‘నీట్’ నిర్వహణలో సమయ పాలన పాటించాలి
ABN , Publish Date - May 02 , 2026 | 04:52 AM
దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న ‘నీట్ యూజీ-2026’ను ఎటువంటి అంతరాయాలు లేకుండా, సరైన సమయానికి ప్రారంభించాలని శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ చైర్మన్ వి.నరేంద్రబాబు అధికారులను విజ్ఞప్తి చేశారు.
పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైతే అదనపు సమయమివ్వాలి
శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ చైర్మన్ వి.నరేంద్రబాబు
విజయవాడ, మే 1(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న ‘నీట్ యూజీ-2026’ను ఎటువంటి అంతరాయాలు లేకుండా, సరైన సమయానికి ప్రారంభించాలని శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ చైర్మన్ వి.నరేంద్రబాబు అధికారులను విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని గంగవరం గోసలైట్స్ బ్రాంచిలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గతంలో నీట్ సమయపాలన తప్పిదాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైతే ఆ కోల్పోయిన సమయాన్ని అదనంగా ఇవ్వాలని సెంటర్ సూపరింటెండెంట్లను ఆయన అభ్యర్థించారు. గతంలో పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ.. నిర్ణీత సమయానికే జవాబు పత్రాలు తీసేసుకోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఒక ఏడాది కష్టాన్ని కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి ముందే బయోమెట్రిక్, ఇతర ధృవీకరణ ప్రక్రియలను పూర్తి చేయాలని నరేంద్రబాబు కోరారు. మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి కీలకమైన నీట్ కోసం విద్యార్థులు సంవత్సరాల తరబడి కష్టపడి సిద్ధమవుతున్నారని, పరీక్ష నిర్వహణలో చిన్నపాటి ఆలస్యం కూడా విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.