Vishakhapatnam: రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్‌కు కొత్త ఔషధం!
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:12 AM
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో క్యాన్సర్ ఒకటి..! భారత్‌లోనూ కొన్నేళ్లుగా రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. బాధితులకు మందులు, శస్త్రచికిత్సలు...
ఏయూ కెమిస్ర్టీ విభాగం పరిశోధకుల అభివృద్ధి
మూడేళ్ల కృషికి దక్కిన పేటెంట్ ఫలితం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో క్యాన్సర్ ఒకటి..! భారత్‌లోనూ కొన్నేళ్లుగా రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. బాధితులకు మందులు, శస్త్రచికిత్సలు, కీమో వంటి విధానాల్లో చికిత్స అందిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటోంది..! అయితే రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్‌పై దివ్యౌషధంలా పనిచేసే మెడిసిన్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కెమిస్ర్టీ విభాగానికి చెందిన పరిశోధక బృందం అభివృద్ధి చేసింది. మూడేళ్లపాటు శ్రమించి వారు తయారుచేసిన ఈ ఔషధం క్యాన్సర్‌పై సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి చెందిన పేటెంట్ ఆఫీస్ కొద్దిరోజుల క్రితమే దానికి పేటెంట్‌ను అందించింది. దీంతో ఈ మెడిసిన్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇంజనీరింగ్ కెమిస్ర్టీ విభాగాధిపతి, వర్సిటీ ఐపీఆర్ చైర్, ఆర్ అండ్ ప్రాజెక్టు హెడ్ ప్రొఫెసర్ బి.కిశోర్‌బాబు, పరిశోధక విద్యార్థి భీశెట్టి వెంకట శివ అప్పారావు ఈ పరిశోధన సాగించారు. కో-గైడ్‌గా ప్రొఫెసర్ స్వర్ణలత వ్యవహరించగా, వీర్రాజు, గోపి సహకారం అందించారు. ఈ పరిశోధనలో భాగంగా నాప్తాలిమైడ్ డెరివేటివ్ సమ్మేళనంతో కూడిన ఔషదాన్ని వారు తయారు చేశారు. దీనికి నాప్తాలిమైడ్ డెరివేటివ్‌గా నామకరణం చేశారు. పరిశోధనల్లో భాగంగా ఈ మందుని పలు రకాల క్యాన్సర్ కణాలపై పరీక్షించగా... రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్‌కు కారణమవుతున్న కణాలపై సమర్థంగా పనిచేసినట్టు తేల్చారు.
తదుపరి దశకు తీసుకువెళ్లేలా..
ఏయూ పరిశోధక బృందం చేసిన ఈ ఆవిష్కరణకు 20 ఏళ్ల కాలానికి పేటెంట్ దక్కింది. ఈ పేటెంట్ కాలంలో మందు తయారీపై హక్కులు పరిశోధకులకు దక్కనున్నాయి. అయితే ఈ ఔషధంలోని సామర్థ్యాన్ని గుర్తించిన విశాఖ నగరానికి చెందిన ఒకప్రముఖ క్యాన్సర్ ఆస్పత్రి వీరితో ఎంవోయూ చేసుకుంది. కొద్ది రోజుల్లోనే అన్ని అనుమతులతో జంతువులు,మనుషులపై ట్రయ ల్స్ నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు ప్రొఫెసర్ బి.కిశోర్‌బాబు తెలిపారు.