నూతన సమాచార కమిషనర్ల ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Jan 21 , 2026 | 04:12 AM
ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్‌కు తాజాగా నియమితులైన కమిషనర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్‌కు తాజాగా నియమితులైన కమిషనర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో తొలుత రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావుతో సీఎస్ ప్రమాణం చేయించారు. అలాగే సమాచార కమిషనర్లుగా నియమితులైన పరవాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు, ఆదెన్న గాజుల, వట్టికూటి శరత్‌చంద్ర కళ్యాణ చక్రవర్తి ప్రమాణం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాల మేరకు నూతన కమిషనర్లతో సీఎస్ ప్రమాణం చేయించి, వారికి పుష్పగుచ్చాలు అందించి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.