Share News

New District Dream Fulfilled: కొత్త జిల్లా కల సాకారం

ABN , Publish Date - Jan 01 , 2026 | 05:13 AM

నూతనంగా ఆవిర్భవించిన మార్కాపురం, పోలవరం జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలు అట్టహాసంగా జరిగాయి.

New District Dream Fulfilled: కొత్త జిల్లా కల సాకారం

  • సందడిగా మార్కాపురం, పోలవరం జిల్లాల కార్యాలయాలు ప్రారంభం

మార్కాపురం/ రంపచోడవరం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): నూతనంగా ఆవిర్భవించిన మార్కాపురం, పోలవరం జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. బుధవారం మార్కాపురంలో తీన్‌మార్‌ మోతలు, డప్పు కళాకారుల కేరింతలు, కూటమి నేతల ఆహ్వానాలతో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయస్వామికి, ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన ప్రకాశం కలెక్టర్‌ రాజాబాబుకు మార్కాపురం వాసులు పూలవర్షంతో స్వాగతం పలికారు. తమ కల సాకారమైన సమయమంటూ నినాదాలతో హోరెత్తించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవనం కోసం తర్లుపాడు రోడ్డులో గోగులదిన్నె గ్రామపరిధిలో వెలిగొండ ముంపు గ్రామం సుంకేసుల కోసం నిర్మించిన పునరావాస కాలనీలో ఉన్న పాఠశాల భవనాల్లో ఉన్న గదులను కేటాయించారు. వీటికి రాత్రికి రాత్రే మరమ్మతులు చేశారు. జిల్లా కలెక్టర్‌ చాంబర్‌ను సిద్ధం చేశారు. ఆ చాంబర్‌లో రాజాబాబు, అలాగే డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్పీ కార్యాలయంలో ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి స్వామి మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లా ఏర్పాటు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే నెరవేరుస్తారనే నమ్మకాన్ని రుజువు చేసుకున్నారని అన్నారు. జిల్లా ఏర్పాటు చేయటమే కాకుండా జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేయటం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు శాశ్వత మేలు చేస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఏర్పాటు ద్వారా తన జన్మ ధన్యమైందని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. జిల్లా కోసం గతంలో 63 రోజులు ఉద్యమం చేస్తే తమకు అడ్డంకులు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం జిల్లా ఏర్పాటు చేశారని, ఆయనకు జన్మజన్మలా రుణపడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రంపచోడవరంలో.. రంపచోడవరం కేంద్రంగా పోలవరం కొత్త జిల్లా కార్యాలయం రంపచోడవరంలోని యువజన శిక్షణా కేంద్రం(వైటీసీ)లో ప్రారంభమైంది. అల్లూరి జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి ఎస్పీగా అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ బాధ్యతలు స్వీకరించి జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించారు. ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌గా అల్లూరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తిరుమని శ్రీపూజ బాధ్యతలను చేపట్టారు. కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి, రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైౖర్మన్‌ చోళ్ల బొజ్జిరెడ్డి, ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా కలెక్టర్‌ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

మదనపల్లె కేంద్రంగా మొదలైన పాలన

మదనపల్లె కేంద్రంగా బుధవారం నుంచి అన్నమయ్య జిల్లా పాలన మొదలైంది. కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌కు మదనపల్లె సబ్‌కలెక్టర్‌ చల్లా కళ్యాణి సాదర స్వాగతం పలికారు. ఇప్పటి వరకు ఉన్న సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొత్త కలెక్టరేట్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

మోదీ, బాబు, పవన్‌ చిత్రపటాలకు పాలాభిషేకం

రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ఆధ్వర్యంలో కూటమి పార్టీల నాయకులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్టీరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్‌ కట్‌ చేశారు. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాన్నే జిల్లాను చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లదని ఎమ్మెల్యే అన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 05:14 AM