Share News

కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తేస్తాం

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:20 AM

రాష్ట్రంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు 45 రోజులపాటు టీడీపీ శ్రేణులన్నీ జనంలోకి వెళ్లాలని పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి లోకేశ్‌ ఆదేశించారు.

కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తేస్తాం

  • 25 నుంచి ఇంటింటికీ టీడీపీ

  • 45 రోజులపాటు నేతలు జనంలోనే

  • కూటమి విజయాలపై భారీ ప్రచారం

  • వారానికి కనీసం 4 రోజులు ప్రజల మధ్యే

  • సైకిల్‌పై వెళ్తే ఎక్కువ మందిని కలవచ్చు

  • ‘సర్‌’ ప్రక్రియలో ప్రతి ఓటూ కీలకమే

  • ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలి

  • పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో లోకేశ్‌

అమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు 45 రోజులపాటు టీడీపీ శ్రేణులన్నీ జనంలోకి వెళ్లాలని పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. పార్టీ కార్య కర్తలపై వైసీపీ హయాంలో నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్దేశించిన విధంగా రెండేళ్ల కూట మి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటి తలుపు తట్టాలని ఆదేశించారు. వారానికి కనీసం 4 రోజులు జనంలో తిరగాల్సిందేనని స్పష్టం చేశారు. వీలైతే సైకిల్‌పై వెళ్లేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగైతే ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఓ కరపత్రాన్ని తయారు చేసుకోవాలని, దానిలో కూటమి పార్టీ రెండేళ్ల విజయాలను వివరిస్తూనే నియోజకవర్గ, గ్రామస్థాయిలో ఏ సంక్షేమ పథకం ద్వారా ఏయే వర్గాలకు ఎంత లబ్ధి చేకూరిందనే విషయాలను పేర్కొనాలని సూచించారు. 45 రోజులపాటు ఎప్పటికప్పుడు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఏ రోజు ఎవరు జనంలోకి వెళ్లారనే వివరాలు సేకరిస్తుంటామని చెప్పారు.


జనసేన, బీజేపీ కేడర్‌తో..

కూటమి విజయాలను వివరిచేందుకు జనంలోకి వెళ్లే సమయంలో జనసేన, బీజేపీ కేడర్‌ను కూడా కలుపుకొనిపోవాలని మంత్రి లోకేశ్‌ సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో లోకేశ్‌ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందని, దాంతోపాటే సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని తెలిపారు. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే మన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోతుందన్నారు. 2014-19 నడుమ చేసిన మంచిని చెప్పుకోలేకపోయామని, ప్రత్యర్థుల విషప్రచారాన్ని అడ్డుకోలేక ఓడిపోయామని అన్నారు. ఈ నెల 20నుంచి సీఎంతోపాటు ప్రతిఒక్కరూ జనంలోకి వెళ్తామన్నారు. నియోజకవర్గ స్థాయిలో విజయోత్సవ సభలు నిర్వహించి కూటమి విజయాలపై ప్రజలను జాగృతం చేయాలన్నారు.

ఒక్క ఓటు కూడా వదలొద్దు

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌)పై ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని లోకేశ్‌ సూచించారు. ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత నాయకులదేనని స్పష్టం చేశారు. కాగా, వీడియోకాన్ఫరెన్సులో పలువురు ఎమ్మెల్యేలు.. జనంలోకి వెళితే కొత్త పించన్లు అడుగుతున్నారని, గ్రామాల్లో చిన్న చిన్న పనుల కోసం తమకు కొంత నిధులు ఇవ్వాలని కోరారు. దీనిపై లోకేశ్‌ స్పందిస్తూ.. ఈ సమస్య తనకు కూడా ఉందని, ఈ విషయాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

ఆ కేసులు ఎత్తేస్తాం

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ కార్యకర్తలతో లోకేశ్‌ విడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పలువురు కార్యకర్తలు, నేతలు నియోజకవర్గ సమస్యలను లోకేశ్‌ దృష్టికి తెచ్చారు.

Updated Date - Jun 17 , 2026 | 04:22 AM