Share News

మీ అంత ప్రావీణ్యం లేదు గురూజీ!

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:04 AM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘యోగాంధ్ర- 2026’ సామూహిక ఆరోగ్య, యోగా ఉద్యమం చరిత్ర సృష్టించింది.

మీ అంత ప్రావీణ్యం లేదు గురూజీ!

అమరావతి/న్యూఢిల్లీ, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘యోగాంధ్ర- 2026’ సామూహిక ఆరోగ్య, యోగా ఉద్యమం చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. లండన్‌కు చెందిన ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాయించుకుంది. ఈ రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను లండన్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ దక్షిణ ప్రాంత సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ ఉల్లాజి ఎలియాజర్‌ సీఎం చంద్రబాబుకు అందజేశారు. కాగా, చంద్రబాబు దీనిని ఆయూష్‌ శాఖకు ఇచ్చి అభినందించారని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. యోగాంధ్ర-2026 ద్వారా రాష్ట్రంలో 1.05 కోట్ల మంది యోగా ఔత్సాహికులను భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆ లక్ష్యాన్ని అధిగమించి, ఏకంగా 1.07 కోట్ల మంది రిజిస్ర్టేషన్లు చేసుకున్నట్టు తెలిపారు. యోగాను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు 7,745 మంది యోగా మాస్టర్‌ ట్రైనర్లు, 2.61 లక్షల మంది సాధారణ యోగా శిక్షకులు, 511 మంది యోగా గురువులు తమ సేవలు అందించారని ఆయూష్‌ శాఖ డైరెక్టర్‌ రోణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు. పర్యాటక రంగంలో 26 థీమాటిక్‌ యోగా ప్రదర్శనల ద్వారా 35,603 మంది, 55 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించిన యోగా ప్రదర్శనల్లో 59,458 మంది భాగస్వాములయ్యారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు బహుళ అంచెల్లో యోగా పోటీలను నిర్వహించామన్నారు. రాష్ట్ర స్థాయి తుది పోటీల్లో 372 మంది ప్రతిభావంతులు పోటీ పడగా, 66 మంది విజేతలుగా నిలిచారని గోపాలకృష్ణ వివరించారు.


యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు రాందేవ్‌, మంత్రి నారా లోకేశ్‌ మధ్య సంభాషణ నవ్వులు పూయించింది. బాబాతో కలిసి మంత్రి లోకేశ్‌ దండీలు తీశారు. అనంతరం బాబా కఠినమైన ఆసనాలు వేస్తూ వాటిని ప్రయత్నించాలని మంత్రికి సూచించగా, దీనికి మంత్రి లోకేశ్‌.. ‘‘యోగాలో మీకున్నంత ప్రావీణ్యం మాకు లేదు. రానున్న రోజుల్లో కచ్చితంగా యోగాను సాధనచేసి కఠినమైన ఆసనాలను వేస్తా గురూజీ!.’’ అని చెప్పడంతో స్టేజీపై సీఎం చంద్రబాబు, అక్కడున్న మంత్రులు, ప్రజాప్రతినిధుల మోముల్లో నవ్వులు విరిశాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహనాయుడు, శ్రీనివాసవర్మ, యోగా-నేచురోపతి రాష్ట్ర సలహాదారు మంతెన సత్యనారాయణరాజు, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్‌, సవిత, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 05:06 AM