ప్రకృతి వనరులను సంరక్షించుకోవాలి
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:43 PM
సహజ సిద్ధమైన ప్రకృతి వనరులను సంరక్షించుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకుడు ఆర్.హేమంత్‌కుమార్ అన్నారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకుడు ఆర్.హేమంత్‌కుమార్
పాడేరు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): సహజ సిద్ధమైన ప్రకృతి వనరులను సంరక్షించుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకుడు ఆర్.హేమంత్‌కుమార్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన బుధవారం మండలంలో మోదాపల్లి, జి.మాడుగుల మండలంలో కె.కోడాపల్లి ప్రాంతాల్లో పర్యటించి గిరిజనులతో మాట్లాడారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో అటవీ హక్కుల చట్టం అమలు పక్కగా జరగాలని, వాటిని గిరిజనులు సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో అర్హులైన గిరిజనులకు అటవీ హక్కుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో లక్షా 89 వేల ఎకరాల్లో గిరిజనుల సాగు భూములకు అటవీ హక్కులు కల్పించినట్టు చెప్పారు.
సహజ వనరులు అంతరించకుండా చర్యలు చేపట్టాలి
గిరిజన ప్రాంతాల్లోని సహజ వనరులు అంతరించిపోకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్.హేమంత్‌కుమార్ సూచించారు. జిల్లాలో పలు గ్రామాల్లో పర్యటన అనంతరం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లోని వనరుల రక్షణతో పాటు, వారికి వివిధ శాఖల ద్వారా అందాల్సిన పౌర సేవలు సైతం పక్కాగా అందించాలన్నారు. ఈ క్రమంలో ఎటువంటి లోపాలు చోటుచేసుకున్నా మానవ హక్కుల ఉల్లంఘనగా భావించాల్సి ఉంటుందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో అడవులను పరిక్షించాలన్నారు. గిరిజనులు అడవుల్లో జీవించే హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో స్టేట్ ప్రోగ్రామ్ అధికారి ఆదినారాయణ, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఐటీడీఏ ఏవో ఎం.హేమలత, చింతపల్లి డీఎఫ్‌వో నరసింహారావు, అటవీ హక్కుల చట్టం ప్రభుత్వ సమన్వయకర్త ఈశ్వరరావు, అటవీ, రెవెన్యూ, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.