Share News

గోదారి-కావేరి అనుసంధానంపై ఎల్లుండి భేటీ

ABN , Publish Date - May 06 , 2026 | 05:26 AM

గోదావరి - కావేరి అనుసంధాన పథకంపై జాతీయ జలాల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో మరోసారి సమీక్ష జరుగనుంది. వాస్తవానికి ఈ నెల 8వ తేదీన...

గోదారి-కావేరి అనుసంధానంపై ఎల్లుండి భేటీ

అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి - కావేరి అనుసంధాన పథకంపై జాతీయ జలాల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో మరోసారి సమీక్ష జరుగనుంది. వాస్తవానికి ఈ నెల 8వ తేదీన (శుక్రవారం) ఈ సమావేశం నిర్వహించాలని భావించారు. తర్వాత 19వ తేదీకి వాయిదా వేశారు. కానీ 8వ తేదీనే సమీక్షిస్తామంటూ ఎన్‌డబ్ల్యూడీఏ మంగళవారం నాడు రాష్ట్రాలకు రం పంపింది. గోదావరి-కావేరి అనుసంధాన పథకాన్ని తమ భూభాగం నుంచే కొనసాగించాలని తెలంగాణ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌ మీదుగా కావేరి వరకు తీసుకెళ్లాలని ప్రతిపాదిస్తోంది. ఇచ్చంపల్లి నుంచి తరలించేందుకు ప్రతిబంధకాలు ఉన్నందున సమ్మక్క సారలమ్మ పథకం నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలని సూచిస్తోంది. ఇచ్చంపల్లి వద్ద గోదావరి మిగులు జలాలు అందుబాటులో లేవని నిపుణులు ధ్రువీకరిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ వాడుకోని 147 టీఎంసీల జలాలను ఈ అనుసంధాన పథకానికి వినియోగించుకోవాలని అంటోంది. ఎన్‌డబ్ల్యూడీఏ కూడా ఈ సూచనతో ఏకీభవిస్తోంది. అయితే తమ వాటా 147 టీఎంసీలను వాడుకుంటామని.. తాము కూడా సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని ఛత్తీస్‌గఢ్ చెబుతోంది. తమ వాటా జలాలపై ఎవరికి హక్కు లేదంటోంది. అయితే తెలంగాణ భూభాగం నుంచి గోదావరి-కావేరి అనుసంధాన పథకాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఆమోదించడం లేదు. పోలవరం నుంచి తరలించాలని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి ధవళేశ్వరం నుంచి కావేరికి అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనలు గతంలో వచ్చినందున దానిని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏను కోరుతోంది.


ఎన్‌డబ్ల్యూడీఏ ఇన్వెస్టిగేషన్‌ డివిజన్‌ రాజమండ్రిలో!

8వ తేదీన జరిగే సమావేశంలో రాజమహేంద్రవరంలో ఎన్‌డబ్ల్యూడీఏ ఇన్వెస్టిగేషన్‌ డివిజన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ప్రధాన కార్యాలయాన్ని ఇప్పటికే ఇక్కడకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Updated Date - May 06 , 2026 | 05:27 AM