చదువుకున్న చోటే ఉద్యోగం
ABN , Publish Date - Jul 16 , 2026 | 04:00 AM
రాష్ట్రంలో చదువుకున్న యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి లోకేశ్ అన్నారు.
యువత పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి మార్చడమే లక్ష్యం
అందుకే దేశవిదేశాలు తిరిగి పెట్టుబడులు తెస్తున్నాం
వైసీపీ హయాంలో దాల్మియా ప్లాంట్ మూతకు నోటీసులు
నేను కోరడంతో వారు ఇప్పుడు ముందుకొచ్చారు
జగన్ రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ: లోకేశ్
దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణకు శంకుస్థాపన
కడప, జూలై 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చదువుకున్న యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి లోకేశ్ అన్నారు. ఇక్కడే యువత ఉద్యోగం పొందాలనే ఉద్దేశంతో దేశవిదేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బుధవారం వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని చిన్నకొమెర్లలో దాల్మియా భారత్ సిమెంట్ విస్తరణ పనులకు లోకేశ్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తాను యువగళం పాదయాత్ర చేస్తుంటే కొందరు ఇక్కడ సభ పెట్టనీయకుండా చేస్తామన్నారని, కానీ జమ్మలమడుగు ప్రజలు తనను నడిపించారని గుర్తుచేసుకున్నారు. జీవితాంతం వారిని గుర్తుపెట్టుకుని రుణం తీర్చుకుంటానని చెప్పారు. కడప ప్రజలు రాష్ట్రానికి మేలు చేసే గొప్పగుణం ఉన్నవారని కొనియాడారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..
2022లో ప్లాంట్ క్లోజర్ నోటీస్ ఇచ్చారు
‘‘వైసీపీ హయాంలో 2022లో ఆనాటి పాలకులు ఈ ప్లాంట్‌ను మూసేసేందుకు క్లోజర్ నోటీస్ ఇచ్చారు. ప్లాంట్ మేనేజ్‌మెంట్‌ను నేను ఢిల్లీలో కలిసి మాట్లాడాను. మీకు అండగా నిలబడతాం మా యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరాను. దీంతో వారు విస్తరణకు ముందుకు వచ్చారు. ఇక్కడ ఇండస్ర్టీలను యువతతో అనుసంధానం చేయాలి. అందుకు తగ్గట్లు ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీలతో అనుసంధానం చేసి వాళ్ల పరికరాలు ఐటీఐల్లో పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం. శ్రీసిటీలో శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి నాంది పలికాం. అక్కడ లెర్న్, ఎర్న్, గ్రాడ్యుయేట్ (ఎల్‌ఈజీ) అనే కొత్త మోడల్ తీసుకొచ్చారు. అంటే 3నెలలు పని నేర్చుకోవచ్చు, 8నెలలు అక్కడే పనిచేయవచ్చు. మళ్లీ 3నెలలు చదివి 4 సంవత్సరాల డిగ్రీ పొందే అద్భుత అవకాశం ఉంది. యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చి అవకాశాలు కల్పించే బాధ్యత మాది. ఆ అవకాశాలను అందిపుచ్చుకునే బాధ్యత మీది’’ అని మంత్రి లోకేశ్ యువతకు పిలుపునిచ్చారు.
బ్రహ్మణి స్టీల్స్‌లో ఉద్యోగాలెక్కడ
దాల్మియా పనులకు భూమిపూజ, సమావేశం అనంతరం మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ‘‘రాయలసీమకు క్యాన్సర్ గడ్డ వైఎస్ జగన్. ఈ ప్రాంతం ఆయన ఆస్తిలాగా భావిస్తాడు. ప్రజలకు మేలు చేయాలి, పెట్టుబడులు తేవాలనే ఆలోచన వారికి లేదు. దానికి అద్భుత ఉదాహరణ బ్రహ్మణీ స్టీల్స్. 300 ఎకరాల్లో మైనింగ్ చేసి ఏకంగా రెడ్‌గోల్డ్ పేరుతో ఐరన్ ఓర్‌ను అమ్మేశారు. దీనితో జగన్‌కు, గాలి జనార్దన్‌రెడ్డికి ఆదాయం వచ్చింది తప్ప కడప యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు’ అన్నారు.
తక్కువ కార్బన్ ఉద్గారాలు: పునీత్ దాల్మియా
ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే అత్యంత పెట్టుబడులకు అనుకూలమైన, ప్రగతిశీల రాష్ట్రంగా ఎదిగిందని దాల్మియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ దాల్మియా అన్నారు. ఈ కొత్త తయారీ కేంద్రం తక్కువ కార్బన్ ఉద్గారాలతో కూడిన భవిష్యత్తు సిమెంటు తయారీపై దీర్ఘకాలిక దృష్టికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ దేశంలోనే ప్రముఖ సిమెంటు సంస్థల్లో దాల్మియా భారత్ ఒకటన్నారు. ఈ విస్తరణ పూర్తయిన తర్వాత దేశంలో అతిపెద్ద సమీకృత ఉత్పత్తి కేంద్రం కడపలోనే ఉంటుందని చెప్పారు.
పుట్టా సుధాకర్ కుటుంబానికి పరామర్శ
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ తల్లి ఇటీవల మరణించారు. జిల్లా పర్యటనలో భాగంగా లోకేశ్ ప్రొద్దుటూరులోని పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంటికి వెళ్లి ఆయన తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా, ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె జడ్పీ ఉన్నతపాఠశాలను లోకేశ్ అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక వసతుల పరిశీలనతో పాటు విద్యార్థుల ఫలితాలు, పాఠశాల పనితీరుపై ఆరాతీశారు.