Share News

సరికొత్త ధరలు

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:39 AM

భూముల మార్కెట్‌ విలువల సరికొత్త సవరణలకు రంగం సిద్ధమైంది. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లా జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో పండుగ సెలవులను కూడా ఉన్నతాధికారులు రద్దు చేశారు. దీంతో రిజిస్ర్టేషన్స్‌ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

 సరికొత్త ధరలు

- భూముల మార్కెట్‌ విలువల సవరణకు సన్నద్ధం

- ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లా జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్లకు మౌఖిక ఆదేశాలు

- పండుగ సెలవులను కూడా రద్దు చేసిన ఉన్నతాధికారులు

- రెవెన్యూ నుంచి సర్వే నెంబర్లు, కమర్షియల్‌ అసెస్మంట్ల స్వీకరణ

- ఎన్‌హెచ్‌, ఎస్‌హెచ్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయితీరాజ్‌ రోడ్ల వెంబడి స్థలాల డేటా సేకరణ

- సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు డీఐజీకి ప్రతిపాదనలు

భూముల మార్కెట్‌ విలువల సరికొత్త సవరణలకు రంగం సిద్ధమైంది. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లా జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో పండుగ సెలవులను కూడా ఉన్నతాధికారులు రద్దు చేశారు. దీంతో రిజిస్ర్టేషన్స్‌ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

మార్కెట్‌ విలువలను సవరించేందుకు సరి‘కొత్త’ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా రిజిస్ర్టేషన్స్‌ శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. సోమవారం నాటికి ఈ ప్రతిపాదనలను పంపించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం పూర్తి చేసే వరకు సబ్‌ రిజిస్ర్టార్లు, ఉద్యోగులకు సెలవులు లేవని తెలిపారు. దీంతో భోగి పండుగ రోజున కూడా సెలవులు తీసుకోకుండా రిజిస్ర్టేషన్స్‌ శాఖ అధికారులు మార్కెట్‌ విలువల సవరణ కసరత్తును ప్రారంభించారు. సంక్రాంతి, కనుమ రోజున కూడా పనిచేయనున్నారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నాలాగా మార్చిన సర్వే నెంబర్లు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా పరిషత, మండల పరిషత రోడ్లను ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ల వివరాలను రెవెన్యూ అధికారుల నుంచి డేటా తీసుకోవాలని ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలోని జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్లకు నిర్దేశించారు. రెవెన్యూ యంత్రాంగం ద్వారా కొత్తగా చేర్చిన వాణిజ్య డోర్‌ నెంబర్లను సేకరించాలని సూచించారు. సీఆర్‌డీఏ ద్వారా జారీ చేసిన లే అవుట్లు, కార్పొరేషన్‌, మునిసి పాలిటీలు, నగర పంచాయతీలు తదితర స్థానిక సంస్థల నుంచి కొత్తగా ఏర్పడిన వెంచర్ల సర్వే నెంబర్లను సేకరించాలని ఆదేశించారు. మార్కెట్‌ విలువల సవరింపునకు సంబంధించి డేటాను పొందుపరచటానికి తగిన ఫార్మాట్లను జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్లకు పంపారు. ఫారం 1, 2, 3, 4 లలో వర్గీకరణ మార్పు, సర్వే నెంబర్ల ప్రతిపాదనలను విడిగా సిద్ధం చేయాలని ఫార్మాట్లలో నింపిన డేటాను సోమవారం సాయంత్రంలోగా సవరణ కమిటీల ముందు సమర్పించాలని నిర్దేశించారు. అందరి నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత డీ ఐజీ వాటిపై సమీక్షిస్తారు.

సవరణపై ప్రజల స్పందన ఎలా ఉంటుందో?

రిజిస్ర్టేషన్స్‌ శాఖ అధికారులు మరోమారు మార్కెట్‌ విలువలను సవరించేందుకు కసరత్తు చేయటంతో ప్రజలు ఈ చర్యలను ఎలా తీసుకుంటారన్నది ఆసక్తికరంగా ఉంది. గతేడాది సవరింపుల నేపథ్యంలో ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలో ఈ ఏడాది వచ్చిన అసాఽధారణ మార్పులు అయితే పెద్దగా లేవు. ర్యాపిడ్‌ గ్రోత ఏరియాలైన గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు ఎన్టీఆర్‌ జిల్లాలో విలీనమవుతాయని భావించినా అది జరగలేదు. విజయవాడ గ్రేటర్‌ విలీన ప్రతిపాదన కూడా తాత్కాలికంగా అటకెక్కింది. దీంతో ర్యాపిడ్‌ గ్రోత ఏరియాలలో అసాధారణ మార్పులనేవి చోటు చేసుకోలేదు. ఇలాంటపుడు మళ్లీ మార్కెట్‌ విలువలను సవరించటమన్న దానిని ప్రజలు సానుకూలంగా తీసుకునే పరిస్థితి ఎంత వరకు ఉందో వేచిచూడాలి.

ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ నేపథ్యంలోనేనా!

ఇటీవల కాలంలో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌లకు అవకాశం కల్పించింది. దీంతో ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసాధారణ మార్పులు ఏమైనా జరుగుతాయని రిజిస్ర్టేషన్స్‌ శాఖ అధికారులు ఊహించారేమో అంతు చిక్కటం లేదు.

వరుసగా రెండో ఏడాది కూడా..

వరుసగా రెండో ఏడాది కూడా మార్కెట్‌ విలువల సవరింపును ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారన్నది చర్చనీయాంశమవుతోంది. స్టాంపు డ్యూటీ 7.5 శాతం, అపార్ట్‌మెంట్స్‌కు జీఎస్టీ ఐదు శాతం, రూ.50 లక్షల ఆస్థిపై టీడీఎస్‌ ఒక శాతం, ఆదాయపు పన్ను వంటివి భారంగా ఉన్నాయన్న అభిప్రాయం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్‌ విలువల సవరింపును ఏ విధంగా స్వీకరిస్తారన్నది చర్చకు దారితీస్తోంది.

Updated Date - Jan 15 , 2026 | 12:39 AM