Share News

రెండేళ్లుగా నిర్లక్ష్యం!

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:25 AM

జిల్లాలోని డ్వాక్రా సంఘాలను పర్యవేక్షించే జిల్లా సమైక్య పదాధికారుల నియామకం ప్రహసనంగా మారింది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకుండా అధికారులు జాప్యం చేస్తూనే ఉన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన డీఆర్‌డీఏ అధికారులు నిమ్మకునీరెత్తిన్నట్లు వ్యవహరిస్తుండటంతో సమైక్యలో పలు అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చుతూ సమైక్య పూర్వ అధ్యక్షురాలు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రెండేళ్లుగా నిర్లక్ష్యం!

- జిల్లా సమైక్య పదాధికారుల నియామకంలో జాప్యం

- గుట్టుగా ఆర్థిక లావాదేవీలు నడిపేస్తున్నారని ఆరోపణలు

- అక్రమాలపై విచారణ జరపాలని సమైక్య పూర్వ అధ్యక్షురాలి డిమాండ్‌

- ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఫిర్యాదు

జిల్లాలోని డ్వాక్రా సంఘాలను పర్యవేక్షించే జిల్లా సమైక్య పదాధికారుల నియామకం ప్రహసనంగా మారింది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకుండా అధికారులు జాప్యం చేస్తూనే ఉన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన డీఆర్‌డీఏ అధికారులు నిమ్మకునీరెత్తిన్నట్లు వ్యవహరిస్తుండటంతో సమైక్యలో పలు అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చుతూ సమైక్య పూర్వ అధ్యక్షురాలు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలోని 25 మండలాల్లో డ్వాక్రా సంఘాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, రుణాల మంజూరు, బుక్‌ కీపర్‌లకు జీతాల చెల్లింపులు తదితర అంశాలను జిల్లా సమైక్యలోని ఐదుగురు సభ్యులు పర్యవేక్షించాలి. జిల్లా సమైక్యలో పనిచేసే కమ్యునిటీ కోఆర్డినేటర్‌ (సీసీ)లను నియమించుకుని వారికి జీతభత్యాలు కూడా జిల్లాసమైక్య ద్వారానే చెల్లించాలి. డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇప్పించడం, రుణాల రికవరీ, స్త్రీ నిధి రుణాల మంజూరును కూడా జిల్లా సమైక్య పర్యవేక్షణలోనే జరగాలి. దీంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే నగదుతో డ్వాక్రా సంఘాల సభ్యులకు వివిధ అంశాల్లో, వృత్తుల్లో సాంకేతికపరమైన శిక్షణ ఇప్పించాలి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించే బాధ్యత, ప్రభుత్వం మంజూరు చేసే నిధులను సక్రమంగా వినియోగించే పని కూడా జిల్లా సమైక్య ద్వారానే జరగాలి. ఇంతటి కీలకమైన జిల్లా సమాఖ్యలో ఐదుగురు సభ్యులను నియమించకుండా రెండు సంవత్సరాలుగా జాప్యం చేస్తున్నారు.

ఐదుగురిని నియమించాల్సి ఉన్నా..

జిల్లాలో 25 మండలాలు ఉండగా, మండల స్థాయి సమైక్య సభ్యుల నుంచి ఐదుగురిని జిల్లా సమైక్యలో పదాధికారులుగా నియమించాల్సి ఉంది. ఇందులో ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ, జాయింట్‌ సెక్రటరీ, ట్రెజరర్‌ను నియమించాలి. ఏటా సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి పాతవారినే కొనసాగించడం లేదా నూతన సభ్యులను ఎన్నుకోవాలి. గత రెండేళ్లుగా సమావేశాలు నిర్వహించినా జిల్లా సమాఖ్యను ఏర్పాటు చేయకుండా అధికారులు మిన్నకుండిపోయారు.

జిల్లా సమైక్య అధ్యక్షురాలి తొలగింపు

జిల్లా సమైక్య అఽధ్యక్షురాలిగా ఇటీవల కాలం వరకు టి.మునెమ్మ ఉన్నారు. జిల్లా సమైక్య అఽధ్యక్షురాలిగా ఎంపిక కావాలంటే జిల్లాలోని 25 మండలాల్లో ఏదైనా ఒక మండల సమైక్య అధ్యక్షురాలిగా ఉండాలి. గుడివాడకు చెందిన ఈమెను మండల సమాఖ్య అధ్యక్షురాలిగా తొలగించడంతో పాటు సంబంధిత వాట్సాప్‌ గ్రూపు నుంచి కూడా ఆమెను తొలగించారు. ఆమె స్థానంలో మరొకరిని నియమించలేదు. జిల్లా సమైక్యకు సంబంధించి ఏడాదికి కనీసంగా రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయి. ఈ నేపఽథ్యంలో ఈ సమైక్య కార్యకలాపాలపై సహకారశాఖ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉంటుంది. రెండేళ్ల నుంచి జిల్లా సమైక్యలో పదాధికారులను ఏర్పాటు చేయకున్నా సహకారశాఖ, డీఆర్‌డీఏ అధికారులు పట్టించుకోలేదు. దీంతో సమైక్యకు చెందిన ట్రెజరర్‌ లేదా మరొకరిని పిలిచి ఆర్థికలావాదేవీలను గుట్టుచప్పుడు కాకుండా నడిపేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

సమైక్య పదాధికారులను ఎంపిక చేస్తామని పిలిచి..

రెండేళ్లుగా జిల్లా సమైక్య పదాధికారులను ఏర్పాటు చేయకుండా ఉండిపోయిన అధికారులు సోమవారం సమైక్య పదాధికారుల ఎంపిక జరుగుతుందని మండల సమైక్య అధ్యక్షులకు సమాచారం పంపారు. ఎక్కడ సమావేశం నిర్వహిస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. మచిలీపట్నం మండల పరిషత కార్యాలయ సమావేశపు హాలులో ఈ సమావేశం నిర్వహించినా జిల్లా సమైక్య ఏర్పాటుపై చర్చించకుండా, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఈ సమావేశాన్ని మమ అనిపించి ఎవరికి వారు వెళ్లిపోయారు.

అక్రమాలపై విచారణ చేయించండి

గత రెండేళ్లుగా జిల్లా సమైక్యను ఏర్పాటు చేయకుండా, స్ర్తీనిధి రుణాల మంజూరు, డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి అధిక వడ్డీ వసూలు, మండల సమైక్య సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేయకుండానే చెక్కులపై సంతకాలు తీసుకోవడం తదితర అంశాలలో అనేక అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ చేయాలని సమైక్య మాజీ అఽధ్యక్షురాలు మునెమ్మ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు అర్జీ ఇచ్చారు. అధ్యక్షురాలిగా వేరెవరినీ నియమించకుండా, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఇంతకాలంగా అధికారులు ఇష్టానుసారంగా జిల్లా సమైక్యను నడిపారని, దీంతో పలు అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణకు ఆదేశించాలని అర్జీలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అధికారులు డీఆర్‌డీఏ అధికారులను పిలిచి ఈ అంశంపై దృష్టి సారించాలని పురమాయించారు.

Updated Date - Mar 31 , 2026 | 12:25 AM