Share News

Pattadar Passbooks: రైతులకు కొత్త సంవత్సర కానుక

ABN , Publish Date - Jan 03 , 2026 | 06:30 AM

ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు.

Pattadar Passbooks: రైతులకు కొత్త సంవత్సర కానుక

  • రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ

  • మంత్రులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్‌

  • ఈ కార్యక్రమంలో ఒక రోజు పాల్గొననున్న సీఎం

  • కలెక్టర్లతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఈ కార్యక్రమంపై టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రులతో సమీక్ష నిర్వహించారు. పాస్‌పుస్తకాల పంపిణీ గురించి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నాటి సీఎం ఫొటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారన్నారు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజల అసంతృప్తి నేపథ్యంలో రీ సర్వే తప్పులను సరిదిద్ది కొత్త పాస్‌పుస్తకాలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని, దాన్ని ఇప్పుడు నెరవేరుస్తున్నామన్నారు. భూమే ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడమే మన లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుతో ప్రజలను అభద్రతకు దూరం చేశామని అన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ ప్రారంభమైందన్నారు. శుక్రవారం నుంచి 9 వరకు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ ప్రారంభించామని తెలిపారు. పాస్‌పుస్తకాలపై నాటి పాలకులు తమ బొమ్మలకు రూ.22 కోట్లు తగలేశారని, ఇప్పుడు జగన్‌ బొమ్మతో ఉన్న పాస్‌పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న పుస్తకాల పంపిణీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. ప్రజలకు భూవివాదాలు లేకుండా చేయడం మన ప్రథమ కర్తవ్యం కావాలని, నిర్దిష్ట సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని ఆదేశించారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో ఎక్కువ చొరవ తీసుకోవాలని సూచించారు. తాను కూడా పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీలో ఒకరోజు పాల్గొంటానని సీఎం పేర్కొన్నారు.


ప్రతి నెలా పంపిణీ: సీఎస్‌

రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఆదేశించారు. రెవెన్యూ సంబంధిత సమస్యలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో 9వ తేదీ వరకు కొత్త పాస్‌ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడాది పాటు ప్రతినెలా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి భూమి ఉన్న ప్రతి రైతుకూ కొత్త పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు అందిస్తామన్నారు. వివిధ రైల్వే ప్రాజెక్టులు, రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ల స్థానంలో నిర్మించే ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలకు భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. వర్చువల్‌గా పాల్గొన్న రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్‌ సాయిప్రసాద్‌ మాట్లాడుతూ.. రైతుల వద్ద ఉన్న పాత పట్టాదారు పాస్‌ పుస్తకాలను తీసుకుని కొత్తవి పంపిణీ చేయాలని, పాత పుస్తకాలను ఏవిధంగా మనుగడలో లేకుండా చేయాలో ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. నీటి పన్నును రైతుల నుంచి బలవంతంగా వసూలు చేయకుండా వారిని ఒప్పించి సక్రమంగా వసూలు జరిగేలా చూడాలన్నారు.


రీ సర్వేలో ఏపీ నంబర్‌ వన్‌: పెమ్మసాని

గుంటూరు(తూర్పు), జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ‘రీ సర్వే ప్రక్రియ నా శాఖలో ఉంది. ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహిస్తాను. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు చైన్‌ ద్వారా భూమిని కొలిచేవారని, ప్రస్తుతం సాంకేతికతను వినియోగించుకుంటున్నట్టు చెప్పారు. డాక్యుమెంట్‌తో అవసరం లేదని, అయినా రైతులకు వారి భూమికి సంబంధించిన వివరాలు తెలిసేలా పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఈ పథకం అమలులో ఏపీ ముందుండటంతో కేంద్రంరూ.400 కోట్లు ప్రోత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. ఒక వ్యక్తి తానే శాశ్వతం అనుకుని పట్టాదారు పాస్‌పుస్తకాలపై బొమ్మలకు రూ.20 కోట్లు, భూమి సరిహద్దు రాళ్ల కోసం రూ.750 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించి శాశ్వత పరిష్కారం చూపారని అన్నారు. సర్వే సెటిల్‌మెంట్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌ ఆర్‌.కూర్మనాథ్‌ మాట్లాడుతూ.. రీ సర్వేలోని తప్పిదాలను సరిచేస్తూ నిజమైన హక్కుదారుకు వారి పేరుతో రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇస్తున్నామని చెప్పారు.


  • ఇక భూ సమస్యలు ఉండవు

  • రీ సర్వే గ్రామాల్లో రాజముద్రతో పాస్‌ పుస్తకాలు

  • బాపట్ల జిల్లాలో మంత్రి సత్యప్రసాద్‌ పంపిణీ

కొల్లూరు, జనవరి 2(ఆంధ్రజ్యోతి): భూమికి సంబంధించిన సేవలను సరళీకృతం చేసి భావితరాలు భూసమస్యలతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. శుక్రవారం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో రీ సర్వే చేసిన భూములకు రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజముద్రతో ముద్రించిన పాస్‌ పుస్తకాలను రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, సీసీఎల్‌ఏ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, కలెక్టర్‌ వాసుదేవ వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 06:33 AM