మాజీ మంత్రి కాకాణిపై కేసు
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:55 AM
పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ నెల్లూరు వేదాయపాలెం సీఐ కాటూరి శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి.
పలువురు వైసీపీ నేతలపై కూడా నమోదు
పోలీసుల విధులను అడ్డుకున్నారని ఫిర్యాదు
నెల్లూరు(క్రైం), ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ నెల్లూరు వేదాయపాలెం సీఐ కాటూరి శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఈ నెల 8న నెల్లూరు నగరంలోని ఉడ్ కాంప్లెక్స్‌లో ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం వద్దకు కాకాణి, ఆయన కుమార్తె పూజిత, తిరుపతి ఎంపీ గురుమూర్తి, వైసీపీ నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి, మందల వెంకటశేషయ్య, వారి అనుచరులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ధర్నా చేసేందుకు అనుమమతి లేదని, అక్రమంగా గుమిగూడి శాంతిభద్రతలకు ఆటంకం కలిగించడం నేరమని చెబుతున్నా వైసీపీ నాయకులు వినిపించుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులమైన తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.