నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!
ABN , Publish Date - Mar 29 , 2026 | 04:14 AM
మార్కాపురం జిల్లా రాయవరం వద్ద బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ప్రమాద సమయంలో బస్సు నడిపిన హరికృష్ణారెడ్డి యజమాని అని అనుకున్నారు.
రవాణా శాఖ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
బస్సు నడిపిన హరికృష్ణారెడ్డి లీజుదారుడు
దాని యజమాని కృష్ణా జిల్లా వాసి
బంధువులకు మృతదేహాల అప్పగింత
డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గుర్తింపు
అంబులెన్స్‌ల ద్వారా స్వస్థలాలకు తరలింపు
మార్కాపురం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం జిల్లా రాయవరం వద్ద బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ప్రమాద సమయంలో బస్సు నడిపిన హరికృష్ణారెడ్డి యజమాని అని అనుకున్నారు. కానీ రికార్డుల ప్రకారం ఈ బస్సు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి పేరుతో రిజిస్టరై ఉంది. హరికృష్ణారెడ్డి స్వయంగా బస్సు నడిపి పూర్తిగా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోనే ప్రమాదానికి కారణమయ్యారని రవాణా శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్తున్నారు. వేగంగా నడుపుతూ పూర్తిగా కుడివైపునకు వెళ్లిన బస్సును నియంత్రించేందుకు కనీసం సడన్ బ్రేక్ వేసిన ఆనవాళ్లు కూడా రోడ్డుపై లేవని గుర్తించారు. ప్రమాదానికి గురైన బస్సు (ఏఆర్ 20డీ 0487) అరుణాచల్‌ప్రదేశ్‌లో కృష్ణా జిల్లా కొమరవోలుకు చెందిన యార్లగడ్డ కోటేశ్వరరావు పేరుతో రిజిస్టరైంది. ఈ బస్సు కొనుగోలు తేదీ 2017 మార్చి 27. రికార్డు ప్రకారం రిజిస్ట్రేషన్ కాలపరిమితి 2032 మార్చి 30 వరకు ఉంది. ఫిట్‌నెస్ వాలిడిటీ 2026 డిసెంబరు 9 వరకు ఉన్నట్లు రవాణా శాఖ వివరాల ఆధారంగా తెలుస్తోంది. ఈ బస్సును కొంతకాలం క్రితం నెల్లూరు జిల్లా కలిగిరిలోని హరికృష్ణా ట్రావెల్స్‌కు చెందిన హరికృష్ణారెడ్డి లీజుకు తీసుకున్నట్లు సమాచారం. బస్సు కండిషన్ సరిగా లేకపోయినా తన ట్రావెల్ ఏజెన్సీలో నడుపుతున్నారని తెలిసింది. హరికృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రికార్డుల్లో యజమానిగా ఉన్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.
మిన్నంటిన రోదనలు
మార్కాపురం జిల్లా బస్సు ప్రమాద ఘటనలో చనిపోయిన 14 మంది మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు. శనివారం ఉదయం వారి బంధువులకు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఐ సుబ్బారావు, రెవెన్యూ అధికారులు అప్పగించారు. గుర్తుపట్టని విధంగా కాలిపోయిన మృతదేహాలను గురువారం నుంచి మార్కాపురం జీజీహెచ్‌లోని మార్చురీలో నంబర్లు ఇచ్చి భద్రపరిచారు. వాటిని గుర్తించేందుకు మృతుల తోబుట్టువులు 22 మంది నుంచి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వారు రక్త నమూనాలు సేకరించారు. గుంటూరు ల్యాబ్‌లో వాటిని పరీక్షించి శుక్రవారం రాత్రికి ఫలితాలను వెల్లడించారు. వాటి ఆధారంగా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించారు. ఒక్కో మృతదేహానికి ఒక్కో అంబులెన్స్‌తో పాటు పోలీసు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించారు. 5 నెలల బాలుడితోపాటు ఆరేళ్ల బాలికతో కలిపి మొత్తం 14 మంది మృతదేహాలను తరలించారు. రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు. మృతదేహాల అప్పగింత సమయంలో బంధువుల రోదనలు మార్కాపురం వైద్యశాల ప్రాంగణంలో మిన్నంటాయి.