Share News

మీకూ మాకూ ఎంతో తేడా!

ABN , Publish Date - May 23 , 2026 | 04:27 AM

‘‘మా నాన్న ఉత్తరం రాశారు.. మా తాత కల కన్నారు.. నేను ఆత్మలతో మాట్లాడాను అంటే నమ్మే వాళ్లు ఎవరూ లేరు బ్రదర్‌.. మా బ్రాండ్‌ జాబ్‌ క్రియేషన్‌(ఉపాధి కల్పన).. మీ బ్రాండ్‌ గొడ్డలి.

మీకూ మాకూ ఎంతో తేడా!

  • మా బ్రాండ్‌ ఉపాధి కల్పన.. మీ బ్రాండ్‌ గొడ్డలి.. జగన్‌పై లోకేశ్‌ ఫైర్‌

  • జమ్మలమడుగు టి.కొండూరులో ‘సేల్‌’ సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు ప్రారంభం

  • 3 వేల కోట్లతో నిర్మాణం.. 600 మె.వా. సామర్థ్యం

  • బ్రాండ్‌ సీబీఎన్‌ వల్లే అభివృద్ధి పరుగులు

  • హరిత ఇంధన విప్లవానికి నాయకత్వం వహించడానికి రాష్ట్రం సిద్ధం: మంత్రి

కడప, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘‘మా నాన్న ఉత్తరం రాశారు.. మా తాత కల కన్నారు.. నేను ఆత్మలతో మాట్లాడాను అంటే నమ్మే వాళ్లు ఎవరూ లేరు బ్రదర్‌.. మా బ్రాండ్‌ జాబ్‌ క్రియేషన్‌(ఉపాధి కల్పన).. మీ బ్రాండ్‌ గొడ్డలి. రెండింటికీ ఎంతో తేడా ఉంది’ అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. రెండ్రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం కడపకు చేరుకున్న ఆయన.. మొదటి రోజు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రెండోరోజు శుక్రవారం జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టి.కొండూరులో సుఖ్‌బీర్‌ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్‌ (సేల్‌) రూ.3 వేల కోట్లతో ఒక్కోటీ 300 మెగావాట్ల చొప్పున 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన రెండు సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. ‘ఈరోజు ఒక సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవం మాత్రమే కాదు.. దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణ కలగలిసిన వేడుక’ అని అభివర్ణించారు. రికార్డ్‌ టైమ్‌లో ఈ ప్రాజెక్టు పూర్తయిందని.. ఇది స్థానిక రైతుల విజయం, జమ్మలమడుగు యువత విజయం’ అని స్పష్టంచేశారు. వారి సహకారం వల్లే ఈ ప్రాజెక్టు 11 నెలల్లో పూర్తయిందన్నారు. రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తోందని.. ఇతర నియోజకవర్గాల వాళ్లు మాకు కూడా ఇటువంటి కంపెనీలు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారని తెలిపారు. ‘ఇక్కడ మెగా సోలార్‌ పార్క్‌ ఏర్పాటుచేసింది మనమే. ఇప్పుడు ‘సేల్‌’ తీసుకొచ్చిందీ మనమే.


అదానీ, చింతా గ్రీన్‌, జెన్‌కో - ఎన్‌టీపీసీ పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు తెచ్చింది కూడా మనమే. ‘సేల్‌’ రావడం వల్ల రైతులకు లబ్ధి జరిగింది.. యువతకు ఉద్యోగాలు వచ్చాయి. కంపెనీలు తీసుకురావాలన్నా, ఉద్యోగాలు కల్పించాలన్నా అది మన బ్రాండ్‌ సీబీఎన్‌కు మాత్రమే సాధ్యం’ అని తేల్చిచెప్పారు. పెట్టుబడుల సాధన, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో ఏపీ విజయానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయని తెలిపారు. మొదటిది.. బ్రాండ్‌ సీబీఎన్‌. పెట్టుబడిదారులు ఇపుడు మే మెంత ఎంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌కు రావాలని అడుగుతున్నారు. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌ నేడు ఒక గ్లోబల్‌ బ్రాండ్‌ గా ఎదిగింది. రెండోది.. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌. నిర్ణయాలు వేగంగా తీసుకుని, ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేసినప్పుడే విధానాలకు విలువ ఉంటుంది. సేల్‌ ప్రాజెక్టే అందుకు నిదర్శనం. ప్రాజెక్టు 11 నెలల్లో పూర్తయింది. మూడోది డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌. కేంద్రంలో ని ఎన్డీఏ ప్రభుత్వ మద్దతుతో రాష్ట్రాభివృద్ధి వేగవంతమైంది.’ అని చెప్పారు.


ప్రపంచంతో పోటీపడే ఎకోసిస్టమ్‌ నిర్మాణం

రాష్ట్రం ఇప్పుడు ఎలక్ర్టానిక్స్‌, గ్రీన్‌ ఎనర్జీ, సాఫ్ట్‌వేర్‌, డ్రోన్‌లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఫార్మా, అధునాతన తయారీ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్‌ క్లస్టర్లను నిర్మిస్తోందని లోకేశ్‌ అన్నారు. ఆధునిక ఆర్థిక వృద్ధి.. ఎకోసిస్టమ్స్‌, స్పెషలైజేషన్‌, ఆవిష్కరణల ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్‌, భారత ప్రభుత్వం కలిసి భవిష్యత్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీపడే ఎకో సిస్టమ్స్‌ను నిర్మిస్తున్నాయి. ‘సేల్‌’ నాయకత్వంతో మొట్టమొదటి సంభాషణ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆరోజు ఏపీలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ను నిర్మించాలనే తమ ప్రణాళికల గురించి ‘సేల్‌’ నాయక త్వం ఎంతో ఉద్వేగంగా మాట్లాడింది. వారి ఉద్దేశాన్ని వెంట నే గ్రహించాను. ‘సేల్‌’ బృందం అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును, నన్ను కలిసింది. సేల్‌ బృందం స్థానిక సమాజం, ప్రజలతో మమేకమైంది. ఆ స్ఫూర్తే ఈ ప్రాజెక్టును విజయవంతం చేసింది. ‘సేల్‌’ రూ.3000 కోట్ల పెట్టుబడి పెట్టి, 2400 ఎకరాలకు పైగా విస్తీర్ణంతో ఎంహెచ్‌పీ-1, ఎంహెచ్‌పీ-2 భారీ 300 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం 11 నెలల్లో వేగవంతంగా పూర్తియి రికార్డు సృష్టించింది. పంజాబ్‌, రాజస్థాన్‌లోని ఈ సంస్థ సొంత ప్లాంట్లలో తయారైన 12లక్షలకు పైగా టాప్‌కాన్‌ బైఫేషియల్‌ సోలార్‌ మాడ్యూల్స్‌ను ఇక్కడ ఏర్పాటుచేశారు’ అని వివరించారు.

11లక్షల టన్నుల కర్బన ఉద్గారాల తగ్గుదల

ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారా ఏటా సుమారు 11 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించవచ్చనేది అంచనాగా లోకేశ్‌ పేర్కొన్నారు. ‘ఇక్కడ ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన విద్యుత్‌.. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) తో కుదిరిన 25 ఏళ్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ప్రకారం జాతీయ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. ఏపీ కేవలం క్లీన్‌ ఎనర్జీని వినియోగించడమే కాదు.. భారతదేశానికి ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదుగుతోంది. సేల్‌ బృందం, ముఖ్యంగా పంజాబ్‌ నుంచి వచ్చిన సోదరీ సోదరీమణులకు నేను చెప్పేది ఒక్కటే. ‘తుస్సీ కమాల్‌ కర్‌ దిట్టా... చక్‌ దే ఫట్టే’.. ఆంధ్రప్రదేశ్‌ మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా స్వాగతిస్తోంది’ అని తెలిపారు.


అప్పట్లోనే వెయ్యి మందికి ఉపాధి..

‘ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే వెయ్యి మందికి పైగా కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ-ఉపాధి లభించింది. వీరిలో 80 శాతం మంది స్థానికులే. వీరి ఆదాయాలు మెరుగయ్యా యి. అన్నింటికన్నా ముఖ్యంగా దీర్ఘకాలిక లీజు ఒప్పందాల ద్వారా 760 మంది రైతులు, వారి కుటుంబాలు లబ్ధి పొందాయి’ అని లోకేశ్‌ తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ వ్యర్ధాల నుంచి ‘సేల్‌’ విద్యుదుత్పత్తి చేయనుందని చెప్పారు. ‘సేల్‌’ బృందం రాబోయే ‘ఐపీవో’ ప్రయాణంలో గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. ‘సేల్‌’ సంస్థకు ఏ మద్దతు కావాలన్నా నేను ఒక్క వాట్సాప్‌ కాల్‌ దూరంలోనే ఉంటాను..’ అని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో విద్యుత్‌ మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, సవిత, సేల్‌ సహవ్యవస్థాపకుడు-డైరెక్టర్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌-సీఈవో లక్షిత్‌ ఆవ్లా పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 04:30 AM