బీపీసీఎల్, ఇండోసోల్ ప్రాజెక్టుల భూసేకరణ బాధ్యతలు నెల్లూరు కలెక్టర్‌కే!
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:07 AM
ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో రెండు కీలక ప్రాజెక్టులకు భూసేకరణ బాధ్యతలను నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రెవెన్యూ శాఖ ఉత్తర్వులు
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో రెండు కీలక ప్రాజెక్టులకు భూసేకరణ బాధ్యతలను నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ శనివారం ఉత్తర్వులు (జీవో-54) జారీచేశారు. ఇంతకు ముందు గుడ్లూరు మండలంలోని రావూరు, చేవూరు గ్రామాలు, ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఇటీవలి జిల్లాల పునర్విభజన తర్వాత ఈ రెండు మండలాలు నెల్లూరు నుంచి తిరిగి ప్రకాశం జిల్లాలోకి వచ్చాయి. అయితే ఆయా మండలాలు నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడే చేవూరులో బీపీసీఎల్ రిఫైనరీకి, కరేడులో ఇండోసోల్ ప్రాజెక్టుకు భూసేకరణ ప్రారంభించారు. ఇప్పుడు ఆ గ్రామాలు ప్రకాశంలోకి రాగా.. సాధారణంగా అయితే ఆ జిల్లా కలెక్టర్‌నే భూసేకరణ బాధ్యతలు చూడాలి. అయితే నెల్లూరు జిల్లాలో ఆ గ్రామాలున్నప్పుడే, ఆ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆ రెండు ప్రాజెక్టులకు భూసేకరణ నోటిఫికేషన్లు ఇచ్చారు. రైతులతో మాట్లాడి భూములు ఇచ్చేందుకు ఒప్పించారు. ప్రస్తుతం భూసేకరణ పనులు కీలక దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు కలెక్టరే ఆ రెండు ప్రాజెక్టుల భూసేకరణ బాధ్యతలు చూడాలని సర్కారు ఆదేశించింది.