యువత సవాళ్లను స్వీకరించాలి
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:19 AM
యువత సవాళ్లను స్వీకరించాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు మారిపోయే ట్రెండ్‌ను అనుసరించకుండా లక్ష్యంపై...
ట్రెండ్‌ను అనుసరించొద్దు... లక్ష్యంపై దృష్టి పెట్టాలి
షార్ట్‌కట్‌ల ప్రపంచంలో నైతికతే గొప్ప బలం: లోకేశ్
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): యువత సవాళ్లను స్వీకరించాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు మారిపోయే ట్రెండ్‌ను అనుసరించకుండా లక్ష్యంపై దృష్టిపెట్టాలని కోరారు. బెంగళూరు సర్జాపూర్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్‌ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీ డిప్లొమా ప్రోగ్రామ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఈ రోజును కేవలం గ్రాడ్యుయేషన్ డేగానే చూడకూడదని విద్యార్థులు భవిష్యత్తు నాయకులుగా మారే ప్రత్యేక క్షణంగా చూడాలని కోరారు. తర్వాత ఏమిటి?(వాట్ నెక్ట్స్), ఎందుకు కాదు?(వై నాట్) అని ప్రశ్నించే తరమే నేటి ప్రపంచానికి అవసరమని తెలిపారు. విశాఖ అభివృద్ధిలోనూ సత్వా గ్రూప్ భాగస్వామ్యం కాబోతోందని చెప్పారు. షార్ట్‌కట్‌ల ప్రపంచంలో నైతికతే అన్నింటి కన్నా గొప్ప బలమని పేర్కొన్నారు. ‘యువగళం’ తనలో ఎన్నో మార్పులకు కారణమైందన్నారు. అప్పటి వరకు పాలనను వ్యవస్థ దృష్టితో చూసిన తనకు ఆ పాదయాత్ర తర్వాత ప్రజల దృష్టితో చూడటం అలవాటైందని లోకేశ్ వివరించారు. సత్వా గ్రూప్ ఎండీ, గ్రీన్ ఉడ్‌హై ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ బిజయ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
13న రాష్ట్రపతితో లోకేశ్ భేటీ
అమరావతికి చట్టబద్ధతపై కృతజ్ఞతలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్తున్నారు. సోమవారం కూటమి ఎంపీలతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలపనున్నారు. అలాగే అమరావతి ప్రాశస్త్యం, వైసీపీ హయాంలో రాజధాని రైతులు, మహిళలపై జరిగిన దాష్టీకాలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనుల్లో పురోగతి తదితర అంశాలతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను రాష్ట్రపతికి లోకేశ్ అందజేస్తారు.
యనమలను ఫోనులో పరామర్శించిన లోకేశ్
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని మంత్రి లోకేశ్ ఫోనులో పరామర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ ఆస్పతిలో యనమలకు వైద్యులు గుండె ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. ఈ విషయం తెలుసుకున్న లోకేశ్ శుక్రవారం ఆయనకు ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యనమల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.