విద్యుత్ తీగలే యమపాశాలై!
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:45 AM
బట్టలు ఆరేస్తున్న కోడలు విద్యుత్ షాక్‌కు గురవ్వగా.. కంగారులో ఆమెను కాపాడబోయిన అత్తమామలిద్దరూ మృత్యువాత పడ్డారు.
బట్టలారబెడుతుండగా కోడలికి విద్యుదాఘాతం
ఆమెను కాపాడేందుకు వెళ్లి దంపతుల మృతి
సైదాపురం మండలంలో విషాదం.. కోడలు క్షేమం
గూడూరు అర్బన్ (సైదాపురం) జూన్, 20 (ఆంధ్రజ్యోతి): బట్టలు ఆరేస్తున్న కోడలు విద్యుత్ షాక్‌కు గురవ్వగా.. కంగారులో ఆమెను కాపాడబోయిన అత్తమామలిద్దరూ మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగణం రాజుపాలెం గ్రామ ఎగువ సంగంలో శనివారం ఈ విషాద ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఎగువ సంగంలో ఇండ్ల రవి (57), సునీత (52) దంపతులు కూలిపనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు వంశీ, కోడలు చెంచమ్మ ఉన్నారు. శనివారం ఉదయం చెంచమ్మ బట్టలు ఉతికి, ఆరబెట్టేందుకు తీగపై వేస్తుండగా, ఇదివరకే ఆ ఇనుప తీగకు కరెంటు వైరు తెగి అంటుకుని ఉండడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యింది. హఠాత్తుగా కోడలు తీగ పట్టుకుని వణుకతుండటం చూసి బిత్తరపాటులో ఆమెను కాపాడేందుకు రవి దంపతులు ప్రయత్నించారు. ఈ సమయంలో కోడలు దూరంగా కింద పడిపోగా, దంపతులిద్దరూ విద్యుదాఘాతానికి గురై మృత్యుకౌగిలిలో చిక్కుకుపోయారు. చుట్టుపక్కల వారు విద్యుత్ సరఫరా నిలిపివేసి, గాయపడ్డ చెంచమ్మను 108 వాహనంలో రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చెంచమ్మ ఆరోగ్యం నిలకడగా ఉంది. రవి, సునీతల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.