రాష్ట్రం నుంచి మరో 2 హైస్పీడ్ రైల్ కారిడార్లు!
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:22 AM
దక్షిణాదిన నిర్మించబోయే రెండు హైస్పీడ్ రైల్ కారిడార్లకు ఏపీ రాజధాని అమరావతితో లింకు ఏర్పడనుంది. తొలుత హైదరాబాద్-చెన్నై కారిడార్‌లో మాత్రమే అమరావతిని కేంద్రం చేర్చింది.
అమరావతి టూ చెన్నై, బెంగళూరుకు కనెక్టివిటీ.. మైసూరు-చెన్నై కారిడార్‌ను
నాయుడుపేటకు లింక్ చేయాలని సీఎం వినతి.. ఆమోదించి ప్రాజెక్టులో చేర్చిన కేంద్రం
గుంటూరు, చీరాల, నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి ఒక కారిడార్
నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారుపేట, బెంగళూరు, మాండ్య మీదుగా మైసూరుకు మరొకటి
గుంటూరు, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): దక్షిణాదిన నిర్మించబోయే రెండు హైస్పీడ్ రైల్ కారిడార్లకు ఏపీ రాజధాని అమరావతితో లింకు ఏర్పడనుంది. తొలుత హైదరాబాద్-చెన్నై కారిడార్‌లో మాత్రమే అమరావతిని కేంద్రం చేర్చింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల మైసూరు-చెన్నై కారిడార్‌లో చిత్తూరు నుంచి తిరుపతి మీదుగా నాయుడుపేటకు లింకు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా దానిని కూడా తాజాగా ఆమోదించి మ్యాప్‌లో చేర్చింది. దీని వల్ల అమరావతి నుంచి గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి ఒక కారిడార్ ఏర్పాటవుతుంది. నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారపేట, బెంగళూరు, మాండ్య మీదుగా మైసూరుకు మరొకటి వస్తుంది. దేశంలో ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇందుకోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారానే వివిధ కారిడార్ల డీపీఆర్‌ల రూపకల్పన, మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్, కారిడార్ నిర్మాణం వంటి పనులు పూర్తి చేస్తోంది. ఇటీవలి బడ్జెట్‌లో కేంద్రం కొత్తగా మరికొన్ని హైస్పీడ్ రైల్ కారిడార్లను చేర్చింది. తెలంగాణ, ఆంధ్ర తమిళనాడు, కర్ణాటకలకు ఉపయోగపడేలా 2 కారిడార్లను మంజూరుచేసింది. ఇందులో ఒకటి హైదరాబాద్-శంషాబాద్-నల్గొండ-సూర్యా పేట-కోదాడ-నందిగామ-అమరావతి/ విజయవాడ-గుంటూరు- చీరాల-ఒంగోలు -నెల్లూరు- నాయుడుపేట-శ్రీసిటీ-చెన్నై కాగా.. మరొకటి మైసూరు-మాండ్య-బెంగళూరు-బంగారుపేట -చిత్తూరు-అరక్కోణం-పూనమల్లె-చెన్నై.
అయితే రెండు కారిడార్లలోనూ తిరుపతి లేదు. దీంతో చంద్రబాబు.. మైసూరు-చెన్నై కారిడార్‌లో చిత్తూరు నుంచి తిరుపతి మీదుగా నాయుడుపేటకు లింకును ప్రతిపాదించారు. నాయుడుపేట నుంచి అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై కారిడార్ ఎలైన్‌మెంట్ ఉన్న నేపథ్యంలో అమరావతికి ఇటు చెన్నై, అటు బెంగళూరు, మైసూరుతో కూడా కనెక్టివిటీ ఏర్పడుతుంది. సీఎం ప్రతిపాదన ఆమోదయోగ్యంగా ఉండడంతో కేంద్రం నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ చిత్రపటంలో చిత్తూరు-తిరుపతి-నాయుడుపేట లింకును చేర్చింది. వచ్చే ఏడాది నాటికి వీటి డీపీఆర్‌లు రూపొందించి.. నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు సమాచారం. 2029కి ముందే శంకుస్థాపనలు పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈలోపు రాజధాని అమరావతికి ఒక రూపు వస్తుంది.