Share News

కొరియాను విస్తరిస్తాం

ABN , Publish Date - Jul 10 , 2026 | 03:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్‌.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

కొరియాను విస్తరిస్తాం

  • ఈవీ, అటానమస్‌ మొబిలిటీపై దృష్టి పెట్టాం

  • ఏపీ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకుంటాం

  • లోకేశ్‌కు కియా ఉన్నత స్థాయి బృందం హామీ

  • దక్షిణ కొరియాలో పారిశ్రామికవేత్తలతో మంత్రి భేటీ

  • పెట్టుబడులకు ఏపీ- కొరియా డెస్క్‌ ఏర్పాటు చేయాలి

  • పారిశ్రామికవేత్తలకు 3ఎస్‌ రక్షణ కవచం

  • నైపుణ్యాభివృద్ధి, సాంస్కృతిక బంధానికి పెద్దపీట

  • కొరియన్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు యువతను

  • సిద్ధం చేస్తాం.. డీప్‌ టెక్‌ ఫోర్స్‌గా తీర్చిదిద్దుతాం

  • దక్షిణ కొరియా మంత్రులతో భేటీలో లోకేశ్‌

అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్‌.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరిస్తున్నారు. అక్కడి మంత్రులతోనూ ఆయన సమావేశం అయ్యారు. ఏపీ, కొరియా మధ్య వ్యాపార సంబంధాలు పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం ఆయన కియా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (గ్లోబల్‌ ఆపరేషన్స్‌) టే హన్‌ లీ, ఇతర ఉన్నత స్థాయి బృందంతో సమావేశమయ్యారు. కియా మోటార్స్‌ ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ప్లాట్‌ఫాం బియాండ్‌ వెహికల్‌ (పీబీవీ) వాహనాలతో సహా ఇంటిగ్రేటెడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ), హైబ్రిడ్‌ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించాలని లోకేశ్‌ కోరారు. అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా ఎగుమతులు చేసేందుకు విశాఖ పోర్టు సమీపంలో ఒక కంప్లీట్లీ నాక్‌డ్‌ డౌన్‌ (సీకేడీ) అసెంబ్లింగ్‌, ఎక్స్‌పోర్టు సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనితోపాటు ఈవీ కాంపోనెంట్స్‌ తయారీ కేంద్రాన్ని, ఈవీ పవర్‌ట్రెయిన్‌ టెస్టింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై టే హన్‌ లీ సానుకూలంగా స్పందించారు. లోకేశ్‌ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.


నాలెడ్జ్‌ హబ్‌గా ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని ఆ దేశ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఉప మంత్రి కామ్చన్‌వాంగ్‌ను మంత్రి లోకేశ్‌ కోరారు. ఏపీ యువతను డీప్‌ టెక్‌ వర్క్‌ ఫోర్స్‌గా తయారు చేయడానికి కొరియా వర్సిటీలు సహకారం అందించాలని కోరారు. 2029 నాటికి రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పించే తమ లక్ష్యానికి సహకరించేలా ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, పాదరక్షల తయారీ, నౌకా నిర్మాణం వంటి రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందించాలని విన్నవించారు. స్టూడెంట్‌/ఫ్యాకల్టీ ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రామ్‌లు, కరిక్యులమ్‌ డెవల్‌పమెంట్‌ కోసం ఏపీ- కొరియా వర్సిటీలను అనుసంధించాలన్నారు. ఎలకా్ట్రనిక్స్‌, సెమీకండక్టర్లు, నౌకా నిర్మాణ వ్యవస్థలు, ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, ఫైబర్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్లీన్‌-టెక్‌, హెల్తీ-టెక్‌ రంగాల్లో సాంకేతికతను బదలాయించుకునేందుకు ముందుకు రావాలన్నారు. దక్షిణ కొరియా పరిశోధనా సంస్థలు, ఆవిష్కరణ కేంద్రాలు, మాగోగ్‌ సైన్స్‌ పార్కు, నానో ఫ్యాబ్‌ సెంటర్‌ వంటివి రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. అలాగే, రాష్ట్రంలో కొరియా కంపెనీల కోసం ప్రత్యేకంగా కొరియా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలన్నారు. దీని కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో డేటా సెంటర్‌ ప్రాజెక్టుల అవసరానికి విద్యుత్తు మౌలిక సదుపాయాలను సిద్ధం చేసేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో మరో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులు, కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయని, వీటిలో హెచ్‌డీకేఎస్ఓఈ శాంసంగ్‌ షిప్పింగ్‌, హన్వా ఓషన్‌ వంటి కొరియన్‌ సంస్థలకు అవకాశాలు కల్పిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్ విధానాల కారణంగా రెండేళ్లలో 240 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించగలిగామని కామ్చన్‌వాంగ్‌కు లోకేశ్‌ వివరించారు.


రాష్ట్రంలో డిస్‌ప్లే పరికరాల యూనిట్‌

సెమీ కండక్టర్లు, ఓఎల్‌ఈడీ, పెరోవ్‌స్కైట్‌ డిపోజిషన్‌ పరికరాల తయారీలో ప్రఖ్యాత సంస్థ సునిక్‌ సిస్టమ్‌ రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సంస్థ సీఈవో ఎస్‌.డబ్ల్యు చుంగ్‌తో లోకేశ్‌ భేటీ అయ్యారు. శ్రీసిటీలో సునిక్‌ సిస్టమ్స్‌ డిస్‌ప్లే పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేశ్‌ కోరారు. జాయింట్‌ వెంచర్‌కు సహకారం అందిస్తామని, ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0తో పాటు ఏపీ సెమీకండక్టర్‌, డిస్‌ప్లే ఫ్యాబ్‌ పాలసీ కింద ప్రోత్సాహకాలు అందిస్తామని వివరించారు. సెమికాన్‌ టెక్‌పై నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడానికి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, యూనివర్సిటీలతో కలసి పని చేయాలని ఆహ్వానించారు. ప్రస్తుతం ఏపీలో తమకు ఎలాంటి ఉత్పాదక కార్యక్రమాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సునిక్‌ సిస్టమ్స్‌ సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జెహెచ్‌లీ, సేల్స్‌ జీఎం హెచ్‌వై చో తదితరులు పాల్గొన్నారు.

ఏరో ఇండస్ట్రియల్‌ సిటీ బ్రోచర్‌ విడుదల

కాకినాడు పోర్టులో ఏర్పాటు చేయనున్న ఏరో ఇండస్ట్రియల్‌ సిటీ బ్రోచర్‌ను దక్షిణ కొరియాలో లోకేశ్‌ ఆవిష్కరించారు. దక్షిణ కొరియాలో భారత రాయభారి గౌరంగాలాల్‌ దాస్‌తో కలసి ఏరో ఇండస్ట్రియల్‌ సిటీ ఎండీ, సీఈవో రామ్‌రెడ్డి ఓజిలి ఆదేశ పర్యటనలో ఉన్న లోకేశ్‌ను కలిశారు.


ఏపీలో కొరియన్‌ కల్చరల్‌ సెంటర్‌

దక్షిణ కొరియా పొలిటికల్‌ అఫైర్స్‌, విదేశాంగ మంత్రి యూయ్‌ హే సిసిలియా చుంగ్‌తో లోకేశ్‌ భేటీ అయ్యారు. వీరి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను లోకేశ్‌ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పన్ను తదితర రాయితీలు, తక్కువ ధరకే భూములు పరిశ్రమలకు దన్నుగా నిలుస్తాయని లోకేశ్‌ వెల్లడించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పీడ్‌, స్టెబిలిటీ, సర్వీ్‌స(3ఎస్‌) కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తుందని చెప్పారు. ఫ్యాక్టరీల ప్రారంభానికి ముందే కొరియా పని విలువలు, భాష, సంస్కృతిపై స్థానిక యువతను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొరియన్‌ కల్చరల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖపట్నం-బుసాన్‌/ఇంచియాన్‌ మధ్య సంబంధాలను మెరుగుపరచాలని, ఏపీలోని వర్సిటీల్లో కొరియన్‌ లాంగ్వేజీ సెంటర్లు, డైరెక్ట్‌ ఎయిర్‌ కనెక్టివిటీకి చొరవ చూపాలన్నారు. లోకేశ్‌ ప్రతిపాదనలపై హే చుంగ్‌ సానుకూలంగా స్పందించారు. ఏపీలో కొరియన్‌ కల్చరల్‌ సెంటర్‌ ఏర్పాటును పరిశీలిస్తామని చెప్పారు.

Updated Date - Jul 10 , 2026 | 03:51 AM