Share News

మళ్లీ కరోనా కలకలం!

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:16 AM

ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇటీవల నమోదైన కొన్ని కేసుల్లో రెండు మరణాలు సంభవించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

మళ్లీ కరోనా కలకలం!

  • కడప జిల్లాలో కరోనాతో ఇద్దరి మృతి.. వైద్య విద్యార్థికి కూడా కొవిడ్‌ పాజిటివ్‌

  • జిల్లాలో 8 కేసులు.. గోప్యత పాటిస్తున్న అధికారులు

  • అప్రమత్తమైన ఆరోగ్య శాఖ.. కడపకు ప్రత్యేక బృందాలు

  • మరో 40 మంది నుంచి శాంపిల్స్‌ సేకరణ

  • 18 మందికి నెగెటివ్‌.. మిగిలిన రిపోర్టుల కోసం ఎదురుచూపు

అమరావతి, కడప సెవెన్‌రోడ్స్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇటీవల నమోదైన కొన్ని కేసుల్లో రెండు మరణాలు సంభవించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జిల్లాలో ప్రస్తుతం 8 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. రాజంపేటకు చెందిన వ్యక్తి(52) దగ్గు, జ్వరంతో గత నెల తిరుపతి స్విమ్స్‌కు వెళ్లారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలడంతో కుటుంబ సభ్యులు ఆయనను వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 28న మృతిచెందాడు. కడప నగరానికి చెందిన వ్యక్తి (43) ఈ నెల 1న కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి క్షయ వార్డులో చేరాడు. ఆయనకు 6న కొవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారించారు. ఆస్పత్రిలోని కొవిడ్‌ ఐసీయూలో చికిత్స పొందుతూ 7న ఆయన చనిపోయాడు. కడప వైద్య కళాశాలలో 25 ఏళ్ల వైద్య విద్యార్థికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. సదరు విద్యార్థి హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 8 కరోనా కేసులు ఉన్నాయని శుక్రవారం జరిగిన కడప జడ్పీ సర్వసభ్య సమావేశంలో వైద్యాధికారులు చెప్పారు. అయితే ఈ వివరాలేవీ బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచుతున్నారు. కాగా.. కడప, రాజంపేటలో అకస్మాత్తుగా కొవిడ్‌ కేసులు వెలుగులోకి రావడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.


వెంటనే రెండు స్టేట్‌ ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (ఎస్‌పీపీఎం)లను కడపకు పంపించింది. ఈ బృందాలు శుక్రవారం కొవిడ్‌ కేసులు నమోదైన ప్రాంతంలో పర్యటించాయి. దాదాపు 40 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించాయి. వాటిలో దాదాపు 18 మందికి నెగిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. మరికొంత మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ కోరింది. కాగా, కడపలో కరోనా వెలుగులోకి రావడంతో ఆరోగ్యశాఖ బోధనాస్పత్రులను అలెర్ట్‌ చేసింది. ప్రతీచోట కనీసం 10 బెడ్స్‌ ఉండేలా ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేయాలని ఆదేశించింది.

Updated Date - Jul 11 , 2026 | 05:16 AM