు

తుంగభద్ర డ్యాం క్రస్ట్‌ గేట్ల ఏర్పాటును సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్యకంగా తీసుకుంది. ఖరీఫ్‌ సీజన ప్రారంభం నాటికి మొత్తం 33 గేట్లు స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. రైతులు రబీ పంటను త్యాగం చేశారు. పనులు దక్కించుకున్న హార్డ్‌వేర్‌ టూల్స్‌ సంస్థ గత ఏడాదే క్రస్ట్‌గేట్ల గేట్ల తయారి (ఫ్యాబ్రికేషన) పనులు చేపట్టింది. గత డిసెంబరు 6న డ్యాం పాత గేట్లు తొలగించి కొత్త గేట్లు ఏర్పాటు పనులు మొదలు పెట్టారు. పూర్తిగా తుప్పుపట్టిన 18వ నంబరు గేటును జనవరి 12 నాటికి పూర్తి చేసి విజయవంతంగా ట్రైల్‌రన పూర్తి చేసి పురోగతిలో తొలిమెట్టు అధిగమించారు. పనులు మొదలు పెట్టి మంగళవారం నాటికి 129 రోజులైంది. ఇప్పటికే 25 గేట్లు ఏర్పాటు (ఎరక్షన) పూర్తి చేశారు. 1,2,3,4,5,6, 11,12,17,18,19, 20,24,25,26, 27,28,29, 30,31,32,33 నంబరు గేట్ల ట్రైల్‌ రన విజయవంతంగా చేశారు. 7,9,21 నంబరు గేట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. 8,10,13,16,22 నంబరు గేట్లు ఏర్పాటు ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నాయి. కేవలం నాలుగు నెలల వ్యవధిలో 25 గేట్లు అమర్చడం దేశంలోనే ఓ సరికొత్త రికార్డు అని ఇంజనీర్లు పేర్కొంటున్నారు.

ఫ ప్రతి గేటు క్షుణంగా పరిశీలన

తుంగభద్ర డ్యాం క్రస్ట్‌ గేట్లు ఏర్పాటు పనులను ఏపీ జలవనరుల శాఖ సలహదారుడు ఎన.కన్నయ్యనాయుడు పరిశీలించారు. ఆయన వెంట ఏపీ వర్క్‌షాప్‌ సలహదారుడు మెకానికల్‌ ఇంజనీరు కృష్ణారావు, టీబీపీ బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి, కర్ణాటక రాష్ట్రం మునిరాబాద్‌ సీఈ మలిగవాడ, బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్‌, డ్యాం ఈఈ చంద్రశేఖర్‌ ఉన్నారు. సోమ, మంగళవారాలు రెండు రోజులు ప్రతి గేటును క్షుణంగా పరిశీలించారు. గేటు వెల్డింగ్‌, రబ్బర్‌ సీల్స్‌ సక్రమంగా అమర్చారా..? సిల్‌బీమ్‌ లెవల్‌లో గేటు సక్రమంగా అమర్చారా..? ఏమైనా గ్యాపులు ఉన్నాయా..? వెల్డింగ్‌ చేసిన ఇనుప ముక్కలు సిల్‌బీమ్‌పై పడేశారా..? ఇలా ప్రతిదీ పరిశీలించారు. క్రస్ట్‌ గేట్లు నిర్వహణలో కీలకమైన డ్యాం హాయిస్ట్‌ వంతెనాపై మోటర్లు, చైన యంత్రాలు, బెవెల్‌ గేర్లు.. వంటివి తనిఖీ చేశారు. గేట్లు ఏర్పాటు, నిర్వహణపై టీబీపీ బోర్డు ఇంజనీర్లకు కీలక సూచనలు చేశారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటలు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు, రెండో రోజు మంగళవారం ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు గేట్ల ఏర్పాటు పనులు పరిశీలించారు.

ఫ మే 15 నాటికి గేట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి

- ఎన.కన్నయ్యనాయుడు, ఏపీ జలవనరుల శాఖ సలహదారుడు

తుంగభద్ర డ్యాం గేట్లు ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే 25 గేట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. 22 గేట్లు ట్రైల్‌రన పూర్తి చేసుకున్నాయి. ఐదు గేట్లు వివిధ దశల్లో ఉన్నాయి. తక్కువ సమయంలో గేట్లు ఏర్పాటు చేయడం దేశంలో సరికొత్త రికార్డుగా నిలిచింది. కర్ణాటక ప్రభుత్వ సహకారంతో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సాధించిన అద్భుత విజయం ఇది. రైతులు పంటను త్యాగం చేయడం వల్లే ఇది సాధ్యమైంది. టీబీపీ బోర్డు ఇంజనీర్లు ఎంతో కష్టపడుతున్నారు. వచ్చే ఖరీ్‌ఫకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు నీళ్లు ఇవ్వవచ్చు. ఇంజనీరింగ్‌ నిబంధనలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో క్రస్ట్‌ గేట్లు ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది.

Updated Date - Apr 15 , 2026 | 12:17 AM