నెయ్యి కల్తీ నిజం... అనుమానమే లేదు
ABN , Publish Date - Feb 08 , 2026 | 05:13 AM
‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి గత ప్రభుత్వం కల్తీ నెయ్యి సరఫరా చేసిందన్నది వంద శాతం నిజం.
జంతు కొవ్వూ ఉందని ఎన్డీడీబీ స్పష్టం చేసింది
సంబంధం ఉన్నవాళ్లు జైలుకెళ్లడం ఖాయం: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి గత ప్రభుత్వం కల్తీ నెయ్యి సరఫరా చేసిందన్నది వంద శాతం నిజం. అందులో ఏమాత్రం అనుమానమే లేదు’ అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం రాజకీయ వాదన కాదు. అధికారిక నివేదికలతో రుజువైన వాస్తవం. వైసీపీ నేతలు నెయ్యిలో జంతు కొవ్వు లేదని మాత్రమే చెబుతున్నారు తప్ప ఇతర రసాయనాలు లేవని అనడంలేదు. అంటే నెయ్యి కల్తీ అని ఒప్పుకున్నట్టే. కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు, మోనో గ్లిజరైడ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు, ఇతర రసాయనాలు కలిసినట్టు జాతీయ డైరీ అభివృద్ధి బోర్డు(ఎన్డీడీబీ) ల్యాబ్ నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఈ నివేదికను చంద్రబాబో, కూటమి ప్రభుత్వమో తయారు చేయలేదు. టెండర్ నిబంధనల్లో మార్పులు చేసిన తీరునుబట్టి మొత్తం అక్రమ వ్యవహారాన్ని అర్థం చేసుకోవచ్చు. దీనిలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయం’ అని చెప్పారు.