Share News

రెండేళ్ల కష్టం ఫలించింది

ABN , Publish Date - Jul 25 , 2026 | 04:38 AM

‘‘చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్‌ బోర్డులు చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ర్యాంకులు సాధించిన విద్యార్థులతో తొలిసారి యాడ్స్‌ ఇచ్చాం.

రెండేళ్ల కష్టం ఫలించింది

  • తొలిసారి ప్రభుత్వ స్కూళ్ల ర్యాంకర్లతో యాడ్స్‌

  • ఇది ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రుల విజయం

  • ప్రభుత్వ స్కూళ్లలో నో అడ్మిషన్‌ బోర్డులు ఇప్పుడే చూస్తున్నాం

  • ఏడాదిలోగా ఏజెన్సీలోని పాఠశాలలకు సొంత భవనాలు

  • మెగా పీటీఎంలో మంత్రి లోకేశ్‌

రాజమహేంద్రవరం, జూలై 24(ఆంధ్రజ్యోతి): ‘‘చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్‌ బోర్డులు చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ర్యాంకులు సాధించిన విద్యార్థులతో తొలిసారి యాడ్స్‌ ఇచ్చాం. సీఎం ఫొటో గానీ, నా ఫొటో గానీ లేదు. ఇది నా విజయం కాదు. ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రుల విజయం. మన రెండేళ్ల కష్టం ఫలించింది’’ అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ విద్యార్థుల మార్కులే తన ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌ అని, విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధిస్తేనే తనకు సీఎం మంచి మార్కులు వేస్తారని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఏడాదిలోపు సొంత భవనాలను నిర్మిస్తామని చెప్పారు. ఈ ఏడాది సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చి ప్రభుత్వ బడుల్లో చేరారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులే బ్రాండ్‌ అంబాసిడర్లు అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తెస్తానని సీఎంకు ఇచ్చిన హామీ నిలబెట్టుకొనే ప్రయాణంలో మొదటి అడుగు పడిందన్నారు.


చదువుకు దూరం కాకూడదనే..

మహిళలను గౌరవించడం ఇంటి నుంచే మొదలవ్వాలని, మహిళల జోలికొస్తే లోకేశ్‌ అన్న తోలు తీస్తాడని వార్నింగ్‌ ఇవ్వాలని చెప్పారు. ఏ బిడ్డా చదువుకు దూరం కాకూడదనే తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పారు. పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా, మంచి విద్య అందించాలని చెప్పారు. ప్రసంగం ప్రారంభంలో తల్లుల పాదాలకు నమస్కరించాలని విద్యార్థులను కోరిన లోకేశ్‌.. తన తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. కాగా, మెగా పీటీఎంలో పాల్గొనేందుకు వచ్చిన లోకేశ్‌.. శుక్రవారం ఉదయం ఐ.పోలవరం పంచాయతీలోని జాగరంపల్లి వేదిక వద్ద ప్రజాదర్బార్‌ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ఉద్యోగుల నుంచి వినతులను స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, తల్లికి వందనం పథకంతో తమ పిల్లల విద్యా ఖర్చుల భారం గణనీయంగా తగ్గిందని గిరిజన మహిళలు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి చెప్పారు. రంపచోడవరంలో వారికిఆదివాసీ మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.

గోదావరిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలతో భేటీ

ఇటీవల గోదావరిలో చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన గిరిజనుల కుటుంబ సభ్యులతో జాగరంపల్లిలో లోకేశ్‌ భేటీ అయ్యారు. వారితో కలిసి అల్పాహారం చేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వంతోపాటు టీడీపీ కూడా వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ కుటుంబాల పిల్లల భవిషత్తుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 04:40 AM