Share News

నెల్లూరు ఇనామ్‌ భూములపై ఎలాంటి చర్యలొద్దు

ABN , Publish Date - May 19 , 2026 | 04:54 AM

నెల్లూరు ఇనామ్‌ భూముల వ్యవహారంపై ఎలాంటి తదుపరి చర్యలూ తీసుకోవద్దని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు.

నెల్లూరు ఇనామ్‌ భూములపై ఎలాంటి చర్యలొద్దు

  • హైకోర్టు ఆదేశాలు పరిగణనలోకి తీసుకోండి.. కలెక్టర్‌ ఆదేశాలు

  • సమగ్ర నివేదిక కోరిన సర్కారు.. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందన

అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు ఇనామ్‌ భూముల వ్యవహారంపై ఎలాంటి తదుపరి చర్యలూ తీసుకోవద్దని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని, అధికారులు ఎలాంటి ముందడుగూ వేయరాదని రెవెన్యూ డివిజనల్‌ అధికారి(ఆర్‌డీవో)కి సూచించారు. ఇనామ్‌ భూముల విషయంలో ఏప్రిల్‌లో తహశీల్దార్‌ కొన్ని ఉత్తర్వులివ్వగా, కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ భూముల విషయంలో ఇచ్చిన ఆదేశాలన్నీ నిలిపివేయాలని హైకోర్టు ఈ నెల 14న ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్‌ మండలంలోని బిట్‌-1లోని 371 ఎకరాల భూమి విషయంలో రెవెన్యూఅధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కలెక్టర్‌ ఆదేశాల్లో పేర్కొన్నారు. రూ.2వేల కోట్ల విలువైన ఇనామ్‌ భూముల దోపిడీకి స్కెచ్‌ వేశారని సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.

Updated Date - May 19 , 2026 | 04:55 AM