రాష్ట్రానికి కొత్తగా 175 ఎంబీబీఎస్ సీట్లు
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:32 AM
రాష్ట్రంలో వైద్య విద్య విస్తరణలో మరో కీలక ముందడుగు పడింది. పిడుగురాళ్ల, విజయవాడలలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 175 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) ఆమోదం తెలిపింది.
పిడుగురాళ్లలో 100 సీట్లకు అనుమతి
ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రవేశాలు
విజయవాడలో అదనంగా 75 సీట్లు పెంపు
ఎన్‌ఎంసీ నుంచి డీఎంఈకి అనుమతి లేఖ
ఈ ఒక్క ఏడాదే 325 సీట్లు
అమరావతి/పిడుగురాళ్ల, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్య విద్య విస్తరణలో మరో కీలక ముందడుగు పడింది. పిడుగురాళ్ల, విజయవాడలలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 175 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) ఆమోదం తెలిపింది. పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో 100 సీట్లతో ప్రవేశాలు నిర్వహించేందుకు ఎన్‌ఎంసీ అనుమతిచ్చింది. అదేవిధంగా విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు అదనంగా 75 సీట్లను మంజూరు చేసింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్లను సోమవారం జారీ చేసింది. ఇప్పటికే కడప ప్రభుత్వ వైద్య కళాశాలలకు 75, నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50 అదనపు సీట్లలో ప్రవేశాలు జరుగనున్నాయి. దీంతో ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే రాష్ట్రానికి 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు లభించినట్లయింది. 2024-25 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 505 సీట్లు అదనంగా లభించాయి. సీట్ల పెంపు వెనుక ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కృషి ఉందని శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్‌ఎంసీ అనుమతులు పెండింగ్‌లో ఉన్న ప్రతి కళాశాల పురోగతిని స్వయంగా సమీక్షిస్తూ, ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ, ఎన్‌ఎంసీ ఉన్నతాధికారులను పలుమార్లు సంప్రదించి రాష్ట్ర ప్రతిపాదనలకు ఆమోదం వచ్చేలా ఆయన సమన్వయం చేశారు.
అత్యంత కీలకమైన పిడుగురాళ్ల కళాశాల విషయంలో సాంకేతిక అంశాలు అడ్డంకిగా మారిన సమయంలో మంత్రి జోక్యం చేసుకున్నారు. మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పరికరాల కల్పనను వేగవంతం చేయడంతో ఎన్‌ఎంసీ 100 ఎంబీబీఎస్ సీట్లతో అనుమతి మంజూరుచేసింది. దీంతో ఈవిద్యా సంవత్సరంలోనే అక్కడ తొలిబ్యాచ్ విద్యార్థులు అడుగుపెట్టనున్నారు.
మొత్తంగా 1,055 సీట్లు: 2024-25 నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 505, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 550 అదనపు ఎంబీబీఎస్ ప్రవేశాలకు అనుమతులు లభించాయి. మొత్తంగా 2024-25 నుంచి కూటమి హయాంలో 1,055 అదనపు సీట్లకు అనుమతులు వచ్చాయి.వీటితో రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 7,070కి పెరిగింది. ఇందులో 15 శాతం సీట్లు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లభించాయి.