Share News

సహనంతో ఉండండి

ABN , Publish Date - Apr 01 , 2026 | 06:01 AM

‘‘వైసీపీ అహంకార ధోరణి వల్ల 151 సీట్లు 11 అయ్యాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అధికారం ఉందనే అహంకారంతో వ్యవహరించొద్దు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఓర్పు సహనంతో వ్యవహరించాలి.

సహనంతో ఉండండి

  • అహంకారంతోనే వైసీపీ 151 నుంచి 11కి

  • పార్టీ కార్యకర్తల శిక్షణ తరగతుల్లో మంత్రి లోకేశ్‌

అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ అహంకార ధోరణి వల్ల 151 సీట్లు 11 అయ్యాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అధికారం ఉందనే అహంకారంతో వ్యవహరించొద్దు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఓర్పు సహనంతో వ్యవహరించాలి. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.’’ అని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ క్లస్టర్‌ ఇన్‌చార్జుల శిక్షణ తరగతుల్లో భాగంగా నిర్వహించిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రతి బూత్‌కు వెళ్లడం ద్వారా 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధించగలిగాం. పార్టీ వల్లే మనకు గౌరవం వస్తుంది. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే పార్టీ అధినేత చంద్రబాబు కృషి వల్లే అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.’’ అని తెలిపారు. క్లస్టర్‌ ఇన్‌చార్జులను టీడీపీ భవిష్యత్తు నాయకులుగా చూస్తున్నామన్నారు. రాబోయే 40 ఏళ్లు పార్టీ ఏ విధంగా నడవాలో మీరే నిర్ణయించబోతున్నారని చెప్పారు. ‘‘టీడీపీ యూనివర్సిటీ లాంటిది. తెలంగాణ సీఎంలుగా చేసిన వారు టీడీపీ నుంచి వచ్చిన వారే. పార్టీ మారుతున్న కాలంతో పాటు మారుతూ వచ్చింది. కాబట్టే సుదీర్ఘకాలం నిలబడగలిగింది. గ్రామ స్థాయి నాయకుడు బాగా పనిచేస్తే వారిని గుర్తించి పొలిట్‌బ్యూరోలో కూర్చోబెట్టాలి..’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.


ఆశించిన మార్పు కోసం కష్టపడాలి

‘‘కార్యకర్తే అధినేత అనే శాసనాన్ని అందరూ పాటించాలి. క్లస్టర్‌ ఇన్‌చార్జులు తమ పరిధిలోని యూనిట్‌, బూత్‌ల బలోపేతానికి కృషి చేయాలి. చంద్రబాబు మన అధినేత. మనందరం కార్యకర్తలం. ఆయనే మన సేనాధిపతి. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంతకాలమైనా పార్టీలో అంతర్గతంగా పోరాడాలి. పార్టీ నేతలు ఆలకవీడాలి. ‘మై టీడీపీ’ యాప్‌ ద్వారా పార్టీలో కష్టపడి పనిచేసేవారిని గుర్తిస్తాం. ప్రతి చిన్న విషయానికీ సోషల్‌ మీడియాకి ఎక్కి పార్టీని పలుచన చేయవద్దు.’’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు. పార్టీని ఒక వ్యవస్థలా తయారు చేయాలన్నదే లక్ష్యమని తెలిపారు. ‘‘ఈ వ్యవస్థలో ఎప్పుడైతే నా అవసరం ఉండదో అప్పుడు నేను విజయం సాధించినట్లు.’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ‘‘జగన్‌ రెడ్డికి క్రెడిట్‌ చోరీ డిజార్డర్‌ ఉంది. ఆ జబ్బు నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.’’ అని వ్యాఖ్యానించారు.

కార్యకర్త కుటుంబానికి భరోసా

టీడీపీ కోసం అంకితభావంతో పనిచేసిన ఓ కార్యకర్త కుటుంబానికి మంత్రి నారా లోకేశ్‌ అండగా నిలిచారు. గతేడాది కర్నూలు జిల్లా నన్నూరు వద్ద విద్యుదాఘాతంతో మునగాలపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఎం. అర్జున్‌ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అర్జున్‌ కుటుంబ సభ్యులను మంగళగిరిలోని కార్యాలయానికి పిలిపించారు. అర్జున్‌ తల్లిదండ్రులు మస్టిక్‌ మద్దిలేటి, రాణిలతో లోకేశ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అర్జున్‌ మరణం తనను బాధించిందన్నారు. అర్జున్‌ సోదరి కోమలి చదువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని, జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


ఎమ్మెల్యేలూ జాగ్రత్త.. డబ్బు కోసం అడ్డదారులు వద్దు

వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే వలసదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేశ్‌ టీడీపీ ప్రాంతీయ సమన్వయకర్తలను హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీ అయ్యారు. అధికారంలో ఉన్నామని అవసరం కోసం వచ్చే అవకాశవాదులు పార్టీలో కొనసాగుతారనే గ్యారంటీ లేదని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కష్టసమయంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలకే ప్రాధాన్యం ఉండాలని సూచించారు. వైసీపీ నుంచి వచ్చే వారిని పార్టీలో చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణుల్ని సిద్ధం చేయాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి.. పార్టీనే సుప్రీం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని, డబ్బు కోసం అడ్డదారులు తొక్కవద్దని స్పష్టం చేయాలని కోరారు. ఇసుక, గ్రావెల్‌ అక్రమ రవాణాల్లో ఎమ్మెల్యేల పాత్ర ఉంటే పార్టీ ఉపేక్షించదని స్పష్టం చేశారు.

Updated Date - Apr 01 , 2026 | 06:02 AM