Share News

రక్షణగోడ రక్షించింది...

ABN , Publish Date - May 27 , 2026 | 05:21 AM

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుకు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. అదుపుతప్పిన బస్సు కాల్వలో పడిపోకుండా రెయిలింగ్‌ రక్షణ గోడ ఆపడంతో 31మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.

రక్షణగోడ రక్షించింది...

  • త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం

  • ఎన్టీటీపీఎస్‌ కూలింగ్‌ కెనాల్‌ రెయిలింగ్‌ను ఢీ కొన్న ప్రైవేటు ట్రావెల్‌ బస్సు

  • కాలువలో వేలాడిన బస్సు ముందు భాగం

  • పడిపోకుండా బస్సును ఆపేసిన రక్షణ గోడ

  • 31 మంది ప్రయాణికులు క్షేమం

ఇబ్రహీంపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుకు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. అదుపుతప్పిన బస్సు కాల్వలో పడిపోకుండా రెయిలింగ్‌ రక్షణ గోడ ఆపడంతో 31మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వెళుతున్న సితార ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు మంగళవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం కూలింగ్‌ కెనాల్‌పై ఉన్న వంతెన దాటుతున్న సమయంలో డ్రైవర్‌ నిద్ర మత్తులోకి జారుకున్నాడు. దీంతో వంతెన రెయిలింగ్‌ను ఢీ కొట్టుకుంటూ బస్సు ముందుకు వెళ్లింది. ముందు ఎడమ వైపు టైర్‌ కూలింగ్‌ కెనాల్లో గాలిలో తేలియాడింది. బస్సు కాల్వలోకి దూసుకుపోకుండా వంతెనకు రెయిలింగ్‌ కింద ఉన్న సేఫ్టీ గోడ ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో నుంచి కిందకు దిగే అవకాశం లేకపోవడంతో అంతా భీతిల్లిపోయారు. అయితే, బస్సు ముందు డోరు కాల్వ వైపు ఉండటంతో...వెనుక వైపు ఉన్న అత్యవసర ద్వారం నుంచి, డ్రైవర్‌ వద్ద ఉన్న డోరు నుంచి అందరూ కిందకు దిగిపోయా రు. పోలీసులు బస్సును క్రేన్‌ సాయంతో రహదారి మీద నుంచి పక్కకు తీశారు. బస్సు కాల్వలో పడి ఉంటే ఘోరం జరిగి ఉండేదని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Updated Date - May 27 , 2026 | 05:22 AM