డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో.. అనంతబాబు భార్యకూ పాత్ర!
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:24 AM
తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని అతడి ఇంటికే డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
కాల్‌డేటా, సీసీ ఫుటేజీ ఆధారంగా నిర్ధారణ
ఆమెను ఏ-2గా చేర్చిన ప్రాసిక్యూషన్
హత్యచేశాక వారిద్దరూ ఎక్కడ తిరిగారో,ఎవరితో మాట్లాడారో ఆధారాలు సమర్పణ
పరారీలో అనంతలక్ష్మీదుర్గ.. ‘బెయిల్’ కోసం హైకోర్టులో పిటిషన్
కాకినాడ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని అతడి ఇంటికే డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో ఆయన భార్య అనంతలక్ష్మీదుర్గ పాత్ర కూడా ఉందని ప్రాసిక్యూషన్ తాజాగా పేర్కొంది. ఈ కేసులో ఆమెను ఏ-2గా చేరుస్తూ కోర్డులో అనుబంధచార్జిషీటు దాఖలుచేసింది. హత్య సమయంలో అనంతబాబుతోపాటు ఆమె కూడా ఉన్నారని.. మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసేముందు.. దానిని కారులోనే ఉంచి తమ అపార్ట్‌మెంట్‌లోకి ఇద్దరూ లిఫ్టులో వెళ్లినట్లు సీసీ పుటేజీ ఆధారాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. హత్య అనంతరం ఆమె కాల్ డేటా ఆధారంగా కూడా ఆమె పాత్రను నిర్ధారించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. దళితుడైన తన కారుడ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని 2022 మే 19న హత్య చేసి, మృతదేహాన్ని అతడి ఇంటికి డోర్‌డెలివరీ చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదైనా దర్యాప్తు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తదుపరి విచారణకు ప్రాసిక్యూషన్ అనుమతి కోరగా.. రాజమండ్రి అట్రాసిటీ కోర్టు సమ్మతించింది. ఈనేపథ్యంలో ప్రాసిక్యూషన్ సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసింది. కాగా, అనంతబాబు భార్య పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆమె ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.