కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చేలా సహకరించండి
ABN , Publish Date - Jul 06 , 2026 | 06:15 AM
కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా.. పరిశ్రమలను స్థాపించేలా సహకరించాలని దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్‌దాస్‌ను లోకేశ్ కోరారు.
భారత రాయబారికి లోకేశ్ అభ్యర్థన
ఇంటర్నెట్ విభాగం: కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా.. పరిశ్రమలను స్థాపించేలా సహకరించాలని దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్‌దాస్‌ను లోకేశ్ కోరారు. ఆదివారం సియోల్‌లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ‘శాంసంగ్, ఎల్‌జీ, ఏఎస్ఐపీ-ఏపీఏసీటీ ఓశాట్ ఆధారంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలకా్ట్రనిక్స్ పాలసీ 4.0కు అనుగుణంగా రాష్ట్రానికి కంపెనీలను రప్పించాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, చిప్స్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా సహకరించండి. శ్రీసిటీ, నాయుడు పేట, కొప్పర్తి, విశాఖపట్నంలో ‘రెడీ టు యూజ్’ క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయి. ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్ర యూనివర్సిటీల్లో నైపుణ్యాభివృద్ధితో కూడిన కరిక్యులమ్‌ను అందిస్తున్నాం. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ ఈ ఏడాది ఏప్రిల్లో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కొరియా ఎన్‌క్లేవ్ ఏర్పాటు కోసం చేసిన ప్రతిపాదనకు కార్యరూపం ఇచ్చేందుకు ఆ దేశ చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి చేసిన ప్రతిపాదన మేరకు ప్లగ్ అండ్ ప్లే విధానాన్ని శ్రీసిటీలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని లోకేశ్ వెల్లడించారు. అనంతపురంలో కియ/హ్యూండయ్ మొబిస్ ఆటో-ఈవీ క్లస్టర్ విస్తరణపైనా చర్చ జరిగింది.
రాష్ట్ర తీరప్రాంతంలో హెచ్‌డీ హ్యూండయ్ తరహా గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డును ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. ఏపీలో బ్యాటరీ/గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు స్థాపించేందుకు కొరియాను ఒప్పించాలన్నారు. కొరియా ప్లస్, కొరియా ట్రేడ్-ఇన్వస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (కోట్ర), భారత్-కొరియా పారిశ్రామిక సహకార కమిటీలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఏపీ-కొరియా డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నెల పదో తేదీన నిర్వహిస్తున్న సియోల్ ఇన్వెస్టర్ రోడ్‌షోలో జీ 20 అవగాహన ఒప్పందాల వైపు కంపెనీలను మళ్లించేలా చొరవ చూపాలని గౌరంగ్‌దాస్‌ను కోరారు.