Share News

క్వాంటమ్‌కు మనం రోడ్డు వేస్తున్నాం

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:51 AM

‘క్వాంటమ్‌ మిషన్‌ను ప్రారంభించినప్పు డు ఈ టెక్నాలజీ గురించి ఏమాత్రం అవగాహన లేదు. కేవలం 150 మందితో ఈ మిషన్‌ ప్రారంభించాం. ఇప్పుడు గల్లీల్లోనూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

క్వాంటమ్‌కు మనం రోడ్డు వేస్తున్నాం

  • జాతీయ క్వాంటమ్‌ మిషన్‌ డైరెక్టర్‌ జేబీవీ రెడ్డి

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ‘క్వాంటమ్‌ మిషన్‌ను ప్రారంభించినప్పు డు ఈ టెక్నాలజీ గురించి ఏమాత్రం అవగాహన లేదు. కేవలం 150 మందితో ఈ మిషన్‌ ప్రారంభించాం. ఇప్పుడు గల్లీల్లోనూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. రాబోయే ఐదు, పదేళ్లలో ఈ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తా యి. మనమంతా క్వాంటమ్‌ టెక్నాలజీకి తొలితరంగా ఉంటూ రోడ్డు వేస్తున్నాం..’ అని జాతీయ క్వాంటమ్‌ మిషన్‌ డైరెక్టర్‌ జేబీవీ రెడ్డి అన్నారు. విజయవాడలో ఉన్నత విద్యామండలి శుక్రవారం నిర్వహించిన అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ హ్యాకథాన్‌ ఫైనల్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆల్గరిథమ్స్‌తో పాటు క్వాంటమ్‌ కంప్యూటర్‌ తయారీకి అవసరమయ్యే హార్డ్‌వేర్‌ సబ్‌సిస్టమ్స్‌ను కూడా మనమే తయారు చేసుకునే పరిస్థితి రావాలి. క్వాంటమ్‌కు అవసరమైన హార్డ్‌వేర్‌ ఉపకరణాలు తయారుచేసుకోగల సత్తా మనకు ఉంది’ అన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ కె.మధుమూర్తి మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో మీరంతా కీలక అవకాశాలు పొందుతారు. అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యం అయ్యే అవకాశాలు లభిస్తాయి. మొదటిసారి సీఎం చంద్రబాబు.. క్వాంటమ్‌లో ఎంతమందికి శిక్షణ ఇస్తారు..? అని అడిగితే మా వద్ద సరైన అంచనా లేదు. కానీ ఇప్పుడు జాతీయ క్వాంటమ్‌ మిషన్‌ను మనమే ముందుండి నడిపిస్తున్నాం. మన విద్యా విధానం మార్కులు, గ్రేడులు, సర్టిఫికెట్లకే ప్రాధాన్యత ఇస్తోంది. క్వాంటమ్‌ వ్యాలీ హ్యాకథాన్‌ మన కళ్లు తెరిపిస్తుంది. రాబోయే కాలంలో కంపెనీలు కూడా మార్కులు, గ్రేడులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవు’ అని అన్నారు. క్వాంటమ్‌ వ్యాలీ హ్యాకథాన్‌లో రాష్ట్రం ప్రపంచ రికార్డు సాధించిందని అమరావతి క్వాంటమ్‌ మిషన్‌ డైరెక్టర్‌ సీవీ శ్రీధర్‌ అన్నారు. ఐబీఎం- క్వాంటమ్‌ మాజీ హెడ్‌ ఎల్‌.వెంకట సుబ్రమణ్యం మాట్లాడు తూ.. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ.. సిలికాన్‌ వ్యాలీని మించిపోతుందని అన్నారు.


విజేతలకు సీఎం చేతుల మీదుగా అవార్డులు

నాలుగు నెలల కిందట ప్రారంభమైన క్వాంటమ్‌ హ్యాకథాన్‌లో ఏపీతో పాటు ఆరు రాష్ర్టాల నుంచి సుమారు 50 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కో బృందంలో ఆరుగురు విద్యార్థులున్నారు. ఫైనల్స్‌ అనంతరం మొత్తం పది బృందాలను విజేతలుగా ప్రకటించారు. తర్వాతి పది బృందాలు రన్నర్‌పగా నిలిచాయి. ఈ 120 మందికి అమరావతిలో శనివారం జరిగే క్వాంటమ్‌ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేస్తారు. విజేతలకు రూ.50వేలు, రన్నర్‌లకు రూ.30 వేలు నగదు బహుమతులు ఇస్తారు.

Updated Date - Feb 07 , 2026 | 03:53 AM