2 వేలకోట్ల భూ దోపిడీకి స్కెచ్
ABN , Publish Date - May 18 , 2026 | 04:29 AM
ఎప్పుడో బ్రిటీషు కాలం నాటి ఇనామ్ ఫెయిర్ అడంగల్(ఐఎఫ్ఆర్) ప్రకారం నెల్లూరు బిట్-1లోని కొత్తూరులో 371 ఎకరాల ఇనామ్ భూమి ఉంది. ఇది వ్యక్తిగత ఇనామ్. రికార్డుల్లో ఇద్దరు ఇనామ్‌దారుల పేరిట ఆ భూమి పట్టాగా ఉంది.
నెల్లూరులో ఇనామ్ భూములపై గత ప్రభుత్వ సలహాదారు కన్ను!
371 ఎకరాలు కొట్టేసేందుకు పన్నాగం
ఓ ప్రజాప్రతినిధి, అధికారి సహకారం
గత ప్రభుత్వంలోనూ ప్రయత్నాలు
హైకోర్టు ఆదేశంతో 2013లో సెటిల్ చేసిన కేసుపై 2023లో అప్పీల్స్ కమిషనర్ వద్ద విచారణ
మళ్లీ విచారించేలా ఉత్తర్వులు
కూటమి సర్కారు రాకతో మౌనం
ఇప్పుడు మళ్లీ ఆ మాంత్రికుడి కుట్ర
ఇనామ్‌కు ఇవ్వాల్సింది రైత్వారీ పట్టాలు
కానీ ప్రైవేట్ భూమిగా తేల్చే యత్నాలు
నెల్లూరు నగరం దగ్గరలోని కొత్తూరులో 371 ఎకరాల ఇనామ్ భూమి ఉంది. ఒక్కో ఎకరం ధర దాదాపు రూ.6-10 కోట్లు. మొత్తం ఈ భూమి కనీస విలువ 2 వేలకోట్లకు పైనే. త్వరలో అక్కడి నుంచే ఔటర్ రింగ్ రోడ్డు కూడా వెళ్తుందని చెబుతున్నారు. గత జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఒకాయన మరోసారి ఈ భూమిపై కన్నేశారు. ఆ భూమిని ప్రైవేటుదిగా చూపించి పట్టాలు ఇప్పించే దొంగపనికి ఆయన తెరవెనక మంత్రాంగం నడుపుతున్నారు. ఇందుకు ఓ ప్రజాప్రతినిధి, ఓ అధికారి సహకరిస్తున్నారు. ప్రభుత్వానికి లేదా ఇనామ్‌దారులు, సుదీర్ఘకాలంగా సాగులో ఉన్నవారికి దక్కాల్సిన భూమిని గద్దలా తన్నుకుపోయేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఎప్పుడో బ్రిటీషు కాలం నాటి ఇనామ్ ఫెయిర్ అడంగల్(ఐఎఫ్ఆర్) ప్రకారం నెల్లూరు బిట్-1లోని కొత్తూరులో 371 ఎకరాల ఇనామ్ భూమి ఉంది. ఇది వ్యక్తిగత ఇనామ్. రికార్డుల్లో ఇద్దరు ఇనామ్‌దారుల పేరిట ఆ భూమి పట్టాగా ఉంది. ఆ తర్వాత జరిగిన బ్రిటీషు సర్వేలో, ఇంకా రీ సెటిల్‌మెంట్‌లోనూ ఆ భూమిని ఇనామ్‌గానే చూపించి రికార్డుల్లో నమోదు చేశారు. 1956లో ఇనామ్‌ల రద్దు చట్టం(రైత్వారీ చట్టం) వ చ్చింది. ఆ ఇద్దరి ఇనామ్‌దారుల వారసులు ఆ భూమిని తమ పేరిట మార్చుకొని రైత్వారీ పట్టాలు తీసుకోవాలి. కానీ ఆనాడున్న పరిస్థితుల్లో అది జరగలేదు.
అయితే ఆ భూమిని కొన్నట్లుగా కొందరు డాక్యుమెంట్లు చూపించి పట్టాలు పొందారు. ఇదంతా గతం. 2008లో ఓ వ్యక్తి నెల్లూరు జేసీకి ఇచ్చిన ఓ ఫిర్యాదు ఆధారంగా ఆ భూమిపై పొందిన పట్టాలపై విచారణ జరిగింది. నాటి నెల్లూరు తహశీల్దార్ విచారణ జరిపి.. ఆ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం సెటిల్‌కాని ఇనామ్ భూమి అని, దానిపై ఇచ్చిన పట్టాలు తప్పుడవని తేల్చారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేశారని, ఆ తర్వాత పాస్‌పుస్తకాలు తీసుకున్నారని గుర్తించారు. వాటిని రద్దు చేయాలని 2010లో తహశీల్దార్ నివే దిక ఇచ్చారు. దీని ఆధారంగా ఆ భూమిపై ఇచ్చిన పట్టాలను నెల్లూరు ఆర్‌డీవో 2011లో రద్దు చేశారు. ఆర్‌డీవో ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు వ్యక్తులు 2012లో జాయింట్ కలెక్టర్ వద్ద అప్పీల్ చేశారు. జేసీ మరోసారి విచారణ చేయించి, ఆ పట్టాల రద్దు సరైన నిర్ణయమేనని తేల్చారు. అంతేగాక సెటిల్ కాని ఆ ఇనామ్ భూమి ప్రభుత్వానిదని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. తహశీల్దార్ నివేదిక ఆధారంగా ఆర్‌డీవో ఇచ్చిన ఆదేశాలు సరైనవేనని జేసీ 2012లోనే ఉత్తర్వులు ఇచ్చారు. జేసీ తీర్పుతో విబేధించిన ప్రైవేటు వ్యక్తులు 2013లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ల వాదన విని కేసును చట్టప్రకారం సెటిల్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో జేసీ మరోసారి కేసు విచారణ చేశారు. ఇనామ్ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఏ ప్రాతిపదికన కొన్నారు? రైత్వారీ పట్టాగా మారని భూమిని ఎలా కొన్నారు? దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను సమర్పించాలని జేసీ ఆదేశించారు. అయితే ప్రైవేటు వ్యక్తులు సరైన ఆధారాలు, పత్రాలు సమర్పించలేదని, ఇంతకుముందు తీసుకున్న పట్టా రద్దు నిర్ణయమే ఫైనల్ అని జేసీ 2013 నవంబరు 23న తుది ఆదేశాలు జారీ చేశారు.
నాటి సలహాదారు కుట్ర
ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో హైకోర్టు ఆదేశాలతో నెల్లూరు జాయింట్ కలెక్టర్ సెటిల్ చేసిన కేసును మళ్లీ అధికారులు తెరవగలరా? అది జరగాలంటే ప్రభుత్వ స్థాయిలో సాధ్యంకాదు. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌ఓఆర్) చట్టం-1971 ప్రకారం హైకోర్టు డివిజన్ బెంచ్‌కే వెళ్లాలి. కానీ అది జరగలేదు. పదేళ్ల విరామం తర్వాత గత జగన్ ప్రభుత్వంలోని సలహాదారు కన్ను ఈ భూమిపై పడింది. తనకున్న అధికారాన్ని ఉపయోగించడంతో పాటు నాటి నెల్లూరు ప్రజాప్రతినిధితో కుమ్మక్కై ఆ భూమి ఇనామ్ కాదని, ప్రైవేటుదని చూపించే ప్రయత్నం చేశారు. నాటి కమిషనర్ అప్పీల్స్ వద్దకు ఈ కేసును పంపించారు. అంతే.. ఆయన కోరుకున్నట్లుగానే ఆర్డర్ వచ్చింది. 2012, 2013లో నెల్లూరు జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు, 2011లో ఆర్‌డీవో ఇచ్చిన ఆదేశాలు, ఇంకా తహశీల్దార్ విచారణ నివేదికలను పక్కన పెట్టేస్తున్నట్లుగా కమిషనర్ అప్పీల్స్ ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు.. ఈ కేసులో పొంతనలేని ఆదేశాలు ఇచ్చారంటూ వ్యాఖ్యానాలు చేశారు. ఇనామ్ కోణంలో విచారణే జరగలేదని తేల్చారు. రెవెన్యూ అధికారులు సరైన డ్యూటీ చేయలేదంటూ ఆక్షేపించారు. ఆ భూమిపై మళ్లీ ఇనామ్ కోణంలో సమగ్ర విచారణ చేయించాలంటూ నెల్లూరు కలెక్టర్‌ను ఆదేశిస్తూ 2023 ఆగస్టులో ఉత్తర్వు ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న, రాజకీయ సందడి నెలకొన్న సమయంలో ఈ ఆదేశాలు వచ్చాయి. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఆర్డర్ కాపీపై ఆదేశాలు ఇచ్చిన తేదీ లేదు. కేవలం నంబర్, సంవత్సరం మాత్రమే ఉన్నాయి. కానీ ఆ ఉత్తర్వును నెల్లూరు కలెక్టర్‌కు పంపించిన (డిస్పాచ్) తేదీని స్టాంపింగ్‌లో చూపించారు. తప్పుడు పత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న తహశీల్దార్ విచారణను కమిషనర్ అప్పీల్స్ తోసిపుచ్చారు. ఒకవేళ తహశీల్దార్ రిపోర్టు సరికాని పక్షంలో, ఇనామ్ రద్దు చట్టం కింద సెటిల్ కాని, అంటే రైత్వారీ పట్టాగా మారని భూమిని ఎలా కొన్నారు? ఏ ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ చేశారో? కమిషనర్ అప్పీల్స్ కనీస పరిశీలన చేయలేదు. పైగా ఆ భూమిపై ఎవరికీ అభ్యంతరాలు లేవు కదా అని జస్టిఫికేషన్ ఇస్తూ మళ్లీ విచారణకు ఆదేశించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో భూ దోపిడీ సాగలేదు. మాజీ సలహాదారు అచ్చం ఓ మాంత్రికుడులా ఉంటారు. గతంలో ఆయన ప్రమేయం లేని కేసు లేదు. పలు రిమాండ్ రిపోర్టులు, చార్జిషీట్లలో ఆయన పేరు మారు మోగిపోతోంది.
నేడు మళ్లీ మంత్రాంగం: కూటమి ప్రభు త్వం వచ్చాక నాటి సలహాదారుడు కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మళ్లీ నెల్లూరులో మంత్రాంగం మొదలుపెట్టారు. ఓ ప్రజాప్రతినిధి, మరో అధికారిని ముందుపెట్టి వ్యవహారం నడిపిస్తున్నారు. గతంలో అనేక సెటిల్‌మెంట్లు చేసి గోదావరి నది వెంటే భూములు దక్కించుకున్న అనుభవం ఉన్న ఆ అధికారిని, భూములు కొట్టేయడంలో సిద్ధహస్తుడైన ప్రజాప్రతినిధిని ముందు ఉంచి వ్యవహారం నడిపిస్తున్నారు. 371 ఎకరాల్లో సుదీర్ఘకాలంగా సాగులో, పొజిషన్‌లో ఉంటూ, న్యాయపోరాటాలు చేసిన వారికి కూడా అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆ భూమి ఇనామ్ అయినప్పటికీ 1956లోనే కొనుగోలు చేశారని, ఆ తర్వాత అనేక క్రయ, విక్రయాలు జరిగాయని రికార్డులు పుట్టించి, వాటి ఆధారంగా, ఆ భూమిని సాంతం ప్రైవేటుదిగా చూపించేందుకు ఆ మాజీ సలహాదారు సకల ఏర్పాట్లు చేశారు. ఇందుకు ఓ ప్రజాప్రతినిధి అచ్చంగా తన సొంత మనుషులనే పేదలుగా, సాగుదారులుగా చూపించి వారికే ఆ భూమి దక్కేలా అధికారులతో ఉత్తర్వులు ఇప్పించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. సుదీర్ఘకాలం సాగులో ఉన్నవారిని కూడా పక్కనపెట్టి, ప్రజాప్రతినిధి మనుషులకే భూమి దక్కేలా చేయడం.. ఆ తర్వాత ఆ భూమిలో కొంత నాటి సలహాదారు పేరిట మార్చేలా స్కెచ్ వేశారు. అంతా అనుకున్నట్టుగా ఈ ప్రక్రియ సాగేలా ఆ మాజీ సలహాదారు ప్రయత్నిస్తున్నారు.