Share News

ఏపీని ఎంచుకోండి

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:28 AM

రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్‌ దిగ్గజ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు.

ఏపీని ఎంచుకోండి

  • దక్షిణ కొరియా పర్యటనలో పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్‌ హామీ

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్‌ దిగ్గజ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు. మూడో రోజు మంగళవారం శాంసంగ్‌, ఎల్జీ, హ్యుందాయ్‌ మోబిస్‌ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులను కలిశారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించి పెట్టుబడులతో రావాలని ఆహ్వానించారు. పెట్టుబడులకు ఏపీని ఎంచుకోవాలని, ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. సియోల్‌ నగరంలో ప్రధాన పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల కేంద్రమైన మాగోక్‌ సైన్స్‌ పార్కును లోకేశ్‌ సందర్శించారు. శాంసంగ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ఆపాక్‌ ఎంఎక్స్‌, బిజినెస్‌ హెడ్‌ హెలెనా పార్క్‌లను మంత్రి లోకేశ్‌ కలిశారు. రాష్ట్రంలో డిస్‌ప్లే ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయాలని వారిని కోరారు. ఏపీలోని డేటా సెంటర్‌ పైప్‌లైన్‌ను కేంద్రంగా చేసుకుని డేటా సెంటర్లు, సర్వర్‌ తయారీ, సర్వీసింగ్‌తో కూడిన ఫుల్‌ ఏఐ కంప్యూటర్‌ స్టాక్‌ కోసం ఏపీని దేశానికి కేంద్రంగా మార్చుకోవాలని కోరారు. రాష్ట్రంలో కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌ కోసం ఒక ఓఎస్ఏటీ కేంద్రాన్ని, మొబైల్‌ డివైజ్‌ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 133 క్యూబిట్‌ క్వాంటమ్‌ సిస్టమ్‌ను అమరావతికి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై శాంసంగ్‌ సానుకూలంగా స్పందించింది.


ఈవీ సెమీ కండక్టర్స్‌ హబ్‌గా ఏపీ

రాష్ట్రంలో ఈవీ సెమీ కండక్టర్స్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలని హ్యూందాయ్‌ మోబిస్‌ ఉన్నతస్థాయి బృందాన్ని మంత్రి అభ్యర్థించారు. హ్యూందాయ్‌ మోబిస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యంగ్‌ బిన్‌ కిమ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ హాన్సోక్‌ పార్క్‌, జంగ్‌హో సియో బృందంతో సమావేశమయ్యారు. తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్‌ అండ్‌ బ్యాటరీ సిస్టమ్స్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖలో పరిశోధన అభివృద్ధి, ఇంజనీరింగ్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కాగా, ఎల్జీ ఎలకా్ట్రనిక్స్‌ గ్లోబల్‌ సీఈవో ల్యూ జె చెయోల్‌, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈవో హాంగ్‌ జు జియోన్‌తో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ నోయిడా, బెంగళూరు ప్రాజెక్టుల విస్తరణలో భాగంగా విశాఖపట్నంలో ఇంజనీరింగ్‌/జీసీసీ ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీసిటీ, పరిసర ప్రాంతాల్లో డిస్‌ప్లే మాడ్యూల్స్‌, సెన్సార్లు, పవర్‌ ఎలక్ట్రానిక్స్ మొదలైన విడిభాగాల తయారీ యూనిట్ల ఏర్పాటును పరిశీలించాలన్నారు. హాంగ్‌ జు జియోస్‌ మాట్లాడుతూ, భారత్‌లో తమ మూడో ప్లాంట్‌ను శ్రీసిటీలో రూ. 5,000 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఎల్జీ కెమ్‌ గ్లోబల్‌ స్ట్రాటజీ సెంటర్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ ఎల్జీ ఓవర్సీస్‌ హోల్డింగ్‌ కంపెనీస్‌ హెడ్‌ యున్‌-జి కోహ్‌తో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. కాకినాడ పోర్టు సమీపంలో పాలిస్టిరిన్‌ తయారీ కేంద్ర సముదాయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మూలపేటలో నాఫ్తా క్రాకర్‌ కేంద్రం, జీవ ఇంధనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సెమీ కండక్టర్స్‌, ఓశాట్‌ (అసెంబ్లింగ్‌, ప్యాకేజింగ్‌ టెస్టింగ్‌) రంగంలో ప్రఖ్యాత అపాక్ట్‌ కంపెనీ సీఈవో సియాంగ్‌ డాంగ్‌ లీతో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. ఏఎస్ఐపీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో అపాక్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కాగా, సియోల్‌ నగరంలో ప్రధాన పరిశోధన, అభివృద్ధి, అవిష్కరణల కేంద్రమైన మాగోక్‌ సైన్స్‌ పార్కును లోకేశ్‌ సందర్శించారు. సియోల్‌ గాంగ్‌సియోగు ప్రాంతంలో 10 లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు దక్షిణ కొరియాలోనే అతిపెద్ద సాంకేతిక అనుసంధాన ప్రాంతంగా ఉందని ప్రశంసించారు.


రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ల తయారీ, ఎగుమతులే లక్ష్యం: కొండపల్లి

వచ్చే రెండేళ్లలో అమరావతిలోనే క్వాంటం కంప్యూటర్లను తయారు చేసి, విదేశాలకు ఎగుమతి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. అమరావతిలో ఏర్పాటుచేస్తోన్న క్వాంటం కంప్యూటర్‌ (133 క్యూబిట్‌ సామర్థ్యం) ఈ ఏడాది డిసెంబరు నాటికి అందుబాటులోకి రానుందని చెప్పారు. మంగళగిరిలోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లో ఎంఎస్ఎంఈ సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, శాస్త్రజ్ఞులతో మంగళవారం నిర్వహించిన వెండర్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాంలో మంత్రి కొండపల్లి మాట్లాడారు. అమరావతిలో నిర్మించే క్వాంటం ట్విన్‌ టవర్స్‌తో కంప్యూటింగ్‌, పరిశోధనలు, సాంకేతిక సంస్థలకు అత్యాధునిక వసతులు లభిస్తాయన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 05:29 AM