Share News

శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:49 AM

రష్యా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు.

శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి

  • అసెంబ్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయండి

  • లోకోమోటివ్‌, బోగీ తయారీ కేంద్రం ఏర్పాటుకు సహకరించండి

  • రష్యాలో ట్రాన్స్‌మాష్‌ బృందంతో లోకేశ్‌ సమావేశం

  • సెయుంట్‌పీటర్స్‌బర్గ్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): రష్యా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. అతిపెద్ద రైల్‌ రోలింగ్‌ స్టాక్‌ తయారీదారు, ప్రపంచశ్రేణి అగ్ర సరఫరాదారు ట్రాన్స్‌మా్‌ష హోల్డింగ్‌-జేఎస్‌సీ గ్లోబల్‌ ఫైనాన్స్‌ హెడ్‌ విక్రోమోవ్‌ బృందంతో నాలుగో రోజైన శుక్రవారం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో సమావేశమయ్యారు. శ్రీసిటీలో రైలు విడిభాగాల అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ స్థాపించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ వారితో మాట్లాడుతూ, తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఆల్మోమ్‌ భారీ మెట్రో రోలింగ్‌ స్టాక్‌ ఫెసిలిటీ ఎకోసిస్టమ్‌ను ఉపయోగించుకుని ఒక ప్రధాన రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్‌ను స్థాపించాలని ఆహ్వానించారు. లోకోమోటివ్‌, బోగీల తయారీ కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లోకేశ్‌ ప్రతిపాదనలపై ట్రాన్స్‌మా్‌ష హోల్డింగ్స్‌ ప్రతినిధులు మాట్లాడుతూ, భారత్‌లో 120 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీలో భాగస్వాములుగా ఉన్నామని వెల్లడించారు. లోకేశ్‌ ప్రతిపాదనలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.

ఏపీ కోసం ఉమ్మడి వర్కింగ్‌ గ్రూపు

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ గవర్నమెంట్‌ రీజినల్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ విభాగం చీఫ్‌ ఎక్స్‌పర్ట్‌ పోలినా పోలుఖినాతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సేఫ్‌ అండ్‌ స్మార్ట్‌ కోసం పౌరులతో చర్చలు, డేటా ఆధారిత నగర నిర్వహణ, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌, మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై చర్చించారు. పోలినా పోలుఖినా మాట్లాడుతూ, డిజిటలైజేషన్‌ ద్వారా ఖర్చును బాగా తగ్గించామని వెల్లడించారు. ఆ విధానాలను ఏపీలో అమలు చేసేందుకు సెయింట్‌పీటర్స్‌బర్గ్‌-ఏపీ మధ్య సంయుక్త వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేద్దామని లోకేశ్‌ సూచించారు.

స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్లు ఏర్పాటు చేయండి

రష్యాకు చెందిన గ్లోబల్‌ న్యూక్లియర్‌ టెక్నాలజీ లీడర్‌ రోసాటమ్‌ డైరెక్టర్‌ అబాకునవ్‌ ఎవ్‌జీనీతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ఖాళీగా ఉన్న తీర ప్రాంత భూమిని ఉపయోగించి, భారీ పారిశ్రామిక జోన్‌లకు నిరంతరాయంగా విద్యుత్తును అందించాలని కోరారు. భారతఫార్మా రంగాన్ని, వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడానికి సిద్ధంగా ప్లగ్‌ అండ్‌ ప్లే విధానాన్ని ఉపయోగించుకుని ఒక న్యూక్లియర్‌ మెడిసిన్‌ ఫుడ్‌ ఇరాడియేషన్‌ సెంటర్‌ను స్థాపించాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ముగా ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌లో ఒక న్యూక్లియర్‌ డీశాలినేషన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. భారత్‌ ఏరోస్పేస్‌ రక్షణ రంగాలకు నేరుగా అనుసంధానించేలా మినరల్‌ బెల్ట్‌/కారిడార్‌ పరిధిలో న్యూక్లియర్‌ గ్రేడ్‌ మిశ్రమ లోహాలు, కార్బన్‌-ఫైబర్‌ కాంపోనెంట్‌లను తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.


ఆర్కిటిక్‌ జల రవాణాతో ఎంతో ప్రయోజనం

ఆర్కిటిక్‌ జలరవాణా మార్గంతో ఎంతో ప్రయోజనం ఉందని, ఇంధనం, ఖర్చులు తగ్గుతాయని లోకేశ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మార్గంతో ఆసియా-ఐరోపాల మధ్య దూరం 40 శాతం మేర తగ్గుతుందని వెల్లడించారు. ఈ మార్గంలో ఎరువుల రవాణాతో ఏపీకి ప్రయోజనమని తెలిపారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో గ్లోబల్‌ లాజిస్టిక్స్‌పై సదస్సులో లోకేశ్‌ మాట్లాడారు. అత్యంత పొడవైన తీరప్రాంతం రాష్ట్రానికి వరమని పేర్కొన్నారు. ఇప్పటికే ఆరు ఓడరేవుల్లో సముద్ర రవాణా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, మరో నాలుగు ఓడరేవులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నం సహా రాష్ట్రంలోని ఇతర ఓడరేవుల నుంచి నౌకలు ఇప్పటికే 24 రోజులపాటు వ్లాడివాస్టోక్‌కు ప్రయాణిస్తున్నాయని వెల్లడించారు.

అల్యూమినియం ఫాయిల్‌ తయారీ యూనిట్‌..

ఏపీలో ఆటోమోటివ్‌-ఏరోస్పేస్‌-అల్లాయ్‌ ప్లాంట్‌ స్థాపించాలని రష్యాకు చెందిన అల్యూమినియం దిగ్గజ సంస్థ ‘రుసాల్‌’ను లోకేశ్‌ కోరారు. అల్యూమినియం ఫాయిల్‌ తయారీ యూనిట్‌ కూడా నెలకొల్పాలని అభ్యర్థించారు. రష్యా పర్యటనలో ఉన్న లోకేశ్‌ శుక్రవారం సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో రుసాల్‌ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సంస్థ ఇప్పటికే ఏపీలోని పయనీర్‌ అల్యూమినియం ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టింది. ఈ నేపథ్యంలో అతి తక్కువ కార్బన్‌ గ్రీన్‌ అల్యూమినియం స్కిల్లర్‌ అండ్‌ ఎక్స్‌ట్రూషన్‌ యూనిట్‌ను స్థాపించాలని లోకేశ్‌ కోరారు. విశాఖపట్నం-చెన్నై కారిడార్‌లో హైవాల్యూ ఆటోమోటివ్‌ అండ్‌ ఏరోస్పేస్‌ అల్లాయ్‌ ప్లాంట్‌ను స్థాపించాలని విజ్ఞప్తి చేశారు. దక్షణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు సరఫరా చేసేందుకు పర్యావరణ సానుకూల అల్యూమినియం ఫాయిల్‌ తయారీ యూనిట్‌ను నెలకొల్పాలని కోరారు. కాగా, మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనల పట్ల రుసాల్‌ సానుకూలంగా స్పందించింది. వీటిని పరిశీలిస్తామని వెల్లడించింది.

Updated Date - Jun 06 , 2026 | 05:49 AM