Share News

వరాల రొట్టె కోసం!

ABN , Publish Date - Jun 28 , 2026 | 04:55 AM

నెల్లూరు నగరంలోని బారాషహీద్‌ దర్గా రొట్టెల పండుగ వేడుకల్లో రెండో రోజు శనివారం స్వర్ణాల చెరువు తీరమంతా భక్తులతో పులకించింది.

వరాల రొట్టె కోసం!

  • భారీగా తరలివచ్చిన భక్తజనం

  • టూరిజం హబ్‌గా బారాషహీద్‌ దర్గా

  • మంత్రి నారాయణ

నెల్లూరు(సాంస్కృతికం) జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు నగరంలోని బారాషహీద్‌ దర్గా రొట్టెల పండుగ వేడుకల్లో రెండో రోజు శనివారం స్వర్ణాల చెరువు తీరమంతా భక్తులతో పులకించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచేకాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే వరాల రొట్టె కోసం పోటీపడ్డారు. భక్తులకు మౌలిక వసతులు, శాంతిభద్రతలపై ప్రభుత్వ యంత్రాంగాన్ని పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ అప్రమత్తం చేస్తూ సూచనలిస్తున్నారు. బారాషహీద్‌ మిత్రమండలి ఏర్పాటు చేసిన అన్నదానాన్ని, లంగరుఖాను మంత్రి ప్రారంభించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన 4 నైట్‌విజన్‌ డ్రోన్లను కూడా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాటికి అభివృద్ధి పనులు పూర్తిచేసి సీఎం చంద్రబాబు ఆలోచన మేరకు బారాషహీద్‌ దర్గాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ రొట్టెల పండుగకు తరలివచ్చే భక్తులు తమ వాహనాల సామర్థ్యం మేరకే రావాలని విజ్ఞప్తి చేశారు.


వైభవంగా గంధ మహోత్సవం

రొట్టెల పండుగ సందర్భంగా శనివారం అర్ధరాత్రి గంధ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నగరంలోని కోటమిట్ట నుంచి 12 బిందెల గంధాన్ని పూలరథంలో మేళతాళాలతో ఊరేగింపుగా బారాషహీద్‌ దర్గాకు తీసుకువచ్చారు. దర్గాలోని మసీదులో 12 గంధం బిందెలకు ముజావర్లు, ఫకీర్లు పూజలు చేసి, బారాషహీద్‌లైన అమరవీరులకు ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం 12 సమాధులకు కడప పెద్ద మసీదు పీఠాధిపతి ఆరీఫుల్లా హుసేనీ గంధం ఎక్కించారు. అనంతరం భక్తులకు గంధాన్ని పంచిపెట్టారు.

Updated Date - Jun 28 , 2026 | 04:59 AM