ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!
ABN , Publish Date - Apr 05 , 2026 | 04:09 AM
‘నేటి తరంపిల్లలు చాలా సున్నితంగా మారిపోయారు. ఒక్క ఎగ్జామ్‌లో ఫెయిలైతే ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయని, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలాయని అధైర్యపడకూడదు.
ఓటమి నుంచి పాఠాలు నేర్వాలి: లోకేశ్
అహర్నిశలూ కష్టపడండి.. అనుకున్నది సాధించండి
నేను గోల్డెన్ స్పూన్‌తో పుట్టాననుకుంటారు
కానీ ఏదీ ఈజీగా రాలేదు.. కష్టపడి సాధించుకున్నా
రాష్ట్రాల మధ్య పోటీ ఉంటేనే అభివృద్ధిలో ముందుకు
సింధనూరు తెలుగువారికి జీవితాంతం రుణపడి ఉంటా
చంద్రబాబు అక్రమ అరెస్టు టైంలో 10 వేల మందితో ర్యాలీ చేశారు.. కేంద్ర మంత్రులతో కలిసి సైనిక్ స్కూలుకు ప్రారంభోత్సవం
జీవితంలో ఓటమి సహజం. ఓటమి లేనిదే జీవితం పరిపూర్ణం కాదు. కానీ ఆ ఓటమి ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. ‘ఫెయిల్’ అంటే ఫస్ట్ ఎటెమ్ట్ ఇన్ లెర్నింగ్ అని అర్థం.
- మంత్రి లోకేశ్
అమరావతి/బళ్లారి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ‘నేటి తరంపిల్లలు చాలా సున్నితంగా మారిపోయారు. ఒక్క ఎగ్జామ్‌లో ఫెయిలైతే ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయని, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలాయని అధైర్యపడకూడదు. ఆ ఎదురుదెబ్బలే మనలో కసి పెం చాలి. అహర్నిశలూ కష్టపడాలి. అనుకున్నది సాధించాలి’ అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ పిలుపిచ్చారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరు హోసళ్లీ కాం్యపులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూలును కేంద్ర ఉక్కు మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. ‘ఎల్లారిగు నమస్కారా.. నిమ్మ ప్రీతిగే ధన్యవాదగలు’ అంటూ కన్నడలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘అందరూ.. లోకేశ్‌కు ఏంటి.. గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడనునుకుంటారు. ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు కొడుకు, బాలయ్య అల్లుడు.. ఆయనకు తిరుగేముందని అంటారు. కానీ నాకు ఏదీ అంత ఈజీగా రాలేదు. టీడీపీ 1985 నుంచి గెలువని మంగళగిరిలో 2019లో పోటీ చేసి ఓడిపోయాను. ఆ తర్వాత ఐదేళ్లు కష్టపడ్డాను. 2024 ఎన్నికల్లో అక్కడ రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజారిటీ 91 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను.
అందుకే ఓటమిని తేలిగ్గా తీసుకోవద్దు.. దాని నుంచి పాఠాలు నేర్చుకోండి. కర్ణాటక విద్యార్థులు చాలా తెలివైనవారు, క్రమశిక్షణ కలి గి ఉంటారు. మీరు దేశభవిష్యత్ కోసం పెద్ద పెద్ద కలలు కని వాటి సాకారానికి కృషి చేయండి’ అని సూచించారు. సైనిక్ స్కూలు ప్రారంభోత్సవానికి హాజరవడం చాలా గర్వంగా ఉందన్నారు. సైనికుల ప్రాణత్యాగాలను ఎప్పుడూ మరచిపోకూడదని.. ఎక్కడైనా సైనికులు కనబడితే సెల్యూట్ చేయాలని విద్యార్థులకు సూచించారు. ‘అనంతపురం జిల్లాకు చెందిన మురళీనాయక్ అనే వీర జవాన్‌కు చిన్నప్పటి నుంచీ దేశభక్తి ఎక్కువ. ఆర్మీలోకి వెళ్తానని తల్లిదండ్రులతో అంటే ఒక్కగానొక్క కొడుకును పం పేందుకు వారు ఒప్పుకోలేదు. అప్పుడు మురళీ నా యక్.. నేను దేశం కోసం చనిపోతే దేశం మొత్తం మీకు అండగా ఉంటుందని వారితో అన్నాడు. ఆయ న్ను పాకిస్థాన్ ఆర్మీ చంపేస్తే దేశం మొత్తం ఆ కుటుంబానికి అండగా నిలబడింది’ అని వివరించారు.
తల్లికి చెప్పలేని పని చేయకు..!
సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయని, అందుకే ఆంధ్రప్రదేశ్‌లో విలువల ఆధారిత విద్యాబోధన మొదలుపెట్టామని లోకేశ్ తెలిపారు. మహిళలను అవమానించేలా.. ‘గాజులు తొడుక్కున్నావా’, ‘చీర కట్టుకున్నావా’, ‘ఆడపిల్లలా ఏడుస్తావు’ లాంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పని చెప్పాలని తల్లిదండ్రులను కోరారు. ‘తల్లికి చెప్పలేని పని చేయకూడదని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు.. ఓ మంచి మాట చెప్పారు. అది చాలా సింపుల్.. బట్ పవర్‌ఫుల్. అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ చేయవద్దు’ అని సూచించారు.
మీకు రుణపడి ఉంటాం..
టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగాఅరెస్టు చేసినప్పుడు సింధనూరులోని తెలుగువారు అండగా నిలిచారని, 10వేల మందితో ర్యాలీ చేశారని.. వారందరికీ తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని లోకేశ్ పేర్కొన్నారు. రాయచూర్, గంగావతిలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారని గుర్తు చేసుకున్నారు. ‘మీకు అవి ర్యాలీలుగా కనిపించవచ్చు. కానీ మా కుటుంబానికి అవి కొండంత బలం’ అని చెప్పారు. ‘సింధనూరు విద్యారంగంలో నంబర్ వన్, ఆటోమొబైల్, బియ్యం ఉత్పత్తి, అధిక పన్నుల చెల్లింపులో నంబర్ వన్. దాని రికార్డులు ఎవ్వరూ బ్రేక్ చేయలేరు. ఇక్కడికి వలస వచ్చిన తెలుగువారు సొంత నిధులతో నిరుపేదలకు విద్య, వైద్యం అందించారు. ఈ సేవా దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా’ అని అన్నారు.
రాష్ట్రాల మధ్య పోటీ ఉంటేనే..
ఇక్కడకు వచ్చినప్పుడు తనకు పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని, అప్పుడు కర్ణాటక సీఎంగా ఎస్‌ఎం కృష్ణ ఉంటే.. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేవారని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ‘ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. తమ రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటు చేయించేందుకు పోటీ పడేవారు. ఆ పోటీ వారిలో కసిని పెంచింది. దానివల్లే అటు ఉమ్మడి ఏపీ ఇటు కర్ణాటక అద్భుతంగా అభివృద్ధి చెందాయి’ అని తెలిపారు.
ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ
హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్‌తో కలిసి లోకేశ్ ఆవిష్కరించారు. అంతకుముందు సింధనూరు చేరుకున్న ఆయనకు స్థానిక తెలుగు ప్రజలు దారిపొడవునా పూలు జల్లుతూ నీరాజనాలు పలికారు.
కుమారస్వామి విశాఖ ఉక్కును కాపాడారు
కేంద్ర మంత్రి కుమారస్వామి కుటుంబంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని.. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా చంద్రబాబు ఉంటే.. దేశ ప్రధానిగా దేవగౌడ ఉన్నారని, వారిద్దరూ కలిసికట్టుగా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారని లోకేశ్ చెప్పారు. ‘ఏపీలో గత పాలకుల అవినీతి వల్ల విశాఖ ఉక్కు పరిశ్రమ అనేక ఇబ్బందులు పడింది. చివరకు ప్లాంట్ మూయడమో.. విక్రయించేయడమో చేయాల్సిన పరిస్థితుల్లో.. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వబోమని కుమారస్వామి మాటిచ్చారు. ఆర్సెలార్ మిట్టల్ ఏపీకి రావడం వెనుక ఆయన సహకారం ఉంది. ఆయన ఉక్కు మంత్రిగా ఉండడం దక్షిణ భారతం చేసుకున్న అదృష్టం’ అని కొనియాడారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, కర్నాటక మంత్రులు శరణ్ ప్రకాశ్ పాటిల్, శివరాజ్, బోసురాజు, రాయచూర్ ఎంపీ కుమార్ నాయక్, సింధనూరు ఎమ్మెల్యే హంపనగౌడ, శ్రీకృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ బి.వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక కుర్చీ వద్దంటూ..
హోసళ్లీ క్యాంపు సభావేదికపై లోకేశ్ కోసం నిర్వాహకులు ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేశారు. వేదికపైకి వచ్చిన లోకేశ్.. దానిని తీసివేసి తనకూ తోటి అతిథులకు మాదిరిగా సాధారణ కుర్చీ వేయాలని కోరారు. పర్వాలేదు కూర్చోండని కుమారస్వామి బలవంతం చేసినా ఆయన ససేమిరా అన్నారు.