25 మంది ఖాకీలపై వేటు
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:03 AM
కట్టు దప్పిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవడం మనం చూశాం. కానీ, ఏకంగా ఓ పోలీస్ స్టేషన్‌నే వైట్‌వాష్ చేయడం బహుళా రాష్ట్ర పోలీస్ చరిత్రలోనే..
పోలీస్ స్టేషన్‌లో అందరిపైనా ఒకేసారి చర్య
బుచ్చి ఏవో ‘మృతి’ వ్యవహారంలో నెల్లూరు ఎస్పీ సంచలన నిర్ణయం
కేసును నీరుగార్చేందుకు సీఐ, ఎస్‌ఐ ప్రయత్నించినట్టు విచారణలో వెల్లడి
మృతుని భార్య ఫిర్యాదుతో గుట్టు రట్టు
వారిద్దరూ వీఆర్‌కు.. మిగతావాళ్లు బదిలీ
నెల్లూరు(క్రైం),బుచ్చిరెడ్డిపాళెం, జూలై 13 ( ఆంధ్రజ్యోతి): కట్టు దప్పిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవడం మనం చూశాం. కానీ, ఏకంగా ఓ పోలీ్‌సస్టేషన్‌నే వైట్‌వాష్ చేయడం బహుళా రాష్ట్ర పోలీస్ చరిత్రలోనే ఇది మొదటిసారి కావచ్చు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ అనుమానాస్పద మృతి కేసును తప్పుదారి పట్టించేలా దర్యాప్తు చేయడం, విధుల్లో నిర్లక్ష్యం తదితర ఆరోపణలపై బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ పోలీసు స్టేషన్ సీఐ, ఎస్‌ఐలను వీఆర్‌కు పంపించారు. 23 మంది సిబ్బందిని బదిలీ చేశారు. దీంతో ‘బుచ్చి’ పోలీస్ స్టేషన్ పూర్తిగా ఖాళీ అయింది. ఆ వివరాలు.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం వ్యవసాయ అధికారి (ఏవో) నడవాటి శ్రీహరి గత నెల 15వ తేదీన బావమరిది హరికృష్ణతో కలిసి కారులో పెంచలకోనకు వెళ్లారు. మార్గమధ్యంలో గుండెపోటుతో శ్రీహరి మృతి చెందినట్టు కుటుంబసభ్యులకు హరికృష్ణ తెలిపాడు. అదే కారులో మృతదేహాన్ని సొంత గ్రామమైన బుచ్చిరెడ్డిపాళెం మండలం కొత్త మినగల్లుకు తీసుకెళ్లాడు. కుటుంబసభ్యులు సైతం అతని మాటలను నిజమేనని నమ్మారు. అయితే, శ్రీహరి తోటి ఉద్యోగులు, మిత్రులు, గ్రామస్థులు మృతదేహంపై గాయాలు ఉండటం గమనించారు. శ్రీహరిది సహజ మరణం కాకపోవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి వచ్చిన బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ మాతంగి శ్రీనివాసరావు, ఎస్‌ఐ సంతోశ్‌రెడ్డికి ఈ విషయం తెలిపారు.
కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేయాలని వ్యవసాయ అధికారులు కోరినా పోలీసు అధికారులు పట్టించుకోలేదు. కుటుంబసభ్యులు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామంటూ మెలిక పెట్టారు. అందుకు కుటుంబసభ్యులు ముందుకు రాకపోవడంతో మృతదేహాన్ని దహనం చేశారు. ఈ నెల ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చిన శ్రీహరి భార్య ఎన్‌లావణ్య తన భర్తది సహజమరణం కాదంటూ ఫిర్యాదు చేశారు. ఆయనను హత్య చేశారన్న అనుమానాలు ఉన్నాయని, కేసు నమోదుచేసి న్యాయం చేయాలని కోరారు. శ్రీహరికి సంబంధించిన ఆస్తిని తనకు రాసివ్వాలంటూ తన తమ్ముడు హరికృష్ణ తరచూ ఘర్షణకు దిగుతున్నాడని ఆమె తెలిపారు. తనకు హరికృష్ణపై అనుమానం ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే స్పందించిన ఎస్పీ అజిత వేజెండ్ల... శ్రీహరి మృతిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావును ఆదేశించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన డీఎస్పీ...పలు కోణాల్లో కేసును విచారించారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు హరికృష్ణ కోసం గాలిస్తున్నారు.
మత్తు ఇచ్చి.. ఊపిరాకుండా చేసి..
శ్రీహరి తన బావమరిది హరికృష్ణను నమ్మి రూ.కోట్లు విలువ చేసే ఆస్తిని అతని పేర రాసినట్టు, అప్పుగా కొంత నగదు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. పోలీస్ వర్గాల కథనం ప్రకారం, ఆ ఆస్తిని, నగదును శ్రీహరి తిరిగి అడగడంతో వారిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. తన సంపద తనకు ఇస్తే మంచి ఇల్లు కట్టుకుంటానని శ్రీహరి కోరారు. వాటిని తిరిగి ఇవ్వడం ఇష్టం లేని హరికృష్ణ, తన బావను హత్య చేయాలని పథకం పన్నాడు. అందులో భాగంగా పెంచలకోనకు శ్రీహరిని కారులో తీసుకువెళ్లాడు. తిరిగివచ్చే క్రమంలో చేజర్ల సమీపంలో కారును ఆపాడు. అప్పటికే హరికృష్ణ ప్లాన్‌లో భాగంగా అక్కడకు గొలగమూడికి చెందిన రవీంద్ర, రామతీర్థానికి చెందిన యానాది చేరుకున్నారు. వారిద్దరూ శ్రీహరిని గట్టిగా పట్టుకోగా, హరికృష్ణ కుక్కలకు మత్తు ఎక్కేందుకు ఇచ్చే ఇంజెక్షన్లు రెండు వేయడంతో, మత్తులోకి జారుకున్నారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఊపిరాడకుండా చేసి శ్రీహరిని హత్య చేశారు. గుండెపోటుగా చిత్రీకరించి ఆయన గ్రామంలో అంత్యక్రియలు జరిపించేశారు.
ఎస్పీ ఆగ్రహం
శ్రీహరి మృతిపై ఆయన తోటిఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా సీఐ, ఎస్‌ఐ పట్టించుకోకపోవడం..ఆ కోణంలో కనీసంగా ఆలోచించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరు మృతి చెందినా పూట్చే అలవాటు శ్రీహరి కుటుంబసభ్యులకు ఉంది. అయినా, మృతదేహాన్ని కాల్చారు. ప్రధాన నిందితుడు హరికృష్ణ కాల్ లిస్టును పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా పోలీసులను కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సంతోష్ రెడ్డి, సిబ్బంది తీరుపై ఎస్పీ అజిత వేజెండ్ల ఆగ్రహించారు. సీఐ, ఎస్‌ఐను వీఆర్‌కు పంపించారు. 23 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.