Share News

ట్రంప్‌నకు దేశం తాకట్టు

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:44 AM

ట్రంప్‌ విధానాలకు సాగిలపడి బానిసగా మారిన ప్రధాని మోదీ... దేశాన్ని తాకట్టు పెట్టారు. అమెరికా వ్యవహరిస్తున్న తీరు వల్ల భారత్‌లోని వ్యవసాయ, చేనేత రంగాలకు తీరని నష్టం వాటిల్లుతోంది’ అని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ విమర్శించారు

ట్రంప్‌నకు దేశం తాకట్టు

  • ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మోదీ పేరు

  • అందుకే ఆయన యూఎస్‌కు సాగిలపడ్డారు

  • వ్యవసాయ, చేనేత రంగాలకు తీరని నష్టం

  • లడ్డూ కల్తీ బాధ్యులను శిక్షించాలి: నారాయణ

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ‘ట్రంప్‌ విధానాలకు సాగిలపడి బానిసగా మారిన ప్రధాని మోదీ... దేశాన్ని తాకట్టు పెట్టారు. అమెరికా వ్యవహరిస్తున్న తీరు వల్ల భారత్‌లోని వ్యవసాయ, చేనేత రంగాలకు తీరని నష్టం వాటిల్లుతోంది’ అని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ విమర్శించారు. కాకినాడలో జరుగుతున్న ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల సందర్భంగా బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ రూ.కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తుంది. బ్యాంకులకు రుణా లు ఎగ్గొట్టిన వారిలో 28 మంది దిగ్గజాలు ఉన్నారు. అందులో గుజరాత్‌కు చెందిన వారు 27 మంది. వారు రూ.27 లక్షల కోట్ల రుణాలను ఎగ్గొట్టారు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ రుణాలను మాఫీ చేస్తున్నారు. ప్రపంచాన్ని కుదిపివేస్తున్న ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మోదీ పేరు వచ్చింది. దీంతో ఆయన అమెరికాకు సాగిలపడి దేశం పరువు తీశారు. కార్పొరేట్ల మేలు కోసం అటవీ చట్టాలను మార్చి, అటవీ సంపదను వారికి దోచిపెడుతున్నారు. బిల్‌గేట్స్‌ను తీసుకువచ్చి అమరావతిలో అరటి తోటలను చూపించిన సీఎం చంద్రబాబు... కేంద్రంలో వ్యవసాయ రంగానికి అన్యాయం చేస్తున్న మోదీని నిలువరించడానికి మాత్రం భయపడుతున్నారు. వ్యవసాయ భూములను కారు చౌకగా కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగిస్తూ, వారికి ఊడిగం చేయడంలో మోదీ, బాబు పోటీ పడతున్నారు. పాలకులకు ఐఏఎ్‌సలు, ఐపీఎస్‌ అధికారులు బానిసలుగా ఉండొద్దు. పాలకుల మాటలు విని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి నేటికి కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో బాధ్యులైన వారిని శిక్షించాలి.’ అని నారాయణ డిమాండ్‌ చేశారు.


ఈసారి యానాం ఎమ్మెల్యే అశోక్‌ ఓటమికి కృషి చేస్తా

‘పుదుచ్చేరి రాష్ట్రంలోని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్‌ బీజేపీ పంచన చేరి అత్యంత అవినీతిపరుడి మారాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్‌ తరఫున ఆ ఎన్నికల్లో నేను ప్రచారం చేశా. గెలిచిన కొద్ది రోజుల తర్వాత ఆయన బీజేపీ పంచన చేరాడు. ఈసారి ఎన్నికల్లో అశోక్‌ పోటీ చేస్తే ఆయన ఓటమికి నేను ప్రచారం చేస్తా’ అని నారాయణ ప్రకటించారు.

Updated Date - Feb 19 , 2026 | 04:45 AM