Share News

టీడీపీ 3.. జనసేన 1 రాజ్యసభ సీట్లపై ఎన్డీయే నిర్ణయం

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:44 AM

రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు...

టీడీపీ 3.. జనసేన 1 రాజ్యసభ సీట్లపై ఎన్డీయే నిర్ణయం

  • త్వరలోనే అభ్యర్థుల ప్రకటన: సీఎం

  • ఆయన నివాసంలో ఎన్డీయే నేతల భేటీ

అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గురువారం సాయంత్రం ఆయన నివాసంలో ఎన్డీయే నేతల భేటీ జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం-జనసేనాని పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. సుమారు రెండు గంటలపాటు సాగిన సమావేశంలో రాజ్యసభ సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. రాజ్యసభ స్థానాలపై మూడు పార్టీల నేతలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

త్యాగం వల్లే రాజ్యసభ సీట్లు: జనసేన

రాష్ట్రం నుంచి ఎన్నికలు జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను ఒకటి జనసేనకు కేటాయించాలని ఎన్డీయే సమావేశంలో నిర్ణయించినట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్థానానికి అభ్యర్థిని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయిస్తారని.. ఆ తర్వాత పార్టీ ప్రకటిస్తుందని వెల్లడించింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కూటమి పార్టీల నడుమ సీట్లపై జరిగిందని.. సర్దుబాట్లలో భాగంగా జనసేన తాను పోటీచేయాల్సిన లోక్‌సభ స్థానాలను త్యాగం చేసినట్లు తెలిపింది. అప్పటి అవగాహనలో భాగంగా 2024-29 మధ్య జనసేనకు మూడు రాజ్యసభ సీట్లు కేటాయించాలని నిర్ణయించారని.. వాటిలో తొలి స్థానం ఈ దఫా ఎన్నికల్లో దక్కినట్లు పేర్కొంది.

Updated Date - Jun 05 , 2026 | 05:46 AM