ఉప్పొంగిన అభిమానం!
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:38 AM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఆయన పేరిట ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఘనంగా మంత్రి లోకేశ్ జన్మదిన వేడుకలు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు
తిరుమలలో భక్తులకు ఒకరోజు ‘భాష్యం’ అన్నప్రసాదం
రూ.44 లక్షలు విరాళం ఇచ్చిన రామకృష్ణ
మడకశిరలో పదివేల మందికి ఇంటి పట్టాలు అందజేత
70మంది అనాథ పిల్లలకు వాసంశెట్టి దుస్తుల పంపిణీ
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఆయన పేరిట ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పలుచోట్ల సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వాడవాడలా భారీ కేక్‌లు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. లోకేశ్ జన్మదినం సందర్భంగా తిరుమలలో భక్తులకు ఒకరోజు అన్నప్రసాద వితరణ కోసం భాష్యం సంస్థల అధినేత రామకృష్ణ రూ.44 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విరాళంతో భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో వడ్డించారు. శ్రీవారి ఆలయం ముందున్న అఖిలాండం వద్ద టీడీపీ నేతలు 1,116 కొబ్బరికాయలు కొట్టారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఉన్న ముచ్చుమిల్లి న్యూలైఫ్ ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్న 70మంది అనాథ చిన్నారులను మంత్రి వాసంశెట్టి సుభాష్ టూరిస్టు బస్సులో పట్టణంలోని రిలయన్స్ ట్రెండ్స్ షాపింగ్ మాల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ వారికి నచ్చిన దుస్తులు కొనుగోలు చేసి పిల్లలకు అందజేశారు. విజయనగరం జిల్లాలో చేపట్టిన రక్తదాన శిబిరాల్లో 1,079 యూనిట్ల రక్తాన్ని సేకరించి, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు అందించారు. ఇక రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన స్వగ్రామం వెంకటాపురంలో పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తనయుడు భరత్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 96మంది రక్తదానం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పదివేల మంది పేదలకు ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.
గల్ఫ్‌లో టీడీపీ అభిమానుల సంబరాలు
లోకేశ్ జన్మదిన వేడుకలను శుక్రవారం గల్ఫ్ దేశాల్లో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. సౌదీ అరేబియాలోని రియాధ్‌లో టీడీపీ నాయకులు జానీ బాషా, రాజశేఖర్ చెన్నుపాటి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మహిళలు, పార్టీ అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. ఒమన్‌లోని మస్కట్ నగరంలో గారపాటి సత్యశ్రీధర్, అనిల్ నాగిడి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఖతార్, బహ్రెయిన్, దుబాయిల్లో కేకులు కట్ చేశారు. కువైత్‌లో కోడూరి వెంకట్ అధ్వర్యంలో జరిగిన సభలో భారీగా అభిమానులు పాల్గొన్నారు.
విజయవాడలో లోకేశ్ భారీ కటౌట్
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడ వన్‌టౌన్ రథం సెంటర్ వద్ద 40 అడుగుల లోకేశ్ కటౌట్ ఏర్పాటు చేశారు. లోకేశ్‌కు బుద్దా వెంకన్న ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీని నడిపించే బాధ్యతను త్వరలో చేపడతారని ఆశిస్తూ ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు.
టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో..
అమరావతిలోని హైకోర్టు వద్ద టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లీగల్ సెల్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశర్వర్లు, జనరల్ సెక్రటరీ పారా కిశోర్‌తో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వరుసగా నాలుగోఏడాది నిర్వహించిన ఈ శిబిరంలో పెద్దఎత్తున న్యాయవాదులు రక్తదానం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ కేక్ కట్ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, న్యాయవాదులు గొట్టిపాటి రామకృష్ణ, పాండురంగారావు, చుక్కపల్లి రమేష్ పాల్గొన్నారు.
లోకేశ్‌కు పవన్ శుభాకాంక్షలు
మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావితరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సుహృద్భావ వాతావరణ కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో లోకేశ్ ముందుడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు ఆయనకు మరింత శక్తి, సుఖసంతోషాలను అందించాలని ప్రార్థిస్తున్నాను’ అని ‘ఎక్స్’లో చేసిన పోస్టులో పవన్ పేర్కొన్నారు.