Share News

బావ హత్య కేసులో నిందితుడు..

ABN , Publish Date - Jul 15 , 2026 | 04:29 AM

సంచలనంగా మారిన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయాధికారి (ఏవో) నడవాటి శ్రీహరి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

బావ హత్య కేసులో నిందితుడు..

  • భార్యాపిల్లలతో సహా రైలుకెదురెళ్లాడు!

  • సింగరాయకొండ స్టేషన్‌లో బలవన్మరణం

  • నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం ఏవో శ్రీహరి

  • హత్య కేసులో ప్రధాన నిందితుడు హరికృష్ణ

  • ఇప్పటికే అతడికి సహకరించిన ఇద్దరు అరెస్టు

సింగరాయకొండ/నెల్లూరు(క్రైం)/బుచ్చిరెడ్డిపాళెం, జూలై 14(ఆంధ్రజ్యోతి): సంచలనంగా మారిన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయాధికారి (ఏవో) నడవాటి శ్రీహరి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మృతుడి బావమరిది హరికృష్ణ తన కుటుంబంతోసహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ లభ్యమైన డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా మృతులను ఉడుమల హరికృష్ణ(31), ఆయన భార్య ప్రణీత(27) కుమార్తె మన్విత(5), కుమారుడు కృష్ణ కిరిటీ(4)గా జీఆర్పీ పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్పీ డీఎస్పీ జి.మురళీధర్‌, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు మృతదేహాలను పరిశీలించారు. మంగళవారం తెల్లవారుజామున హరికృష్ణ తన ఇంటి నుంచి భార్య, పిల్లలను కారులో బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. శ్రీహరి హత్య కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడైన హరికృష్ణ కోసం గాలిస్తున్న క్రమంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.


అసలు ఏం జరిగింది?

ఆస్తుల విషయంలో వచ్చిన విభేదాల నేపథ్యంలో హరికృష్ణ తన అక్క భర్త అయిన శ్రీహరిని గత నెల 15న మరో ఇద్దరితో కలిసి హత్య చేశాడు. అయితే శ్రీహరి గుండెపోటుతో చనిపోయినట్టు కుటుంబసభ్యులను నమ్మించాడు. వారు కూడా శ్రీహరిది సహజ మరణం అనుకున్నారు. అయితే అంత్యక్రియల సందర్భంగా మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో తోటి ఉద్యోగులు, స్నేహితులు అనుమానంగా ఉందని బుచ్చిరెడ్డిపాలెం అర్బన్‌ పోలీస్ స్టేషన్‌ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సంతోష్ రెడ్డిలకు విన్నవించుకున్నా వారు పట్టించుకోలేదు. పైగా కుటుంబసభ్యులతో మాట్లాడి మృతదేహాన్ని వారి సంప్రదాయం ప్రకారం.. పూడ్చాల్సి ఉన్నా దహనం చేశారు. ఈ నేపథ్యంలో హత్య కోణంలో పోలీసులు ఆలోచించకపోవడం అనుమానాలు తావిచ్చింది. కొద్ది రోజుల తర్వాత శ్రీహరి ఆస్తిని తన పేరుపై రాయాలని హరికృష్ణ పలుమార్లు అక్కతో గొడవపడడంతో.. ఆమె కూడా తన భర్తది సహజ మరణం కాదని, హత్య చేసి ఉంటారని అనుమానించింది. దీనిపై ఈ నెల 6న నెల్లూరు ఎస్పీ అజితకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్పీ.. కేసుపై విచారణ చేయాలని నెల్లూరు రూరల్‌ డీఎస్పీ శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ నెల 9న కేసు నమోదు కావడంతో, డీఎస్పీ పలు కోణాల్లో శ్రీహరి మృతిపై విచారణ చేపట్టారు. శ్రీహరిది సహజ మరణం కాదని హత్యేనని తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మృతుడి బావమరిది హరికృష్ణ (ఏ1) అని నిర్ధారించుకుని, అతనికి సహకరించిన గొలగమూడికి చెందిన రవీంద్ర (ఏ2), రామతీర్థంకు చెందిన యానాది (ఏ3)లను అరెస్టు చేశారు. మరోవైపు శ్రీహరి హత్య కేసు వ్యవహారంలో నిర్లక్ష్యం తదితర ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ అజిత.. బుచ్చి అర్బన్‌ పోలీస్ స్టేషన్‌ సీఐ, ఎస్‌ఐలను వీఆర్‌కు పంపారు. 23 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.


ఆత్మహత్యకు అదే కారణమా?

ఏవో శ్రీహరి హత్యకేసులో ప్రధాన నిందితుడు హరికృష్ణపై కేసు మాఫీ పేరుతో పోలీసులు, రాజకీయ నాయకులు, ఇతరులు రూ.లక్షల్లో ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. అయితే తన వద్ద నుంచి అంత డబ్బు తీసుకున్నా, కేసు మాఫీ విషయంలో చేతులెత్తేయడంతో.. ఓ వైపు ఇక తప్పించుకోలేమనే భయం, మనస్థాపం, అవమానం తట్టుకోలేక భార్యాపిల్లలతో కలిసి హరికృష్ణ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే చర్చ జరుగుతోంది.

Updated Date - Jul 15 , 2026 | 04:31 AM