Share News

సెప్టెంబర్లో పురపోరు!

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:17 AM

స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబరులో నిర్వహించేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. టీడీపీ జోనల్‌ కో ఆర్డినేటర్లతో గురువారం టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ సమావేశమయ్యారు.

సెప్టెంబర్లో పురపోరు!

  • తర్వాత జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు

  • చివరిగా గ్రామ పంచాయతీలకు

  • స్థానిక సమరానికి సిద్ధమవ్వండి

  • ఈ ఎన్నికల్లో 3 పార్టీల నడుమ 80:15:5 నిష్పత్తిలో సీట్ల పంపిణీ

  • టీడీపీ కో-ఆర్డినేటర్లకు లోకేశ్‌ స్పష్టీకరణ

  • 27 నుంచి ‘ఇంటింటికీ టీడీపీ’

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబరులో నిర్వహించేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. టీడీపీ జోనల్‌ కో ఆర్డినేటర్లతో గురువారం టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ సమావేశమయ్యారు. కొత్తగా జోనల్‌ కో ఆర్డినేటర్లను నియమించిన తర్వాత జరిగిన ఈ తొలి భేటీలో స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని లోకేశ్‌ వారికి సూచించారు. తొలుత మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ఆతర్వాత జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు జరుగుతాయని.. చివరిగా పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల నడుమ సీట్ల సర్దుబాటుపైనా చర్చ జరిగింది. 80:15:5 నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు ఉంటుందని, టీడీపీ 80 శాతం సీట్లు, జనసేన 15 శాతం, బీజేపీ 5 శాతం సీట్లలో బరిలోకి దిగుతాయని.. స్థానిక పరిస్థితులను బట్టి సర్దుబాటు చేసుకుందామని లోకేశ్‌ అన్నారు.

27 నుంచి ‘ఇంటింటికీ టీడీపీ’

కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఈ నెల 27 నుంచి ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం చేపట్టాలని పార్టీ శ్రేణులను అధిష్ఠానం ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని 45 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ ప్రజాప్రతినిధులతోపాటు వివిధ పదవుల్లో ఉన్న నాయకులంతా ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. వారానికి కనీసం 4 రోజులపాటు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని అధిష్ఠానం శ్రేణులకు దిశానిర్దేశం చేసింది.

Updated Date - Jul 17 , 2026 | 04:18 AM