Share News

నెల్లూరు జిల్లాలో.. సీలింగ్‌ భూములకు రెక్కలు!?

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:43 AM

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కరివేడు గ్రామ పరిధిలో చిల్లకూరు తహశీల్దారు కార్యాలయం నుంచి జాతీయ రహదారిపై ఉన్న సబీనా ఫ్యాక్టరీ వరకు 2,395 ఎకరాల ప్రభుత్వ భూములు విస్తరించి ఉన్నాయి.

నెల్లూరు జిల్లాలో.. సీలింగ్‌ భూములకు రెక్కలు!?

  • కరివేడు గ్రామ పరిధిలో 2,395 ఎకరాల ప్రభుత్వ భూములు

  • నెల్లూరు-చెన్నై జాతీయ రహదారికి ఇవి అటూఇటూ

  • చెన్నైకి చేరువ.. కృష్ణపట్నం, దుగరాజపట్నం, రామాయపట్నం ఓడరేవులకు అత్యంత సమీపంలో

  • పారిశ్రామికవాడ ఏర్పాటుకు ఈ భూములు అనుకూలం

  • ఎకరా ధర సగటున రూ.కోటి.. దీంతో ప్రైవేటు వ్యక్తుల కన్ను

  • సీలింగ్‌ రికార్డులు మాయం.. 991 ఎకరాలు ప్రైవేటుపరం

  • ఓ రెవెన్యూ అధికారి నిర్వాకం

అవి నెల్లూరు-చెన్నై జాతీయ రహదారికి అటూ ఇటూ విస్తరించిన అత్యంత విలువైన ప్రభుత్వ భూములు. కొన్ని దశాబ్దాల క్రితం ల్యాండ్‌ సీలింగ్‌ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఒకప్పుడు ఈ భూములకు పెద్దగా విలువ లేదు. కానీ నెల్లూరు-చెన్నై జాతీయ రహదారి నిర్మాణం జరగడం.. చెన్నై మహా నగరానికి చేరువగా ఉండడం, సుదీర్ఘ సముద్రతీరం, కృష్ణపట్నం, దుగరాజపట్నం, రామాయపట్నం ఓడరేవులకు అత్యంత సమీపంలో ఉండడంతో వీటి విలువ అమాంతం పెరిగిపోయింది. ఇదే సమయంలో వీటిపై దొంగలు కన్నేశారు. సీలింగ్‌ భూములకు సంబంధించిన కీలక రికార్డులను గల్లంతు చేశారు. దొంగ రికార్డులు సృష్టించి వాటి ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లో భూ హక్కుదారులుగా తమ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. ఒకరిద్దరు రెవెన్యూ అధికారులు ఈ అక్రమాలకు తెరలేపి రూ.కోట్లు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

(నెల్లూరు-ఆంధ్రజ్యోతి)

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కరివేడు గ్రామ పరిధిలో చిల్లకూరు తహశీల్దారు కార్యాలయం నుంచి జాతీయ రహదారిపై ఉన్న సబీనా ఫ్యాక్టరీ వరకు 2,395 ఎకరాల ప్రభుత్వ భూములు విస్తరించి ఉన్నాయి. 1977లో ల్యాండ్‌ సీలింగ్‌ యాక్టు ప్రకారం ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నాటి నుంచి ప్రభుత్వ భూములుగానే ఉన్నాయి. సర్వే నం.805లో 875 ఎకరాలు, 876లో 150.. 743 నుంచి 800 నంబర్ల వరకు 1200 ఎకరాలు, 367లో 170 ఎకరాలు ఉన్నాయి. చెన్నై-నెల్లూరు జాతీయ రహదారి నిర్మితమయ్యాక 2000వ సంవత్సరంలో ఈ భూములను కొట్టేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. బూదనం టోల్‌ప్లాజాకు అటూ ఇటూ ఈ భూములున్నాయి.


ఎకరా ధర సగటున రూ.కోటి వరకు పలుకుతోంది. వీటిని సీలింగ్‌ యాక్టు కంటే ముందే కొనుగోలు చేసినట్లుగా దొంగ రికార్డులు సృష్టించారు. వాటి ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లో హక్కుదారులుగా నమోదు చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలను చిల్లకూరు తహశీల్దారు కార్యాలయం, గూడూరు రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చాయి. ఈ భూములకు హక్కుదారులమంటూ దరఖాస్తు చేసుకున్న కొందరి విన్నపాలను నాటి తహశీల్దార్లు సుభాషిణి, కేవీ రమణయ్య, ఉమాదేవి తదితరులు తిరస్కరించారు. 2010లో అప్పటి గూడూరు ఆర్డీవో బీ. రామమూర్తి పైపేర్కొన్న సర్వే నంబర్లలోని సీలింగ్‌ భూముల వివరాలతో ఓ ఫైలును కోట సబ్‌ రిజిస్ర్టార్‌కు పంపారు. ఈ నంబర్లలోని భూములకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని స్పష్టంచేశారు. ఈ భూముల పుట్టుపూర్వోత్తరాలు, అందుకు ఉన్న ఆఽధారాలు సహా సమగ్ర సమాచారాన్ని సదరు ఫైలులో రికార్డు చేసినట్లు సమాచారం.


జిల్లాల మార్పు చేర్పుల్లో..

వైసీపీ ప్రభుత్వ హయాంలో చిల్లకూరు మండలం తిరుపతి జిల్లాలోకి వెళ్లడం.. గత ఏడాది తిరిగి నెల్లూరు జిల్లాలోకి రావడం అక్రమార్కులకు మంచి అదనుగా మారింది. సీలింగ్‌ భూమి రికార్డులను మాయం చేశారు. అలాగే ఈ భూములకు సంబంధించి 2010లో ఆర్డీవో తయారు చేసిన ఫైలు (డీడీఎస్‌ 630-2010) కూడా ఎటు పోయిందో అంతుపట్టడం లేదు. ఈ ఫైలులోని సమగ్ర సమాచారం ఇవ్వాలని చిల్లకూరు తహశీల్దార్‌, గూడూరు ఆర్డీవో కార్యాలయాలను సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం ద్వారా ఎన్ని సార్లు కోరినా అందుబాటులో లేదనే సమాధానమే వస్తోందని.. ఈ ప్రభుత్వ భూమి పరులపాలు కాకుండా కాపాడాలని ప్రయత్నిస్తున్న మునీంద్రరెడ్డి అనే వ్యక్తి తెలిపారు. సీలింగ్‌ ల్యాండ్‌ ఫైలులోని ముఖ్యమైన డాక్యుమెంట్లు, స్కెచ్‌లు కూడా గల్లంతయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్కెచ్‌లు గల్లంతు కావడంతో ఆ భూముల వెనుకనున్న భూ యజమానులు జాతీయ రహదారి పక్కనున్న వాటిని తమవిగా రికార్డుల్లోకి ఎక్కించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సర్వే నంబరు 805లో 221 ఎకరాలు, 367లో 170 ఎకరాలు, 743-800 మధ్య ఉన్న సర్వే నంబర్లలో మరో 400 ఎకరాల సీలింగ్‌ భూమిని ఒక రెవెన్యూ అధికారి ప్రైవేటుపరం చేశారని.. హక్కుదారులుగా ప్రైవేటు వ్యక్తుల పేర్లు రెవెన్యూ రికార్డులోకి ఎక్కించారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై పెద్దఎత్తున ఫిర్యాదులు అందినా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.


పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలి

వాస్తవానికి ఈ 2,395 ఎకరాల సీలింగ్‌ భూమి రాష్ట్రప్రభుత్వానికి పెద్ద ల్యాండ్‌ బ్యాంక్‌. కృష్ణపట్నం, రామాయపట్నం, చెన్నై, అమరావతిని కలిపే సువిశాలమైన జాతీయ రహదారికి అటూ ఇటూ ఉండడంతో.. పారిశ్రామికవాడ ఏర్పాటుకు అత్యంత అనువు కూడా. మరుగునపడిన సీలింగ్‌ రికార్డులను వెలికితీసి.. రెవెన్యూ రికార్డులను పరిశీలించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని.. ఇప్పటికే తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దడంతో పాటు ఈ మొత్తం భూమికి మరోసారి సరిహద్దులు నిర్ణయించి పారిశ్రామికవాడ ఏర్పాటుపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 28 , 2026 | 04:44 AM