రూ.4 కోట్లకు ‘చీట్’ చేశారు!
ABN , Publish Date - Jun 21 , 2026 | 06:22 AM
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో చీటీల పేరుతో రూ.4కోట్లకుపైగా ఎగనామం పెట్టిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. కృష్ణపట్నానికి చెందిన చల్లా ఏడుకొండలు..
బాధితుల ఫిర్యాదుతో ముగ్గురి అరెస్ట్
ముత్తుకూరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో చీటీల పేరుతో రూ.4కోట్లకుపైగా ఎగనామం పెట్టిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. కృష్ణపట్నానికి చెందిన చల్లా ఏడుకొండలు, చల్లా చెంగమ్మ దంపతులు, రాపూరుకు చెందిన చీపినాపి రవికుమార్ కృష్ణపట్నంలో పదేళ్లుగా చీటీలు నిర్వహిస్తున్నారు. చీటీలు పాడుకున్న వ్యక్తులను, ఇతరత్రా వడ్డీకి డబ్బులు తీసుకున్న వారిని మోసం చేసిఈ నెల 6న ఆ ముగ్గురు పరారయ్యారు. దీంతో లబోదిబోమంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో విచారించి, వంద మందికిపైగా చీటీలు కట్టిన వారితోపాటు మరో 60మంది నుంచి సొంతానికి డబ్బులు తీసుకుని రూ.4కోట్లకుపైగా మోసం చేసినట్లు తెలిసింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. శనివారం రిలయన్స్ రోడ్డు సమీపంలో కనిపించిన ఏడుకొండలు, చెంగమ్మ, రవికుమార్‌లను అరెస్టు చేశారు.