Share News

దక్షిణ కొరియాకు లోకేశ్‌

ABN , Publish Date - Jul 05 , 2026 | 06:08 AM

దక్షిణ కొరియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు పర్యటన ఉండనుంది.

దక్షిణ కొరియాకు లోకేశ్‌

  • నేటి నుంచి వారం రోజుల పాటు పర్యటన

  • ఆ దేశ ప్రభుత్వ ఆహ్వానం మేరకు వెళ్తున్న మంత్రి

  • పెట్టుబడులు లక్ష్యంగా వివిధ కంపెనీలతో చర్చలు

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): దక్షిణ కొరియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు పర్యటన ఉండనుంది. లోకేశ్‌ శనివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి దక్షిణ కొరియా బయల్దేరి వెళ్లారు. ఆదివారం ఉదయం ఆయన కొరియా రాజధాని సియోల్‌కు చేరుకుంటారు. పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్‌ కొరియాలో వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. భారత్‌, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు దక్షిణ కొరియా కాన్సులేట్‌ జనరల్‌ (చెన్నై) చాంగ్‌ న్యూన్‌ కిమ్‌ మంత్రి లోకేశ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆదివారం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశానికి లోకేశ్‌ హాజరవుతారు. 6న దక్షిణ కొరియా టెక్‌ స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, వివిధ కంపెనీలతో పెట్టుబడి చర్చల్లో లోకేశ్‌ పాల్గొంటారు.


అనంతరం హ్యోసంగ్‌ భారీ పరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకొటా, సియోల్‌ సెమీ కండక్టర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టేహ్యుంగ్‌ లీతో భేటీ అవుతారు. 7న ఎల్జీ కెమ్‌ గ్లోబల్‌ స్ట్రాటజీ సెంటర్‌ ప్రెసిడెంట్‌, ఎల్జీ ఓవర్‌సిస్‌ కంపెనీస్‌ హెడ్‌ యున్‌ జుకోహ్‌ ఎల్జీ టవర్స్‌లో ఏర్పాటు చేసిన విందు సమావేశంలో పాల్గొంటారు. 8న కొరియన్‌ మెరైన్‌ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్‌ ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. 9న ఆ దేశ రాజకీయ వ్యవహారాలు డిప్యూటీ మంత్రి మిస్‌.యుయి హే సిసిలియా చుంగ్‌తో భేటీ అవుతారు. అనంతరం అంతర్జాతీయ వాణిజ్య, పెట్టుబడుల శాఖ డిప్యూటీ మంత్రి కాంచన్‌ కాంగ్‌తో సమావేశమవుతారు. 10న వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడి చర్చలు జరుపుతారు. అదే రోజు రాత్రి సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026ను విజయవంతం చేయాలని కోరుతూ కొరియా కంపెనీల ప్రతినిధులతో రోడ్‌షోలో పాల్గొంటారు.

Updated Date - Jul 05 , 2026 | 06:09 AM