వచ్చేనెల 14న జాతీయ లోక్ అదాలత్
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:14 PM
వచ్చేనెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని రెండవ అడిషనల్ జిల్లా న్యాయాధికారి పీజే సుధ కోరారు.
ఆదోని, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): వచ్చేనెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని రెండవ అడిషనల్ జిల్లా న్యాయాధికారి పీజే సుధ కోరారు. మంగళవారం ఆదోని కోర్టు ప్రాంగణంలో సబ్ న్యాయాధికారి యజ్ఞ నారాయణతో కలిసి పోలీసు అధికారులతో లోక్ అదాలత్ నిర్వహణపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయాధికారి పీజే సుధ మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదా లు, బ్యాంకు రికవరీ కేసులు, రుణాల వివాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, ప్రమాద బీమా కేసులు తదితరాలను ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా పోలీసు అధికారులు చొరవ చూపి కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, డబ్బు ఆదాయం అవ్వడమే కాకుండా, ఇరువర్గాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందన్నారు. సమావేశంలో ఫస్ట్ ఏడీఎం న్యాయాధికారి సుభాష్, పీడీఎం న్యాయాధికారి అర్చన, డీఎస్పీ హేమలత, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.