Share News

ప్రతీకార రాజకీయాలు చేస్తే జగన్‌ బయట ఉండేవారా?

ABN , Publish Date - Jun 23 , 2026 | 04:00 AM

‘‘టీడీపీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలు చేయదు. మేం నిజంగా ప్రతీకార రాజకీయాలు చేయాలనుకుంటే వైసీపీ నేత జగన్‌ ఈ రోజు బయట ఉండేవారా?’’ అని ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ప్రశ్నించారు.

ప్రతీకార రాజకీయాలు చేస్తే జగన్‌ బయట ఉండేవారా?

  • నాడు నాపై 23 కేసులు పెట్టారు

  • కానీ, అది మా విధానం కాదు

  • మేమెక్కడా జగన్‌ను అడ్డుకోవడం లేదు

  • చట్టాన్ని ఉల్లంఘించినవారిని వదిలిపెట్టం

  • స్పీడ్‌.. స్టెబిలిటీ.. సర్వీస్ .. 3 ఎస్‌లే మా బలం

  • భారీ పెట్టుబడుల వెనుక రహస్యమిదే

  • ఐటీ, ఏఐ, క్వాంటం..అంతా చంద్రబాబే

  • నా పని ఎగ్జిక్యూట్‌ చేయడం మాత్రమే

  • 2028నాటికి రాజధాని భవనాలు పూర్తి

  • ఏపీకి రాజధానిని ఆర్థిక శక్తిగా మలుస్తాం

  • మాది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావంతో పనిచేస్తాం

  • 20 లక్షల ఉద్యోగాల సృష్టి నా బాధ్యత

  • ఆంగ్ల చానెళ్ల ఇంటర్వ్యూల్లో మంత్రి లోకేశ్‌

న్యూఢిల్లీ/అమరావతి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ‘‘టీడీపీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలు చేయదు. మేం నిజంగా ప్రతీకార రాజకీయాలు చేయాలనుకుంటే వైసీపీ నేత జగన్‌ ఈ రోజు బయట ఉండేవారా?’’ అని ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాంటివారినీ శిక్షించకపోతే, ఇక అరాచకాలకు అంతం ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. అలాంటి వారి కోసమే రెడ్‌ బుక్‌ ఉందని, రాజ్యాంగ పరిరక్షణే దాని లక్ష్యమని తెలిపారు. ‘‘జగన్‌ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును కొన్ని రోజులపాటు ఇంటి నుంచి కూడా బయటకు రానివ్వలేదు. ఇంటి గేటుకు తాళ్లు కట్టారు. హత్యాయత్నం సహా 23 అక్రమ కేసులు నాపై పెట్టారు. కానీ ఈ రోజు జగన్‌ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతున్నారు. మేం ఆయనను అడ్డుకోవడం లేదు. ప్రతీకార రాజకీయాలు మా విధానం కాదు.’’ అని స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలో రెండు ఆంగ్ల చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. తమ బాస్‌ చంద్రబాబుకు ఎప్పుడూ పనులు వేగంగా జరిగిపోవాలని, ఆయన వేగాన్ని అందుకోవడం చాలా కష్టమన్నారు. ‘‘రాజకీయం అనేది ఓ ప్రయాణం మాత్రమే, గమ్యం కాదు. నేను ఇప్పుడే ఏదో సాధించానని చెప్పడం కరెక్ట్‌ కాదు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే నాకింకా 40 నుంచి 50 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు ఉంది.’’ అని పేర్కొన్నారు. గడచిన పదేళ్ల రాజకీయ ప్రస్థానం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ‘‘ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. విజయాలు వచ్చినప్పుడు ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నానో... పరాజయాలను కూడా అంతే సమానంగా తీసుకున్నాను. ప్రస్తుతం దేశానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాను. ఈ సమయంలో యువ నాయకులు ముందుకొచ్చి, బాధ్యతలు భుజానికెత్తుకుని తమ సామర్థ్యాన్ని చూపించాలి. నా రాజకీయ ప్రయాణంలో నేను చేయాలనుకుంటున్నది అదే.’’ అని లోకేశ్‌ వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


ఉద్యోగాల సృష్టే నా లక్ష్యం..

‘‘2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే స్పష్టమైన విజన్‌ మా సీఎంది. ప్రస్తుతం నేను రెండు ముఖ్యమైన శాఖలు చూస్తున్నాను. ఒకటి భారత్‌ పోర్ట్‌ఫోలియో(విద్య), రెండోది ఇండియా పోర్టుఫోలియో (పెట్టుబడులు ఆకర్షించడం, ఉద్యోగాల సృష్టి) ఏపీని మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా నిలబెట్టడం లక్ష్యంగా ఈ శాఖలను నిర్వహిస్తున్నాను. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి నేనే చైర్మన్‌ను. కాబట్టి ఇప్పుడు నా ఏకైక లక్ష్యం ఉద్యోగాల సృష్టే.’’


నేషన్‌ ఫస్ట్‌ మా విధానం

‘‘ఒక నాయకుడితో 15-20 ఏళ్లు కలిసి ప్రయాణించాక, మనమంతా ఆయనకు కార్బన్‌ కాపీలా మారిపోతాం. ఆ పని సంస్కృతి మనకూ వస్తుంది. చంద్రబాబు, మోదీతో చేసిన ప్రయాణమే దీనికి ఉదాహరణ. మేం ప్రాంతీయ పార్టీ అయినా, ఎప్పుడూ దేశం గురించే ఆలోచించాం. మా విధానాల వల్ల దేశానికి లాభం చేకూరింది. ఎన్డీయేకు బేషరతుగా మా మద్దతు కొనసాగుతుంది. దేశానికి స్థిరమైన నాయకత్వం అవసరమని మా నాయకుడు భావిస్తారు. 2024లో కేంద్ర ప్రభుత్వంలో చేరినప్పుడు మేం ఎలాంటి షరతులు పెట్టలేదు. మరి మాకంటూ విధానాలు ఉండవా అంటే.. ఉంటాయి. వాటిని అంతర్గత చర్చల రూపంలో వ్యక్తం చేస్తాం. వక్ఫ్‌ బిల్లు విషయంలో మా సూచనలను చేర్చిన తర్వాతే అది ఓటింగ్‌కు వచ్చింది. డీలిమిటేషన్‌ విషయంలోనూ నా నాయకుడు నివేదిక పంపారు. అందులోని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని దానిపై మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందువల్ల విధానాలు మాకు ఖచ్చితంగా ఉంటాయి. తెలుగు ప్రజల ప్రయోజనాలు కాపాడటంలో మేం రాజీ పడబోం. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న సంస్థలు చాలా పెద్దవి. వాటిని ఆకర్షించాలంటే అన్ని ప్రభుత్వ శాఖలూ సమన్వయంతో కదలాలి. ఇప్పుడు నేను చేస్తోంది ఇదే. వాళ్ల ప్రాజెక్టు స్టేట్‌సను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తాను. ఎందుకంటే వాళ్లు పెట్టుబడులు పెడితేనే మా దగ్గర ఉద్యోగాలు వస్తాయి, స్థానికంగా ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ఈ సూత్రాన్ని అనుసరించడం వల్లే దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకికే వస్తున్నాయి.


అందుకే అమరావతికి అధిక నిధులు..

‘‘ఎక్కువ మంది ఎంపీలు ఉంటే మన మాట గట్టిగా వినిపించడానికి కచ్చితంగా ఉపయోగ పడుతుంది. ప్రధానితో డిన్నర్‌ చేసే అవకాశం దొరుకుతుంది. కానీ నిధులు రావు. ప్రధానితో డిన్నర్‌ సమయంలో ఆయన తన విజన్‌ పంచుకున్నారు. కేంద్రం అద్భుతమైన పాలసీలు తీసుకొస్తోంది. ప్రధాని దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ వాటిని ఆచరణలో పెట్టాల్సింది రాష్ట్రాలే. ఆ విషయంలో ఏపీ మిగిలిన రాష్ట్రాల కంటే చాలా వేగంగా ముందుకు వెళుతోంది. ఇతర రాష్ట్రాలు సైలెంట్‌గా ఉన్నప్పుడు, నేను రక్షణ మంత్రి దగ్గరికి వెళ్లి ‘మాకు ప్రాజెక్టు ఇవ్వండి.. మా దగ్గర భూమి రెడీగా ఉంది’ అని అడిగితే ఆయన ఎందుకు కాదంటారు? 37 రోజుల్లో 600 ఎకరాల భూమి ఇచ్చాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అదే మా స్పీడ్‌. ప్రధాని కూడా ఇలా స్పీడ్‌గా పనిచేసే రాష్ట్రాల వైపే చూస్తున్నారు. రాష్ట్రాలు పోటీ పడితేనే దేశం గెలుస్తుందని నా నమ్మకం.’’


ఏపీకి ఆర్థిక శక్తిగా అమరావతి

‘‘అమరావతిలో రాజధానిని మొదలుపెట్టడానికి తొలుత కేంద్రం రూ.12 నుంచి 13వేల కోట్ల స్టార్టప్‌ క్యాపిటల్‌ ఇచ్చింది. కానీ అది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడు మేమే సొంతంగా నిధులు సమకూర్చుకుంటున్నాం. ఇదొక సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు. దేశం గర్వపడేలా ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తున్నాం. ఇకపై మనం విదేశాల్లోని నగరాల గురించి కాదు, ఇండియాలోని అమరావతి గురించే మాట్లాడుకుంటాం. అదే మమ్మల్ని మిగతా రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. 2028 నాటికి అమరావతిలోని అసెంబ్లీ, సెక్రటేరియట్‌, హైకోర్టు లాంటి ప్రభుత్వ భవనాలన్నీ సిద్ధం చేస్తాం. ఇక రాజధాని కోసం రూ.60 వేల కోట్లు సేకరించబోతున్నాం. ఏపీకి ఒక ఆర్థిక శక్తిగా అమరావతి మారాలన్నదే మా లక్ష్యం..’’

యువ తరమే మా బలం

‘‘రాజకీయ పార్టీలు మార్పులకు గురి కావడం సహజం. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. వాళ్లు 40 ఏళ్ల పాటు పార్టీని నడిపించారు. ఇప్పుడు కొత్త తరం నాయకత్వం రావాలని వాళ్లే చాలాసార్లు చెప్పారు. మేం ఆ మార్పే చేశాం. గత ఎన్నికల్లో గెలిచిన మా పార్టీ ఎమ్మెల్యేల్లో 50 శాతం మంది, మంత్రుల్లో 17 మంది ఫస్ట్‌ టైమర్లే. దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన పార్లమెంటరీ బృందం మాదే. రామ్మోహన్‌ నాయుడు చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన కేంద్ర మంత్రి. యువత ఆకాంక్షలు రాజకీయాల్లో ప్రతిబింబించాలంటే ఈ మార్పు చాలా అవసరం.’’


డేటా లేకుంటే చీకట్లో ఉన్నట్టే...

‘‘2024లో మేం అధికారంలోకి వచ్చేనాటికి ఏపీలో అక్షరాస్యత రేటుచాలా దారుణంగా ఉంది. డ్రాపౌట్స్‌ను నాడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఒక డేటాను నేను ఎలా చూస్తానో.. క్షేత్రస్థాయిలోని హెడ్‌ మాస్టర్‌ కూడా అలాగే చూస్తారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఏడాదే దాదాపు 85 వేల మంది ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ బడుల కు వచ్చారు. ఈ డేటా ఉంటేనే నేను సరైన నిర్ణయాలు తీసుకోగలను. లేకుంటే చీకట్లో అడుగులు వేసినట్టే. డేటా ప్రొక్యూరింగ్‌, డేటా మానిటరింగ్‌ ప్రైవేట్‌ సెక్టార్‌లోనే చేయగలిగినప్పుడు, ప్రభుత్వం ఎందుకు చేయలేదు? నా దగ్గర వ్యవసాయం, వాటర్‌ మేనేజ్‌మెంట్‌...ఇలా అన్ని శాఖల డేటా ఉంది. దీన్ని బట్టే పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాం.’’


రాజకీయాల్లోకి రావడంపై...

‘‘2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత ఓ పెళ్లికి ఆయనతో కలిసి వెళ్లాను. అక్కడ ఉన్న ఐదు వేల మంది చంద్రబాబు రాగానే లేచి నిలబడి ఆయనకు ఆహ్వానం పలికారు. మనం రాజకీయాల్లో ఎంత మంచి చేస్తే, అంత గౌరవం లభిస్తుందని... ఆ నిమిషమే నాకు అర్థమైంది.’’ అని లోకేశ్‌ వివరించారు.

చంద్రబాబు ఐటీని ప్రమోట్‌ చేశారు మీరిప్పుడు ఏఐని ప్రోత్సహిస్తున్నారా?

లోకేశ్‌ : మా సీఎం మా కోసం ఏ క్రెడిట్‌ కూడా వదిలిపెట్టరు. ఐటీ ఆయనే, ఏఐ ఆయనే, క్వాంటం ఆయనే. ఆయన చూపించిన దారిలో పనులన్నీ ఎగ్జిక్యూట్‌ చేయడమే నా విధి. ఇప్పుడు చంద్రబాబు 4.0 పాలన నడుస్తోంది. సరదాగా మా యువ బృందంతో అంటుంటాను.. ‘నాయుడుగారు ఎప్పుడూ 1995 నాటి తన టీం గురించి గొప్పగా చెబుతుంటారు. రేప్పొద్దున ఆయన ‘2024టీం ఇంకా అద్భుతం’ అని మనగురించి చెప్పేలా మనం కష్టపడి పనిచేయాలి’ అని.

డేటా సెంటర్లకు విద్యుత్తు.. నీళ్లు ఎలా?

లోకేశ్‌: డేటా సెంటర్లకు నీళ్లు కావాలి నిజమే. కానీ యేటా గోదావరి నుంచి మూడు వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. ఈ నీళ్లు బ్రెజిల్‌ లేదా వియత్నాం దేశమంతా ఏడాదిపాటు వాడే నీటితో సమానం. డేటా సెంటర్లకు అడుగుతున్నది కేవలం 1.5 టీఎంసీలే. పోలవరం పూర్తయ్యాక ఈ నీటిని వాడుకుంటాం.


లోకేశ్‌లో చంద్రబాబును చూస్తున్నా

  • అర్నాబ్‌ వ్యాఖ్య

మంత్రి లోకేశ్‌ను చూస్తుంటే ఒక రిపోర్టర్‌ గా తాను చంద్రబాబును కలిసిన రోజులు గుర్తుకు వస్తున్నాయని రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామి వ్యాఖ్యానించారు. ‘‘లోకేశ్‌ కొత్త తరం పాలనకు ప్రతిరూపంగా నిలిచారు. ఆయనలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. భవిష్యత్తులో లోకేశ్‌ ఎన్నో విజయాలు సాధించగలరని నమ్ముతున్నా.’’ అని గోస్వామి అన్నారు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ టీవీ కాంక్లేవ్‌లో లోకేశ్‌ పాల్గొన్నారు. అర్నాబ్‌ గోస్వామి అడిగిన అనేక కీలక ప్రశ్నలకు ఆయన సూటిగా, స్పష్టంగా జవాబిచ్చారు. ఏ స్కూళ్లో, ఏ సబ్జెక్టులో ఎవరు వీక్‌ గా ఉన్నారనేది అమరావతిలో కూర్చున్నా తెలిసిపోయేలా డేటాను అభివృద్ధి చేశామని లోకేశ్‌ వివరించారు.

ఇవీ మూడు ఎస్‌లు..

స్పీడ్‌ : దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడితో గూగుల్‌ డేటా సెంటర్‌ కేవలం 13 నెలల్లోనే పనులు ప్రారంభించింది. మిత ్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌ 17 నెలల్లో, స్వదేశీ ఫైటర్‌ జెట్స్‌ తయారీ ప్రాజెక్టు ‘ఏఎంసీఏ’ 37 రోజుల్లో పనులు ప్రారంభించాయి.

స్టెబిలిటీ: మా నేతకు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఆయన విధానాలు ఎప్పటికీ ఏపీని ప్రత్యేకంగా నిలబెడతాయి. మేం వాటినే అమలు చేస్తున్నాం.

సర్వీస్‌ : వ్యాపారవేత్తలు నా దృష్టిలో దేశ నిర్మాతలు. వాళ్లు ఉద్యోగాలు ఇస్తారు, దేశాన్నీ నిర్మిస్తారు. ఒక నేతగా రాష్ట్రానికి సేవలు అందించి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా లక్ష్యం.

Updated Date - Jun 23 , 2026 | 04:03 AM