Share News

విద్యుత్‌ ప్రమాదాల నివారణే లక్ష్యం!

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:55 AM

దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి జూలై 2 వరకు జాతీయ విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన విద్యుత్‌ తనిఖీ అధికారి విజయలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

విద్యుత్‌ ప్రమాదాల నివారణే లక్ష్యం!

  • నేటి నుంచి జాతీయ విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు

  • విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన విద్యుత్‌ తనిఖీ అధికారి విజయలక్ష్మీ వెల్లడి

విజయవాడ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి జూలై 2 వరకు జాతీయ విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన విద్యుత్‌ తనిఖీ అధికారి విజయలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారుల్లో అవగాహన పెంచడం, ప్రమాదాలను నివారించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యుత్‌ ప్రమాదాల వల్ల ఏటా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోందని, అవగాహనలేమి కారణంగా పరిశ్రమలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ‘100 శాతం విద్యుత్‌ భద్రత-సున్నా ప్రమాదాలు’ లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యుత్‌ భద్రతా సంచాలకుల శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, ఆస్పత్రులు, పరిశ్రమలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఈవీ చార్జింగ్‌ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. భవనాల నిర్మాణం, విద్యుత్‌ వినియోగంలో కేంద్ర విద్యుత్‌ అథారిటీ (సీఈఏ) నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.


ఇవి కచ్చితంగా చేయాలి..

అత్యవసర పరిస్థితుల్లో ఎత్తైన భవనాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపేసే ఐసోలేటింగ్‌ పరికరాలు ఏర్పాటు చేయడం, ప్రతి అంతస్తులో ఫైర్‌ బారియర్లు ఏర్పాటు చేయడం అవసరమని విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆస్పత్రులు, విమానాశ్రయాలు, హోటళ్లలో తక్కువ పొగ వెలువరించే ఫ్లేమ్‌ రిటార్డెంట్‌ కేబుల్స్‌ వినియోగం తప్పనిసరి అని తెలిపారు. ప్రతి భవనంలో లైట్నింగ్‌ రక్షణ వ్యవస్థ, సరైన ఎర్తింగ్‌ ఉండాలని సూచించారు. ఇళ్లలో పాతబడిన వైరింగ్‌, నాణ్యతలేని పరికరాల వాడకం, సాకెట్లపై అధిక లోడ్‌ వేయడం, వదులైన కనెక్షన్లు వంటి కారణాల వల్ల షార్ట్‌సర్క్యూట్లు సంభవిస్తున్నాయని తెలిపారు. తేమ, సరైన ఫ్యూజ్‌లు లేదా బ్రేకర్లు లేకపోవడం, ఆర్‌సీసీబీ వంటి రక్షణ పరికరాలు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలను పెంచుతాయని వివరించారు. ఏసీలు, మోటార్లలో లోపాలు అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.

Updated Date - Jun 26 , 2026 | 05:57 AM