Share News

‘ఎవరెస్టు’ను అధిరోహిస్తాం

ABN , Publish Date - Apr 15 , 2026 | 06:09 AM

ఎవరెస్టు బేస్‌ క్యాంపు అధిరోహించేందుకు రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు సిద్ధమయ్యారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 8 మంది బాలికలు సహా 21 మంది విద్యార్థుల బృందం...

‘ఎవరెస్టు’ను అధిరోహిస్తాం

  • ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల యాత్ర

  • ప్రారంభించిన లోకేశ్‌

అమరావతి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): ఎవరెస్టు బేస్‌ క్యాంపు అధిరోహించేందుకు రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు సిద్ధమయ్యారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 8 మంది బాలికలు సహా 21 మంది విద్యార్థుల బృందం ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ అధిరోహణ యాత్ర చేపట్టనుంది. ఏప్రిల్‌ 15 నుంచి 30 వరకు ఈ సాహసయాత్ర సాగనుంది. 5364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంప్‌ను రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అధిరోహించనున్నారు. 15వ తేదీ(నేడు) మధ్యాహ్నం నేపాల్‌ రాజధాని ఖఠ్మాండూకు చేరుకుంటారు. అక్కడి నుంచి పర్వతారోహణ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు.


వడపోసి ఎంపిక: ఈ యాత్రకు జిల్లాల నుంచి పోటీలు నిర్వహించి ఫైనల్‌గా 21 మందిని యాత్రకు ఎంపిక చేశారు. మార్చిలో లద్దాఖ్‌లో వారికి ప్రాక్టీస్‌ ఇప్పించారు. అక్కడి పరిస్థితులకు అలవాటయ్యేలా 12 రోజులు శిక్షణ ఇచ్చారు. అనంతరం గండికోటలోని అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో శిక్షణ ఇచ్చి యాత్రకు సంసిద్ధుల్ని చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి లోకేశ్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు. పలు సూచనలు చేశారు. కసి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు. ‘ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ అధిరోహణ యాత్ర ఆసక్తిగా ఉంది. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. మీలాంటి వారిని ప్రోత్సహిస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. మీలో ఏదైనా సాధించగల శక్తి ఉంది. సవాళ్లను అధిగమించేందుకు ప్రపంచాన్ని జయించండి. అలాంటి వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలి. మిమ్మల్ని చిన్నచూపు చూడాలంటే ఎవరైనా సరే భయపడాలి’ అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ విద్య, దివ్యాంగులకు ప్రోత్సాహం, అభ్యసన ఫలితాలపై దృష్టిపెట్టామని మంత్రి తెలిపారు.


మా అమ్మానాన్నలు ప్రోత్సహించారు

నేను పాఠశాలకు కాకుండా ఇంకెక్కడికీ వెళ్లేవాడిని కాను. నా రూపు చూసి అందరూ ఎగతాళి చేసేవారు. నంబూరు వద్ద ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ సెలక్షన్స్‌ జరుగుతున్నాయని మా టీచర్‌ చెప్తే వెళ్లాను. ఎంపికయ్యాను. నువ్వు ఎదగాలని మా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఈ అవకాశం కల్పించిన మంత్రి లోకేశ్‌గారికి, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావుగారికి ధన్యవాదాలు.

- జి.విశ్వాస్‌, పదో తరగతి విద్యార్థి, రామవరప్పాడు జడ్పీ హైస్కూల్‌, విజయవాడ

చేసి చూపిస్తానని చెప్పా

ఎవరెస్టు శిఖర అధిరోహణకు గండికోటలో శిక్షణ ఇచ్చారు. మొదట్లో మా నాన్న వద్దన్నారు. ఫ్రెండ్స్‌ కూడా చేయలేవన్నారు. మా అమ్మ మాత్రం వెళ్లాలని పట్టుబట్టింది. నేను చేసి చూపిస్తానని చెప్పా. ఇలాంటి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు.

- పి.రూప సాయిశ్రీ, తొమ్మిదో తరగతి విద్యార్థిని, గొల్లపాలెం జడ్పీ హైస్కూల్‌, కాకినాడ జిల్లా.

మైనస్‌ డిగ్రీల చలిలో ట్రెక్కింగ్‌ చేశాం

నేను ఇల్లు, కాలేజీ తప్ప ఎక్కడికీ వెళ్లను. తిరుపతిలో సెలక్షన్స్‌ ఉన్నాయని, నీ కష్టమే నీకు విజయం తీసుకొస్తుందని, ప్రయత్నించమని మా టీచర్లు శ్యామల, రాజశ్వరిగార్లు చెప్పారు. శిక్షణలో లద్దాఖ్‌లో మైనస్‌ 5డిగ్రీల చలిలో ట్రెక్కింగ్‌ చేశాం.

- బి.సింధు, ఇంటర్‌ విద్యార్థిని, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, న్యూపేట్‌, తిరుపతి జిల్లా

Updated Date - Apr 15 , 2026 | 06:09 AM