Share News

అమరావతిలో హజ్‌ హౌస్‌!

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:36 AM

ముస్లింలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

అమరావతిలో హజ్‌ హౌస్‌!

  • వక్ఫ్‌ ఆస్తులను కాపాడుతాం

  • 21 నెలల్లో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అందించాం

  • ముస్లింలకు అండగా ఉంటాం

  • బెజవాడ నుంచే హజ్‌ యాత్రకు

  • ఇఫ్తార్‌ విందులో చంద్రబాబు

  • ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ

విజయవాడ, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ముస్లింలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇమామ్‌, మౌజన్‌లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. రాజధాని అమరావతిలో నూతనంగా ‘హజ్‌ హౌస్‌’ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 21 మాసాల్లో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. శనివారం విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో సీఎం పాల్గొన్నారు. తొలుత ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారికి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్‌ హౌస్‌ను త్వరలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ‘‘4.38 లక్షల మంది ముస్లింలకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు ఇస్తున్నాం. ఏడాదికి రూ.3,511 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 4.5 లక్షల మంది ముస్లిం విద్యార్థులకు ‘తల్లికి వం దనం’ ఇస్తున్నాం. 19,215 మంది ముస్లిం విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌ షిప్పులకు రూ.264 కోట్లు విడుదల చేశాం. ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజన్లకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతన ఇస్తున్నాం. ఇప్పటి వరకు రూ.180 కోట్లు గౌరవ వేతనంగా అందించాం.’’ అని చంద్రబాబు అన్నారు.


అర్హత కలిగిన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వివాహ లైసెన్స్‌ గడువు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచామని చెప్పారు. టీడీపీ హయాంలోనే గతంలో హైదరాబాద్‌ నుంచి ముస్లింలను హజ్‌ యాత్రకు పంపించామని గుర్తుచేశారు. 1,500 వక్ఫ్‌ ఆస్తులను సర్వే చేశామని, వాటిని కాపాడుతున్నామని సీఎం చెప్పారు. కాగా, ఇఫ్తార్‌ విందులో భాగంగా డాక్టర్‌ జావేద్‌ రాసిన ‘‘గోలు అండ్‌ పప్పా- ఫస్ట్‌ ఎయిడ్‌ ఫర్‌ ఎవ్రీ హోం’’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు.


ఇమామ్‌లు, మౌజన్లకు రూ.45 కోట్లు

మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్‌లు, మౌజన్ల గౌరవ వేతనాల చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.45 కోట్లు విడుదల చేసింది. మైనార్టీ సంక్షేమశాఖ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని 5000 వేల మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్‌లు, మౌజన్లకు 2025 అక్టోబరు నుంచి 2026 మార్చి వరకు ఆరు నెలలకు ప్రతి మసీదులో నెలకు రూ.15000 వేల చొప్పున గౌరవ వేతనం అందించేందుకు ఈ నిధులు విడుదల చేసింది.

Updated Date - Mar 17 , 2026 | 04:37 AM